Tuesday, November 26, 2024

Victory : భారత మహిళా క్రికెట్‌ జట్టు కొత్త చరిత్ర .. తొలిసారిగా ఆసీస్ పై ఘ‌న విజ‌యం

భారత మహిళా క్రికెట్‌ జట్టు చరిత్ర సృష్టించింది. ఆస్ట్రేలియాను మట్టికరిపించి సొంతగడ్డపై చరిత్రాత్మక విజయం అందుకుంది. సమిష్టి ప్రదర్శనతో రాణించి కంగారూ జట్టుపై మొట్టమొదటి టెస్టు గెలుపు నమోదు చేసింది. మరోరోజు ఆట మిగిలి ఉండగానే జయకేతనం ఎగురవేసి సత్తా చాటింది.


కాగా భారత్‌ ఏకైక టెస్టు ఆడేందుకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ముంబైకి వచ్చింది. ఇరు జట్ల మధ్య వాంఖడే వేదికగా డిసెంబరు 21న మ్యాచ్‌ ఆరంభమైంది. టాస్‌ గెలిచిన ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. అయితే, భారత బౌలర్ల దెబ్బకు 219 పరుగులకే తొలి ఇన్నింగ్స్‌ ముగించింది.

అదరగొట్టిన బౌలర్లు, బ్యాటర్లు
పూజా వస్త్రాకర్‌ నాలుగు, స్నేహ్‌ రాణా మూడు, దీప్తి శర్మ రెండు వికెట్లు పడగొట్టి ఆసీస్‌ బ్యాటింగ్‌ ఆర్డర్‌ను కకావికలం చేశారు. ఈ క్రమంలో బ్యాటింగ్‌ ఆరంభించిన భారత్‌కు ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధాన 74 పరుగులతో అదిరిపోయే ఆరంభం అందించారు. మిడిలార్డర్‌లో రిచా ఘోష్‌ 52, జెమీమా రోడ్రిగ్స్‌ 73 పరుగులతో దుమ్ములేపారు. ఇక లోయర్‌ ఆర్డర్‌లో దీప్తి శర్మ 78, పూజా వస్త్రాకర్‌ 47 పరుగులతో అద్వితీయ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నారు. ఇలా బ్యాటర్లంతా సమిష్టిగా రాణించడంతో భారత్‌ మొదటి ఇన్నింగ్స్‌లో 406 పరుగులకు ఆలౌట్‌ అయి ఆధిక్యంలో నిలిచింది.

చెలరేగిన భారత బౌలర్లు.. ఆసీస్‌ పోరాడినా

- Advertisement -

ఈ క్రమంలో రెండో ఇన్నింగ్స్‌ మొదలుపెట్టిన ఆస్ట్రేలియా మూడో రోజు ఆట ముగిసే సమయానికి 90 ఓవర్లలో 5 వికెట్లు నష్టపోయి 233 పరుగులు సాధించింది. ఎలాగైనా తిరిగి పుంజుకోవాలని పట్టుదలగా పోరాడింది. అయితే, భారత బౌలర్ల ముందు ఆసీస్‌ పప్పులు ఉడకలేదు. టాపార్డర్‌, మిడిలార్డర్‌ పర్వాలేదనిపించినా.. నాలుగో రోజు ఆటలో లోయర్‌ ఆర్డర్‌ కుప్పకూలిపోయింది. స్నేహ్‌ రాణా నాలుగు వికెట్లుతో చెలరేగగా.. పూజా ఒకటి, రాజేశ్వరి గైక్వాడ్‌, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ రెండేసి వికెట్లు పడగొట్టి ఆసీస్‌ను కట్టడి చేశారు. దీంతో 261 పరుగులకు ఆస్ట్రేలియా మహిళా జట్టు ఆలౌట్‌ అయింది.

మొట్టమొదటి టెస్టు గెలుపు
ఈ క్రమంలో స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు ఆదివారం నాటి నాలుగో రోజు ఆటలోనే మ్యాచ్‌ను ముగించేసింది. స్మృతి మంధాన 38, జెమీమా రోడ్రిగ్స్‌ 12 పరుగులతో ఆఖరి అజేయంగా నిలవగా.. 18.4 ఓవర్లలోనే టార్గెట్‌ను పూర్తి చేసింది. మంధాన ఫోర్‌ బాది విజయాన్ని ఖరారు చేయగా.. ఎనిమిది వికెట్ల తేడాతో జయభేరి మోగించింది.

కాగా టెస్టుల్లో ఆస్ట్రేలియాపై భారత మహిళా క్రికెట్‌ జట్టుకు ఇదే తొలి విజయం. అంతేకాదు 1984 తర్వాత సొంతగడ్డపై ఆసీస్‌తో టెస్టు ఆడటం కూడా ఇదే మొదటిసారి అది కూడా వాంఖడేలో!! ఇక గతంలో భారత్‌- ఆసీస్‌ మహిళా జట్లు పదిసార్లు ముఖాముఖి పోటీపడగా.. ఆసీస్‌ నాలుగుసార్లు గెలిచింది. ఆరుసార్లు మ్యాచ్‌ డ్రా అయింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement