Friday, November 22, 2024

26న కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం ప్రారంభం…

న్యూఢిల్లి : ఈ నెలాఖరున కొత్త పార్లమెంట్‌ భవనం ప్రారంభమయ్యే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. 2014న నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మే 26న కొత్త పార్లమెంట్‌ భవనాన్ని ప్రధాని ప్రారంభిస్తా రని తెలిపాయి. అయితే జులై మాసంలో ప్రారంభమయ్యే పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాలు కొత్త పార్లమెంట్‌ భవనంలో జరిగే అవకాశం లేదని చెప్పాయి. 2023లో జరిగే జీ20(గ్రూప్‌ 20) శిఖరాగ్ర సదస్సుకు భారత్‌ అధ్యక్షత వహిస్తు న్నది. ఈ నేపథ్యంలో జీ20 దేశాల పార్లమెంట్‌ స్పీకర్ల సమావేశం కొత్త భవనంలో జరిగే అవకాశం ఉంది. త్రికోణపు ఆకృతిలోని పార్లమెంట్‌ భవన నిర్మాణం 2021 జనవరి 15న ఆరంభమైంది. 2022 ఆగస్టు నాటికి పూర్తి కావాల్సి ఉంది. కొత్త పార్లమెంట్‌ భవనానికి ఏర్పాటు చేసిన మూడు ప్రధాన ద్వారాలకు జ్ఞాన్‌ ద్వార్‌, శక్తి ద్వార్‌, కర్మ్‌ ద్వార్‌ అని నామకరణం చేశారని సంబంధిత వర్గాలు తెలిపాయి.

భవనంలోకి ప్రవేశించడం కోసం ఎంపీలు, వీఐపీలు, సందర్శకులకు విడివిడిగా ద్వారాలు ఉన్నాయని వెల్లడించాయి. పార్లమెంట్‌ భవనానికి ప్రత్యేక ఆకర్షణగా కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌ నిలుస్తుంది. దేశ ప్రజాస్వామ్య వారసత్వ సంపదను ప్రతిబింబించేలా నిర్మించిన కాన్‌స్టిట్యూషన్‌ హాల్‌లో భారత రాజ్యాంగం తాలూకు అసలు ప్రతిని ఉంచుతారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. మహాత్మా గాంధీ, జవహర్‌లాల్‌ నెహ్రూ, సుభాష్‌ చంద్రబోస్‌తో పాటుగా దేశ ప్రధాన మంత్రుల చిత్రపటాలను పార్లమెంట్‌ భవనంలో ఏర్పాటు చేస్తారు. అర్థశాస్త్ర నిపుణుడు, విజ్ఞాన ఖని కౌటిల్యుడి చిత్ర పటంతో పాటుగా కోణార్క్‌లోని సూర్య దేవాలయంలో ప్రపంచ ప్రసిద్ధి చెందిన చక్రం నమూనాను కూడా ఏర్పాటు చేస్తారని వెల్లడించాయి. 64,500 చ.మీ. విస్తీర్ణంలో నాలుగు అంతస్తుల్లో నిర్మితమవుతున్న పార్లమెంట్‌ భవనంలో 1,224 ఎంపీలు ఆశీనులు కాగలరు. పార్లమెంట్‌ భవనంలో ఒక లైబ్రరీ, అనేక కమిటీల కోసం గదులు, డైనింగ్‌ గదులు ఉన్నాయి. పార్లమెంట్‌ కొత్త భవనాన్ని రూ.970 కోట్ల అంచనా వ్యయంతో టాటా ప్రాజెక్ట్స్‌ నిర్మిస్తున్నది.

Advertisement

తాజా వార్తలు

Advertisement