తాలిబన్ల వశమైన ఆఫ్ఘనిస్తాన్‌లో మహిళలపై అణచివేతలు కొనసాగుతూనే ఉన్నాయి. అక్కడ ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులకు తాలిబన్లు తాజాగా ఓ హుకుం జారీచేసినట్లు తెలిసింది. తమ స్థానంలో బంధువులైన పురుషులను ఉద్యోగాలకు పంపవలసిందిగా మహిళా ఉద్యోగులకు తాలిబాన్లు ఆదేశాలు జారీచేసినట్లు ‘ది గార్డియన్’ వార్తాసంస్థ ఓ కథనంలో పేర్కొంది. తన స్థానంలో ఉద్యోగానికి పురుషుడిని పంపాల్సిందిగా తాలిబాన్ అధికారుల నుంచి తనకు ఫోన్‌కాల్ వచ్చినట్లు ఓ మహిళా ఉద్యోగి తెలిపారని గార్డియన్ వెల్లడించింది.
ఆర్థికశాఖలో ఉద్యోగిగా ఉన్న సదరు మహిళ ‘తాలిబాన్లు అధికారంలోకి వచ్చిన తర్వాత తనను డిమోట్ చేశారని, తన జీతాన్ని 60వేల ఆఫ్ఘన పౌండ్ల నుంచి 12 వేల పౌండ్లకు తగ్గించారని తెలిపారు. దీంతో తన కుమారుని స్కూల్ ఫీజు కూడా కట్టలేకపోతున్నాను. ఈ విషయమై పై అధికారులను అడిగితే పనిచేయడం ఇష్టంలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లిపో అని నిర్మొహమాటంగా చెప్పేశారు’ అని మహిళ వాపోయారు.
తాజాగా మరో మహిళకు తన స్థానంలో పురుషులైన బంధువులను భర్తీ చేయాలని కోరుతూ మంత్రిత్వశాఖలోని మానవవనరుల విభాగం నుంచి తనకు కాల్ వచ్చిందని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా తాను ఈ ఉద్యోగం చేస్తున్నట్లు గార్డియన్‌కు వెల్లడించారు. ఆమె బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో మాస్టర్స్ డిగ్రీ చేసింది. మంత్రిత్వ శాఖలో ఒక విభాగానికి అధిపతిగా పనిచేస్తున్నారు.
ఆష్ఘనిస్తాన్ మహిళల ఉపాధిపై ఇటువంటి ఆంక్షల కారణంగా ఆ దేశం ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నట్లు ఐక్యరాజ్య సమితి ఉమెన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సీమా బహోస్ కొద్దిరోజుల క్రితమే ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ పరిస్థితులు ఆఫ్ఘనిస్థాన్ జీడీపీలో 5 శాతం వరకు తక్షణ ఆర్థిక నష్టాలకు దారితీస్తాయని అంచనా వేయబడిందని ఆమె తెలిపారు. దేశం మొత్తం పేదరికంతో విలవిల్లాడుతోంది. ఆహార అభద్రత, పోషకాహార లోపంతో బాధపడుతోంది ఇటువంటి పరిస్థితుల్లో మహిళల ఉపాధిపై వేటు వేయడం సరైన విధానం కాదని ఆమె పేర్కొన్నారు. తాలిబాన్ విధానాలను ప్రపంచ సంస్థలు తీవ్రంగా విమర్శించాయి.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.