అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో అమలుచేస్తున్న పలు సంక్షేమ పథకాలకు సంబంధించి అర్హత ఉండీ ఇప్పటి వరకూ పథకాన్ని పొందలేని వారికోసం ముఖ్యమంత్రి వైయస్ జగన్ జగనన్న సురక్ష పేరుతో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ద్వారా సర్టిఫికేట్లు పొందిన వారికి వారి అర్హతా ప్రమాణాల ఆధారంగా పథకాలను మంజూరు చేస్తున్నారు. తాజాగా వైయస్సార్ ఆసరా పథకం ద్వారా సామాజిక పెన్షన్లు అందుకుంటున్న వారికి ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది.
ఇప్పటివరకూ పెన్షన్ రాలేదని బాధపడుతున్న వారికి ఇది నిజంగా శుభవార్తే. జగనన్న సురక్ష పథకం ద్వారా గుర్తించిన వారిని ప్రభుత్వం తాజాగా ప్రభుత్వ సంక్షేమ పథకాల లబ్దిదారుల జాబితాలో చేరుస్తోంది. క్షేత్రస్ధాయి పరిశీలన అనంతరం వీరికి పెన్షన్లు పంపిణీ చేయబోతోంది. దీంతో ఈనెలలో పెన్షన్ల చెల్లింపు తేదీని పొడిగించింది. వైయస్సార్ ఆసరా పథకం కింద ప్రభుత్వం పెన్షన్ల పంపిణీని ప్రతీ నెల ఒకటో తేదీ నుంచి ఐదో తేదీలోపు పూర్తి చేస్తోంది.
వాలంటీర్లు స్వయంగా లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి పెన్షన్లు అందజేస్తున్నారు. అయితే ఈసారి మాత్రం కొత్త లబ్దిదారుల చేరిక, వారి పేర్లతో జాబితాలను అప్ డేట్ చేయడం వంటి కారణాలతో పెన్షన్ల చెల్లింపు తేదీని తొలుత ఈనెల 7వ తేదీకి పొడిగించింది. అయితే తాజాగా దీన్ని ఈనెల 10వరకూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 10వ తేదీ లోపు అందరికీ పెన్షన్లు అందబోతున్నాయి.
లక్ష మందికి లబ్ది ?!
రాష్ట్రంలో వైయస్సార్ ఆసరా పథకం కింద ప్రస్తుతం లబ్దిదారులకు నెలకు రూ.2750 చొప్పున పెన్షన్ చెల్లిస్తున్నారు. ఈ మొత్తం వచ్చే ఏడాది కల్లా 3 వేలకు చేరాల్సి ఉంది. ఈ నేపథ్యంలో అర్హత ఉండీ పెన్షన్ అందని లక్ష మందికిపైగా లబ్దిదారుల్ని తాజాగా ఈ పథకంలో చేర్చారని ప్రాథమికంగా అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. వీరికి కూడా కలిపి ప్రతీ నెలా పెన్షన్ చెల్లించబోతున్నారు. ఈ ప్రక్రియలో జరుగుతున్న ఆలస్యం కారణంగా కేవలం సెప్టెంబర్ నెల వరకే 10వ తేదీ వరకూ పెన్షన్ల చెల్లింపు తేదీని పొడిగించినట్లు తెలుస్తోంది. వచ్చే నెల నుంచి తిరిగి 5వ తేదీ వరకూ పెన్షన్లు చెల్లిస్తారు.