Thursday, November 21, 2024

ఢిల్లీ టీటీడీకి కొత్త స్థానిక సలహా కమిటీ.. ప్రమాణ స్వీకారం చేసిన సభ్యులు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ఢిల్లీ తిరుమల తిరుపతి దేవస్థానం స్థానిక సలహా కమిటీ (ఎల్‌ఏసీ) సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం దేశ రాజధానిలో ఘనంగా జరిగింది. టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి, స్థానిక సలహా సంఘం అధ్యక్షురాలు, ఉత్తర భారత టీటీడీ ఇంఛార్జి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఏఈవో ఏ.వి ధర్మారెడ్డి సమక్షంలో స్థానిక సలహా మండలి సభ్యులు గురువారం ఢిల్లీలోని మందిర్ మార్గ్‌లో ఉన్న శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షులుగా వై.గంగారావు, స‌భ్యులుగా వినోద్ సిన్హా, టి.విజ‌య్ రాఘ‌వ్ మూర్తి, సంజీవరావు, సంజీవ్ నందా, ఆర్ఎల్‌.శాలి, ఆర్‌.స‌దానంద‌రెడ్డి, ఎన్‌.నాగ‌స‌త్యం, చంద్ర‌శేఖ‌ర‌రావు, బి.మ‌హేష్‌కుమార్‌, ల‌లిత్ భాసిన్‌, కె.పి.సుంద‌ర్‌రావు, జ‌య‌కుమార్ భ‌ర‌ద్వాజ్‌, దినేష్ కుమార్‌, బి.మ‌ద‌న మోహ‌న్ రెడ్డి, అనిల్ క‌పూర్, ఎ.కృష్ణ‌మోహ‌న్‌, స‌బితారెడ్డి రామిరెడ్డి, ఆచార్య గీతాసింగ్‌, ఆచార్య యోగేష్ సింగ్‌, ఆచార్య సి.షీలారెడ్డి, జె.వి.రామ‌మూర్తి నియమితులయ్యారు. ఆలయంలో జరిగిన ప్రత్యేక పూజా కార్యక్రమాల్లో వీరంతా పాల్గొన్నారు. ఢిల్లీ సహా ఉత్తరాది రాష్ట్రాల్లో టీటీడీ ఆలయ కార్యక్రమాలు, ఆలయ అభివృద్ధి కార్యక్రమాలను స్థానిక సలహా మండలి సభ్యులు పర్యవేక్షిస్తారు.

ప్రమాణ స్వీకార కార్యక్రమం అనంతరం వై.వి సుబ్బారెడ్డి మీడియాతో మాట్లాడుతూ… టీటీడీ ఢిల్లీ దేవాలయ కమిటీ నియామకం ఛైర్మన్ వేమిరెడ్డి ప్రశాంతి ఆధ్వర్యంలో జరిగిందని చెప్పారు. స్వామి వారి సేవలను దేశ రాజధాని ఢిల్లీతో పాటు, ఉత్తర భారతదేశంలో విస్తృతం చేయడానికి కమిటీ సహాయపడుతుందన్నారు. ఢిల్లీ ఆలయంలో వాస్తు నిపుణులు సూచించినట్లు మార్పులు చేయాలని నిర్ణయించామని, వచ్చే నెలలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహించనున్నట్టు వై.వి.సుబ్బారెడ్డి వివరించారు. ధర్మప్రచార వాహనం ఏర్పాటు చేసి స్వామి వారి ప్రచారం నిర్వహించామని ఆయన వెల్లడించారు. జమ్మూ- కాశ్మీర్‌లో స్వామి వారి ఆలయ నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నాయని, ఈ సంవత్సరం అక్టోబర్- నవంబర్ కల్లా ప్రారంభించేందుకు ప్రయత్నాలు చేస్తున్నామని వివరించారు. ఉత్తర భారతదేశంలో వివిధ రాష్ట్రాల్లో మరిన్ని స్వామి వారి ఆలయాలు నిర్మించేందుకు సన్నాహాలు చేస్తున్నామని సుబ్బారెడ్డి తెలిపారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement