Tuesday, November 26, 2024

Delhi | ఓటీటీ చిత్రాలకు కొత్త మార్గదర్శకాలు.. ఇకపై ఓటీటీలోనూ పొగాకు వ్యతిరేక హెచ్చరికలు

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: ఇంతకాలం పాటు థియేటర్లలో ప్రదర్శించే సినిమాలకు మాత్రమే పరిమితమైన పొగాకు వ్యతిరేక ప్రకటనలు, హెచ్చరికల మార్గదర్శకాలను ఓటీటీ ద్వారా ప్రదర్శించే చిత్రాలకు కూడా వర్తింపజేస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఈ మేరకు గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా ‘ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్‌’లో పొగాకు వ్యతిరేక ప్రకటనలపై మార్గదర్శకాలు జారీ చేసింది.

పొగాకు ఉత్పత్తుల కారణంగా కలిగే అనర్థాలను చిత్రం ప్రారంభంలో వీడియో సందేశం రూపంలో ప్రదర్శించడంతో పాటు ఆ ‘కంటెంట్’లో నటీనటులు పొగాకు ఉత్పత్తులను ఉపయోగించిన ప్రతి సందర్భంలోనూ స్పష్టంగా చదవగలిగే పెద్ద అక్షరాలతో హెచ్చరిక సందేశాలను చూపించాలని మార్గదర్శకాల్లో పేర్కొంది.  “పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతుంది” లేదా “పొగాకు చంపుతుంది” అనే హెచ్చరికలతో కూడిన సందేశాలను ప్రదర్శించాల్సిందిగా తెలిపింది.

ఆహారం కావాలి – పొగాకు కాదు

ప్రపంచ పొగాకు నిరోధక దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం “మనకు ఆహారం కావాలి – పొగాకు కాదు” అన్న సరికొత్త నినాదంతో కార్యక్రమాలను రూపొందిస్తోంది. బుధవారం ఢిల్లీలో కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా నేతృత్వంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ఈ అంశం గురించి మాట్లాడుతూ.. యువతే దేశ భవిష్యత్తు అని, అలాంటి యువతరంలో పెరుగుతున్న పొగాకు వినియోగం ఆందోళన కల్గిస్తోందని అన్నారు. పొగాకు సంకెళ్ల నుంచి విముక్తి పొంది ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవర్చుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

- Advertisement -

పొగాకు వినియోగం వల్ల తలెత్తే హానికరమైన ప్రభావాల గురించి దేశ ప్రజలకు, ముఖ్యంగా యువతకు విస్తృత అవగాహన కల్పించాల్సిన సమయమిది అని ఆయన అన్నారు. జన్ అభియాన్ ద్వారా మిషన్ మోడ్‌లో లోక్ భాగీదారి ప్రచారాన్ని ప్రారంభించనున్నట్టు వెల్లడించారు. పొగాకు వ్యసనం నుంచి ప్రజలకు విముక్తి కల్పించే క్రమంలో ఓటీటీ సినిమాలు, వెబ్ సిరీస్‌లలో పొగాకు వ్యతిరేక హెచ్చరికలను తప్పనిసరి చేస్తూ మార్గదర్శకాలను జారీ చేసినట్టు మాండవియా వెల్లడించారు.

కొత్త మార్గదర్శకాలు

పొగాకు ఉత్పత్తులను ప్రదర్శించే ఆన్‌లైన్ క్యూరేటెడ్ కంటెంట్ ప్రచురణకర్తలు మార్గదర్శకాలకు అనుగుణంగా రూపొందించాలి. వీటిలో పొగాకు వ్యతిరేక ప్రకటనలను కార్యక్రమం ప్రారంభంలో మరియు మధ్యలో కనీసం ముప్పై సెకన్ల పాటు ప్రదర్శించాలి. పొగాకు ఉత్పత్తుల ప్రదర్శన లేదా వాటి ఉపయోగం సమయంలో స్క్రీన్ దిగువన ఒక ప్రముఖ స్టాటిక్ మెసేజ్‌గా పొగాకు వ్యతిరేక ఆరోగ్య హెచ్చరికలను ప్రచురణకర్తలు తప్పనిసరిగా ప్రదర్శించాలి. అదనంగా, పొగాకు వాడకం వల్ల కలిగే దుష్ప్రభావాలపై ఆడియో-విజువల్ డిస్‌క్లైమర్, కనీసం ఇరవై సెకన్లు ఉండేలా ప్రోగ్రామ్ ప్రారంభంలో మరియు మధ్యలో తప్పనిసరిగా ప్రదర్శించాలి.

స్టాటిక్ మెసేజ్‌గా ప్రదర్శించబడే పొగాకు వ్యతిరేక ఆరోగ్య హెచ్చరిక సందేశం తప్పనిసరిగా స్పష్టంగా చదవగలిగేలా ఉండాలి. తెలుపు బ్యాక్‌గ్రౌండ్‌లో నలుపు ఫాంట్‌తో “పొగాకు క్యాన్సర్‌కు కారణమవుతుంది” లేదా “పొగాకు చంపుతుంది” అనే హెచ్చరికలను ప్రదర్శించాలి. కంటెంట్ ఏ భాషలో ఉంటే ఆ భాషలోనే ఈ హెచ్చరికల సందేశాలు ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. 

Advertisement

తాజా వార్తలు

Advertisement