Tuesday, November 19, 2024

జిల్లాల‌కు కొత్త‌రూపు!

తెలంగాణ రాష్ట్రంలో జిల్లాల రూపురేఖలు మార్చేం దుకు రేవంత్‌రెడ్డి ప్రభుత్వం వేగంగా అడు గులు వేస్తోంది. జనాభా, అసెంబ్లి, లోక్‌సభ నియోజకవర్గాలు, నదులు, ప్రాజెక్టులు వంటి కీలక మైన అంశాలను పరిగణలోకి తీసుకుని జిల్లాల ప్యూనర్విభజన ప్రక్రియకు శ్రీకారం చుట్టాలన్న నిర్ణయానికి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి వచ్చినట్టు తెలుస్తోంది. వచ్చే నెల చివరిన లేదా మార్చిలో నిర్వహించే అసెంబ్లి బడ్జెట్‌ సమావేశాల్లో జిల్లాల మార్పులు, చేర్పులపై పూర్తిస్థాయిలో చర్చించి తుది నిర్ణయానికి రావాలని అన్నిపార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించి ముందు కెళ్లాలన్న అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది.

తెలంగాణ రాష్ట్రాన్ని పదేళ్లపాటు పాలించిన బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేసిందని, కనీసం విపక్ష పార్టీల నేతలతో చర్చిం చకుండా అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయకుండాఒంటెద్దుపోకడతో పాత జిల్లాలను విభజించి కొత్త వాటిని ఏర్పాటు చేసిందని అధికార పార్టీ కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. అశాస్త్రీయంగా జిల్లాలను ఏర్పాటు చేయడం మూలంగా అధికార యంత్రాంగం అనేక సమస్య లను ఎదుర్కొంటోందని పాలక పక్షం చెబు తోంది. జిల్లాల విభజనలో జరిగిన పొర పాట్లను, చేసిన తప్పిదాలను సరిదిద్ది పటి ష్టమైన యంత్రాగాన్ని ప్రజల ముందుకు తీసుకెళ్లాలన్న పట్టుదలతో సీఎం రేవంత్‌రెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లాలను విడదీసి కొత్త జిల్లాలను ఏర్పాటు చేసే సమయంలో ఒక పద్దతిని అవలంభించలేదన్న విమర్శలు న్నాయి. ఎవరికి పడితే వారికి అడిగిందే తడవుగా అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, చివరికి మండలాలను ప్రకటించారని చెబుతున్నారు.

- Advertisement -

ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న జిల్లాల పునర్విభజనలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు సమాచారం. గతంలో నిజామాబాద్‌ జిల్లా ఉండేదని.. కొత్తగా ఇదే జిల్లాలో కామారెడ్డి జిల్లాను ఏర్పాటు చేశారని, అలాగే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కొత్తగూడెం జిల్లా చేరిందని, ఇదే తరహాలో పెద్ద జిల్లాలో మూడు చిన్న జిల్లాలో రెండు ఉండేలా పునర్విభన చేసేలా ప్రభుత్వం ప్రాథమిక కసరత్తుకు శ్రీకారం చుట్టినట్టు సమాచారం. అవసరమైన చోటే కొత్త రెవెన్యూ డివిజన్లను, మండలాలను కొన సాగించేలా చర్యలు తీసుకోవాలని భావి స్తున్నట్టు సమాచారం.
పునర్విభజనకు స్వయం ప్రతిపత్తి సంస్థ ఏర్పాటు!
జిల్లాల పునర్విభజనకు ఓ కమిషన్‌ను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. విశ్రాంత హైకోర్టు లేదా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి లేదా న్యాయమూర్తి నేతృత్వంలో ఒక స్వయం ప్రతిపత్తి గల ఉన్నత స్థాయి కమిటీని నియమించి జిల్లాల ఏర్పాటుపై అధ్యయనం చేసే నిర్ణయానికి ప్రభుత్వం వచ్చినట్టు చెబుతున్నారు. ఈ కమిటీ ఆయా జిల్లాలు, నియోజక వర్గాలు, మండలాలు, చివరికి గ్రామా లలో పర్యటించి సభలను నిర్వహించి ప్రజాభిప్రాయాలను సేకరిస్తుందని చెబుతున్నారు. ప్రజలతో ముఖాముఖి సమావేశమై వారి అభిప్రాయాలను తీసుకుని పూర్తిగా శాస్త్రీయ పద్ధతిలో, రాజకీయ జోక్యం లేకుండా నిర్ణయాలు ప్రకటించేలా చూడాలని, ప్రభుత్వం నియమించే కమిషన్‌ పూర్తిగా 119 నియోజకవర్గాలను తిరిగేలా చర్యలు తీసుకోనున్నట్టు సమాచారం.

అక్కడ మునిసి పాలిటీలు, మండలాలు ఎన్ని ఉన్నాయి? అర్బన్‌ ఏరియాలు, రూరల్‌ ఏరియాలు ఎలా ఉన్నాయన్న వివరాలన్నింటినీ తెలుసుకుంటారని తెలుస్తోంది. కొత్త మండలాలను ఏర్పాటు చేశారే తప్ప… మండలానికి కార్యా లయం అందుబాటులో లేక ఎక్కడో ఒక చోట భవనానికి, గదికి బోర్డు తగిలించి కార్యాకలాపా లను నిర్వహిస్తున్నారని, మండల రెవెన్యూ అధికారి, సిబ్బంది కూర్చు నేందుకు కుర్చీలు కూడా లేకపోవడం బట్టి చూస్తుంటే అంత హడావుడిగా ఎవరికోసం మండల, రెవెన్యూ కార్యాల యాలు ఏర్పాటు చేశారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఒక పాఠశాల, ఆస్పత్రి, జూనియర్‌ కాలేజీ, పోలీస్‌ స్టేషన్‌ వంటివి మండలాల్లో ఏవీ లేవని, వీటి కోసం ప్రజలు సమీపంలోని ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని చెబుతున్నారు. ఇందుకు సీఎం రేవంత్‌ ప్రాతినిథ్యం వ‌హిస్తున్న కొడంగల్‌ను ఉదాహరణగా చూపిస్తున్నారు. ఈ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు హడావుడిగా మూడు మండలాలు ఇచ్చి, గోడలకు బోర్డులు తగిలించారని చెబుతున్నారు.

ఉమ్మడి మహబూబ్‌ నగర్‌ జిల్లా నారాయణ్‌ పేట్‌ డివిజన్‌లో ఒకప్పుడు 18 మండలాలు ఉండేవని, ఒక డీఎస్పీ కింద 18 మండలాలు పనిచేసేవని గుర్తు చేస్తున్నారు. ఇప్పుడు వనపర్తి జిల్లాలో ఆరు మండలాలను ఎనిమిది మం డలాలు చేశారని, ఆ ఎనిమిది మండలాలకు ఒక ఎస్పీని నియమించారని, కేవ లం మాజీ మంత్రి నిరంజన్‌ రెడ్డిని సం తృప్తి చేయాలన్న ఉద్దే శంతో అప్పటి సీఎం కేసీఆర్‌ వనపర్తిని జిల్లాగా ప్రకటించా రని స్వయంగా సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యాని స్తున్న సంగతి తెలిసిందే. జిల్లాల పునర్విభజన ప్రక్రి యను రాజకీయంగా చేస్తే ఆరోపణలు వస్తాయని, అలా కాకూడదనే ఈ తరహా ప్రక్రియకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని, అందుకే జ్యుడీషియల్‌ కమిషన్‌ను ఏర్పాటు చేసి స్వతంత్రంగా వ్యవహరించి నివేదిక ఇవ్వాలన్నదే ప్రభుత్వ నిర్ణయమని అధికారులంటున్నారు. ఇలా చేయడం వల్ల పెద్దగా వివాదాలు ఉండవని, అందుకే అదే పద్ధతిలో చేయాలని ప్రభుత్వం భావిస్తోందని ఉన్నతాధికా రులు చెబుతున్నారు.
మూడు లేదా నాలుగు జిల్లాలు కానున్న హైద‌రాబాద్‌
హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ జంట నగరాలను మూడు లేదా నాలుగు జిల్లాలుగా విభజించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. 15 అసెంబ్లీ నియోజక వర్గాలు, కోటి మంది జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో ఒకే ఒక జిల్లా ఉండడం మూలంగా పాలనా పరమైన సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ప్రభుత్వం భావిస్తున్నట్టు సమాచారం. హైదరాబాద్‌ పాత బస్తీతో పాటు ఒకటి రెండు నియోజకవర్గాలను కలిపి ఒక జిల్లాగా, సికింద్రాబాద్‌ ప్రాంతాన్ని మరొక జిల్లాగా, కంటోన్మెంట్‌ ప్రాంతాన్నంతా ఇంకో జిల్లాగా ప్రకటించాలన్న యోచనలో ప్రభుత్వం ఉన్నట్టు సమాచారం. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గత ప్రభుత్వం మేడ్చెల్‌, వికారాబాద్‌ జిల్లాలను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాలు పూర్తి అశాస్త్రీయంగా విభజించారని భావిస్తోన్న ప్రభుత్వం ఈ జిల్లాలను పునర్విభజించాలన్న యోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రతి లోక్‌సభ నియోజకవర్గానికి ఒక జిల్లా ఉండాలన్న ప్రతిపాదనతో పాటు జనాభా, జిల్లా విస్తీర్ణం తదితర అంశాలను గమనంలోకి తీసుకుని జిల్లాల పుర్విభజనకు శ్రీకారం చుట్టాలని సీఎం రేవంత్‌ రెడ్డి ప్రతిపాదించినట్టు ప్రచారం జరుగుతోంది.
ఉమ్మడి రాష్ట్రంలో పది జిల్లాలు
తెలంగాణ ఏర్పాటు కాక ముందు ఉమ్మడి రాష్ట్రంలో 23 జిల్లాలుండగా తెలంగాణాలో 10, ఆంధ్రప్రదేశ్‌లో 13 జిల్లాలుండేవి. పరిపాలనా సౌలభ్యం కోసం అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌ సుదీర్ఘ అధ్యయనం చేసి దశలవారీగా కొత్తగా 23 జిల్లాలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇష్టారాజ్యంగా కొత్త జిల్లాలను ఏర్పాటు చేసి అధికారులకు పనులు లేకుండా చేశారని, దీనివల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని భావిస్తున్న కాంగ్రెస్‌ ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి జిల్లాల పునర్విభజనకు నడుం బిగించాలని నిర్ణయించారు. గతంలో అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజనకు అనుసరించిన విధానాన్నే ఇందుకు అమలు చేయాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement