Wednesday, November 20, 2024

ధ‌ర‌ణిలో కొత్త ఆప్ష‌న్‌.. పోట్‌ ఖరాబ్ కాల‌మ్ అందుబాటులోకి.

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ: ధరణిలో కొత్తగా పోటు ఖరాబ్‌ కాలమ్‌ అందుబాటులోకి రానున్నది. వ్యవసాయానికి అనువుగాలేని భూములను ప్రత్యేక ఖాతాలో రికార్డు చేసి ధరణిలో పొందుపర్చేలా సర్కార్‌ కార్యాచరణ సిద్ధం చేసింది. ఈ మేరకు కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ పోటు ఖరాబ్‌ అనే ప్రత్యేక కాలమ్‌లో వ్యవసాయ సాగు వినియోగానికి అక్కరకురాని భూములను చేరుస్తారు. వీటిని సేత్వార్‌, రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయనున్నారు. ఈ ఖాతాలో పేర్కొనే వాటిలో పశువుల షెడ్లు, పేడ గుంటలు, ఫామ్‌ హౌజ్‌లు, భవనాలు, వాటితో కప్పివేసిన అనుబంధ ప్రాంతాలను చేర్చనున్నారు. అదేవిధంగా రాళ్లు గుట్టలతో కల్పబడిన ప్రాంతం, కట్టలు, ఇరిగేషన్‌ ఛానల్‌, వాగులు, వర్రెలతో నిండి ఉన్న ప్రాంతాలను కూడా ఇందులో చేర్చనున్నారు. ప్రైవేటు అటవీ భూములను కూడా ఈ వర్గీకరణలో పేర్కొంటారు. అదేవిధంగా రైతులు తమ వ్యవసాయ భూముల్లో ఏర్పాటు చేసుకున్న ట్రాకర్ట్‌ షెడ్లు, నూర్పిడి ప్రాంతాలు, భూమి కోత, వరదల సమయంలో నష్టానికిగురై, మట్టితవ్వకాల ద్వారా పనికిరాకుండా పోయిన భూములు, ట్రాక్టర్‌, హార్వెస్టర్‌ల పార్కింగ్‌, వాటికి వేసిన రోడ్లు వంటివాటిని పోట్‌ ఖరాబ్‌ విభాగంలో చేర్చాలని సీఎస్‌ సోమేష్‌కుమార్‌ ఆదివారంనాడు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. పోట్‌ ఖరాబ్‌ ఏరియా వివరాలను రికార్డులలో పొందుపర్చాలని, ఇందుకు నిర్దేశిత విధానాలను అమలు చేయాలని సూచించారు.

రైతు నేరుగా తన పట్టాదార్‌ పాస్‌పుస్తకం వివరాలను, భూమి వివరాలను తెలుపుతూ ఆర్డీవోకు దరఖాస్తు చేయాలి. పోట్‌ ఖరాబ్‌గా క్లెయిమ్‌ చేసిన భూమిని ఏ వినియోగానికి వాడుతున్నారో ఇందులో పేర్కొనాలి.

  • ఆర్డీవో సంబంధిత దరఖాస్తు ఆధారంగా ఆయా ప్రాంతాన్ని స్వయంగా క్షేత్రస్థాయిలో విచారించి పోట్‌ ఖరాబ్‌గా నమోదు చేయాలి. ఇందుకు ప్రోసీడింగ్‌లను జారీ చేస్తారు.
  • ఆర్డీవో ఆమోదం తర్వాత పోట్‌ ఖరాబ్‌ వివరాలను పట్టాదార్‌ పాస్‌ పుస్తకంలోని రిమార్కు కాలమ్‌లో నమోదు చేస్తారు.
  • ఆయా వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరుస్తారు.

అయితే రాష్ట్రంలోని రైతులందరికీ సాగుతో సంబంధం లేకుండా రైతుబంధు సాయం అందిస్తున్న సర్కార్‌ తాజా వివరాలను సేకరించడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇలా వ్యవసాయ వినియోగానికి అక్కరకురాని భూములను ప్రత్యేకంగా పోట్‌ ఖరాబ్‌ విభాగంలో చేర్చి రైతుబంధు అందజేతలో ప్రామాణికంగా తీసుకొని ఆ మేరకు కోత పెడ్తారనే అభిప్రాయం వినిపిస్తోంది. అయితే ప్రభుత్వం ఇంతవరకు వ్యవసాయ సాగులో ఉంటేనే రైతుబంధు అందిస్తామనే ప్రకటనను ఎక్కడా చేయలేదు. ఇప్పటివరకు భూమి ఉన్న ప్రతీ రైతుకు సాగుతో సంబంధం లేకుండా పంట సాయంగా రైతుబంధును అందిస్తున్నది.

ప్రభుత్వం 100 రోజులపాటు నిర్వహించిన భూ రికార్డుల పరిశీలనతో 1,12,077 చదరపు కిలోమీటర్ల రాష్ట్ర భూభాగానికి చెందిన వివరాలు ఖాతాల వారీగా ప్రభుత్వం సేకరించింది. 2.80 కోట్ల ఎకరాల భూభాగంలో 1.42కోట్ల ఎకరాల వివాదరహిత వ్యవసాయ భూమి ఉందని గుర్తించగా, 17.89లక్షల ఎకరాల భూమి వివిధ న్యాయపరమైన వివాదాల్లో ఉన్నట్లుగా తేల్చారు. మరో 11.95లక్షల ఎకరాల భూమి రైతుల వద్ద పడావుగా ఉండి సేద్యానికి దూరంగా ఉందని గుర్తించారు. 84.00లక్షల ఎకాల చెరువులు, కుంటలు, కాలువలు, రైల్వేలైన్‌, సబ్‌స్టేషన్లు, విద్యా సంస్థలు, ఆస్పత్రులు, ఇతర ప్రభుత్వ ఆస్తుల కింది భూములు, కోర్టు కేసుల్లోని అటవీ భూములు ఉన్నాయి. దాదాపు 97 వేల ఎకరాల అసైన్డ్‌ భూముల్లో ఇతరులు కబ్జాల్లో ఉన్నట్లుగా తేలింది.
కోటి ఎకరాలను సాగులోకి తేవాలన్న సర్కార్‌ లక్ష్యానికి ప్రభుత్వం చేరువైంది. సీఎం కేసీఆర్‌ సంకల్పానికి కావాల్సిన అసలైన సాగు భూముల లెక్కలను అధికారికంగా నమోదు చేశారు. ఇప్పటివరకు లెక్కల్లోకి ఎక్కని వారసత్వ భూములు, కొనుగోలు చేసినా మ్యుటేషన్‌ కానిభూములు, పట్టాదార్‌ పాస్‌పుస్తకాల్లో నమోదు చేయని భూముల లెక్కలు స్పష్టంగా బైటికి వచ్చాయి. తద్వారా అసలు రైతు లెక్క తేల్చారు.

మరోవైపు వ్యవసాయ భూములను ఎటువంటి మార్పిడి లేకుండానే ఇతర అవసరాలకు మళ్లించిన తీరు, నాన్‌ కన్వర్షన్‌ అయిన భూములను తిరిగి సాగులోకి మళ్లించాలన్న సర్కార్‌ సంకల్పం ప్రాజెక్టుల పూర్తితో నూటికి నూరుపాళ్లు నెరవేరింది. అయితే సాగుకు పూర్వవైభవం తేవాలంటే కొన్ని కఠిన నిర్ణయాలు తప్పవని ప్రభుత్వం భావిస్తోంది. రానున్న రోజుల్లో కర్నాటక, మహారాష్ట్రల తరహాలో వ్యవసాయేతరులు వ్యవసాయ భూములు కొనుగోలు చేయకుండా చర్యలు తీసుకునే అంశం ప్రభుత్వం పరిశీలించే అవకాశం ఉంది. తద్వారా వ్యవసాయ భూముల కొనుగోళ్లపై నియంత్రణకు ప్రయత్నించవచ్చు. కర్నాటక భూ రెవెన్యూ చట్టం1964లోని సెక్షన్‌ 109 ప్రకారం రైతులు కాకుండా మరెవరూ వ్యవసాయ భూములు కొనుగోలు చేయలేరు. ఇక పంజాబ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, కర్ణాటక, హర్యానలలో రైతులు మాత్రమే సాగు భూమిని కొనుగోలు చేయాలని ఉంది. వ్యవసాయ పరిరక్షణ, ఆహార సంభోభ నివారణకు ప్రభుత్వం ఈ దిశగా కృషి చేసేందుకు అవకాశం ఉంది. 1బీ రికార్డుల్లో వ్యవసాయ భూమిగా, సాగు రైతుగా నమోదు చేయించుకోవడం రానున్న కాలంలో వ్యవసాయాభివృద్దికి ప్రతీకగా కనిపిస్తోంది.

- Advertisement -

కోటి ఎకరాల కొత్త సాగు భూమి లక్ష్యం సర్కార్‌ వేస్తున్న అడుగులకు అనువుగా ప్రాజెక్టులను నిర్మిస్తోంది. అయితే సాగులోకి రావాలంటే ఆ స్థాయిలో భూములుండాలి…రాష్ట్రంలోని మొత్తం సాగుభూమి 12 కోట్ల ఎకరాలు కాగా ఏటా 10లక్షల ఎకరాలు సాగుకు దూరమవుతోంది. ఈ నేపథ్యంలోనే వ్యవసాయాన్నిఆదుకునేందుకు సర్కార్‌ రంగంలోకి దిగింది. ఈ క్రమంలో తొలుత ఎకరాకు ఏడాదికి రూ. 8వేలను సాయంగా ప్రకటించింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement