మద్రాస్ హైకోర్టులో పిల్
దేశంలో 43 శాతం మందికే హిందీ తెలుసు
మిగిలిన వారికి వారివారి ప్రాంతీయ భాషలున్నాయి
ఈ హిందీ పేర్లను ఇంగ్లీష్ లోకి మార్చాలి
విచారణకు స్వీకరించిన డివిజన్ బెంచ్
ఇండియన్ పీనల్ కోడ్, క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ స్థానంలో కొత్తగా తీసుకొచ్చిన మూడు చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లను పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ మద్రాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ నెల ఒకటి నుంచి ఈ చట్టాలు అమలులోకి వచ్చాయి. తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి ఆర్. మహదేవన్, జస్టిస్ మహ్మద్ షఫీక్‌ల డివిజన్ బెంచ్ ముందుకు ఈ పిటిషన్ రానుంది. తూత్తుకుడికి చెందిన న్యాయవాది బి. రామ్‌కుమార్ ఆదిత్యన్ ఈ మూడు కొత్త చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు.
భారతీయ న్యాయ సంహిత-2023, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత-2023, భారతీయ సాక్ష్య అధినియం-2023… ఈ మూడు చట్టాల పేర్లను ఇంగ్లీషులోకి మార్చాలని రామ్‌కుమార్ తన పిటిషన్లో కోరారు. దేశంలో 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్ర పాలిత ప్రాంతాలు ఉన్నప్పటికీ తొమ్మిది రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాల్లో మాత్రమే హిందీ అధికార భాషగా ఉందన్నారు. దేశంలో 43.63% జనాభాకు మాత్రమే హిందీ మాతృభాష అని, మిగిలిన వారు ఇతర భాషలు మాట్లాడుతుంటారని ఆయన ఆయన పేర్కొన్నారు. అయినప్పటికీ, దేశంలోని మూడు ముఖ్యమైన క్రిమినల్ చట్టాలకు హిందీ, సంస్కృతంలో పేర్లు పెట్టడం సమంజసం కాదన్నారు. హిందీ రాని వారికి ఈ చట్టాల పేర్లు ఇబ్బందికరంగా మారుతాయని ఆయన పేర్కొన్నారు.