తెలంగాణ ప్రభుత్వం లాక్డౌన్ ఎత్తివేసి థియేటర్లు ఓపెన్ చేసుకోవచ్చని అనుమతులు జారీ చేసినా.. ఇప్పట్లో థియేటర్లు ఓపెన్ అయ్యే పరిస్థితులు మాత్రం కనిపించడం లేదు. కారణం తెలుగు సినిమాకు ఏపీలోనూ మంచి బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ కూడా థియేటర్లు ఓపెన్ చేశాకే కొత్త సినిమాలు విడుదలవుతాయని తెలుస్తోంది. తెలుగు సినిమాకి 60 శాతం మార్కెట్ అక్కడే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో విడుదలైతేనే అందరికీ మేలు జరుగుతుంది. అందుకే నిర్మాతలు ఆంధ్రప్రదేశ్‌లోనూ అనుమతులు ఇచ్చేవరకు వేచి చూడక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.
సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఇప్పట్లో తెరుచుకునే అవకాశాలు లేకపోయినా మల్టీప్లెక్సులు మాత్రం సిద్ధంగా ఉన్నాయి. తెలంగాణలో 600కిపైగా థియేటర్లు ఉన్నాయి. అందులో 250కిపైగా ఉన్న మల్టీప్లెక్స్‌ల్లో ప్రదర్శనలు షురూ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మల్టీప్లెక్స్ థియేటర్లు ఒక రాష్ట్రంతో సంబంధం లేకుండా దేశవ్యాప్తంగా ఒకే గొడుగు కింద ఉంటాయి.