Friday, November 22, 2024

ఆధార్‌ వెరిఫికేషన్‌కు కొత్త మార్గదర్శకాలు

ఆధార్‌ కార్డు ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌కు కేంద్రం కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది. ఈ మేరకు భారత విశిష్ట ప్రాదికార సంస్థ (యూఐడీఏఐ-ఉడాయ్‌) మంగళవారం నాడు ఒక ప్రకటన చేసింది. ఇకపై ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేసే సంస్థలు ఖచ్చితంగా మెరుగైన భద్రతా ప్రమాణాలను పాటించాలని సూచించింది. దీని వల్ల ఆధార్‌ భద్రతపై ప్రజల్లో నమ్మకం పెరుగుతుందని తెలిపింది. దీంతో పాటు ప్రభుత్వపరమైన అంశాల్లో ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పించేందుకు ప్రజలు ఆసక్తి కనబరుస్తారని ఉడాయ్‌ భావిస్తోంది. ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేసే సంస్థలు ధృవీకరణ చేసే ముందు ఆధార్‌ ఉన్న వ్యక్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో పాటు ఆధార్‌ భద్రత, గోప్యత గురించి వారికి భరోసా ఇవ్వాలి. భవిష్యత్తులో ఉడాయ్‌ లేదా ఇతర ప్రభుత్వ శాఖల పరిశీలన నిమిత్తం ప్రతి ధృవీకరణ వివరాలను సంబంధిత రికార్డులలో నమోదు చేయాల్సి ఉంటుందని ఉడాయ్‌ తెలిపింది.




ఆధారన్‌ను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్‌ పద్ధతిలో ధృవీకరణ పత్రంగా అనుమతించే ముందు నాలుగు విధాలుగా జారీ చేసిన ఆధార్‌ ఫ్రింట్‌, ఈ-ఆధార్‌, ఎమ్‌-ఆధార్‌, ఆధార్‌ పీవీసీలపై ఉన్న క్యూఆర్‌ కోడ్‌ను స్కాన్‌ చేసి ధృవీకరణ జరపాలని ఆదేశించింది. ఆఫ్‌లైన్‌ ధృవీకరణ సమయంలో ఏవీఎస్‌ఈలు ఆధార్‌ను వెరిఫై చేయలేకపోతే సదరు వ్యక్తికి సేవలు నిరాకరించకుండా, ప్రభుత్వం జారీ చేసిన మరో గుర్తింపు పత్రం సమర్పించి తన గుర్తింపును నిరూపించుకునేలా ప్రోత్సహించాలి. ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో వెరిఫై చేసే సంస్థలు ధృవీకరణ పూర్తయిన తరువాత తమ వద్ద వినియోగదారులకు సంబంధించి ఎలాంటి వివరాలు భద్రపరచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితులో భౌతికంగా ఉంచుకోవాల్సి వస్తే మాస్క్‌డ్‌ ఆధార్‌ను మాత్రమే అనుమతించాలని ఉడాయ్‌ కొత్త మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది.

ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌లో భాగంగా ఆధార్‌లో వివరాలు సరైనవి కాదని గుర్తిస్తే 72 గంటల్లోగా ఉడాయ్‌కు సమాచారం అందించాలి. ఓవీఎస్‌ఈలు ప్రభుత్వ వ్యవస్థల కోసం కాకుకండా బయటి వ్యక్తులు, సంస్థల కోసం ఆఫ్‌లైన్‌ వెరిఫికేషన్‌ చేయకూడదని పేర్కొంది. ఆధార్‌ను దుర్వినియోగం చేయడం, అనుమతి లేకుండా అధార్‌లో మార్పులు చేయడం వంటివి ఆధార్‌ చట్టం సెక్షన్‌ 35 ప్రకారం శిక్షార్హమైన నేరమని ఉడాయ్‌ ఓవీఎస్‌ఈలకు గుర్తు చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారమే ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో వెరిఫికేషన్‌ చేయాలని సూచించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement