Friday, November 15, 2024

Big Story | మూడు జిల్లాల్లో కొత్త బంగారు గనులు.. నెల్లూరు, కర్నూలు, అనంతపురంలో నిక్షేపాలు

అమరావతి, ఆంధ్రప్రభ : రాష్ట్రంలో బంగారం, దాని అనుబంధ ఖనిజాల తవ్వకాల కోసం గనులు కేటాయించాలని నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ) దరఖాస్తు చేసుకుంది. నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో ఈ గనులు ఉన్నాయని గుర్తించారట. అక్కడ గనుల బ్లాకుల్ని కేటాయించాలని కోరినట్లు ఎన్‌ఎండీసీ తన వార్షిక నివేదికలో తెలిపింది. కర్నూలు, అనంతపురం జిల్లాల్లోని పెరవలి, బేతపల్లితో పాటుగా చిత్తూరు జిల్లా రాజగొల్లపల్లి, నెల్లూరు జిల్లా కోనేటిరాజుపాలెం గనుల బ్లాకులను కేటాయించాలని కోరినట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలోని గనుల్లో బంగారంతో పాటుగా అనుబంధ ఖనిజాలను తవ్వుకునే అవకాశం కల్పించాలని కూడా ఆలేఖలో కోరినట్లు సమాచారం. ఈగనులకు సంబంధించి ఎన్‌ఎండీసీ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నట్లు తెలిపింది. ఇప్పటికే మధ్యప్రదేశ్‌, కర్ణాటలో బంగారం, వజ్రాల గనుల్ని ఎన్‌ఎండీసీ నిర్వహిస్తోంది. తాజాగా ఏపీలో కూడా బంగారం గనులు తవ్వేందుకు ప్రయత్నాలు చేస్తోంది.

ఇప్పటికే ఇ-వేలంలో పాల్గొన్న ఎన్‌ఎండీసీ

ఎన్‌ఎండీసీ చిత్తూరు జిల్లాలో ఇప్పటికే బంగారం గనిని నిర్వహించేందుకు ఈ-వేలంలో కూడా పాల్గొంది. చిగర్గుంట-బైసంతానం బంగారం గనిని నిర్వహించేందుకు ప్రిఫర్డ్‌ బిడ్డర్‌గా రంగంలోకి దిగింది. ఇప్పటికే రెండు దఫాలుగా రాష్ట్ర ప్రభుత్వానికి రూ.2.48 కోట్లు చెల్లించింది. అలాగే రూ.12.39 కోట్లకు బ్యాంక్‌ గ్యారెంటీ-లను సమర్పించింది. చిత్తూరు జిల్లా చిగరుకుంట బైసంతానం గనిలో త్వరలోనే తవ్వకాలు ప్రారంభించేందుకు సిద్ధమౌతోంది. ఈక్రమంలోనే ఇప్పుడు నెల్లూరు, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో కొత్త గనులను దక్కించుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది.

- Advertisement -

మరోవైపు ఎన్‌ఎండీసీ బంగారు గనుల తవ్వకాల కోసం దాదాపు రూ.500 కోట్లు పెట్టుబడి పెట్టాలని ఇప్పటికే నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఇనుప ఖనిజం ఉత్పత్తి, రవాణాను అధిక మొత్తంలో నిర్వహించేందుకు వీలుగా రవాణా, పంపిణీ సదుపాయాలను ఎన్‌ఎండీసీ లిమిటెడ్‌ విస్తరిస్తోంది. అందుకే బైలదిలా నాగర్నార్‌ స్లర్రీ పై్లపన్ను విశాఖపట్నం వరకూ పొడిగించాలని నిర్ణయించారు. చిత్తూరు జిల్లాలోని గనిలో 1.83 మిలియన్‌ టన్నుల ఖనిజం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ప్రతి టన్నుకు 5.15 గ్రాముల బంగారం ఉన్నట్లు అంచనా వేశారని సమాచారం.

కర్నూలు జిల్లాలో బంగారం శుద్ధి పరిశ్రమ.. దేశంలోనే తొలిసారి..

కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గంలోని జొన్నగిరిలో రూ.200 కోట్లతో బంగారం శుద్ధి పరిశ్రమ ఏర్పాటు కానుంది. దేశంలోకెల్లా తొలిసారి ప్రయివేట్‌ సంస్థ ఆధ్వర్యంలో ఇక్కడ బంగారం తవ్వకాలు జరగనున్నాయి. రోజుకు 1500 టన్నుల ముడి ఖనిజాన్ని శుద్ధి చేసే సామర్థ్యంతో జొన్నగిరిలో శుద్ధి కర్మాగారాన్ని ఏర్పాటు చేయనున్నారు. మన దేశంలో 1880లో కోలార్‌ గోల్డ్‌ మైన్‌ ప్రారంభం కాగా, 1945లో బ్రిటిష్‌ ప్రభుత్వం హయాంలో రాయచూర్‌లో హట్టి మైన్స్‌ ప్రారంభమైంది. మళ్లీ ఇప్పటి వరకూ మన దేశంలో బంగారం తవ్వకాలు చేపట్టలేదు. స్వాతంత్య్రం వచ్చాక మన దేశంలో బంగారం తవ్వకాలు చేపడుతున్న తొలి సంస్థగా జియో మైసూర్‌ గుర్తింపు పొందింది.

జియో మోసూర్‌ సంస్థకు 30 ఎకరాల కేటాయింపు

బొల్లవానిపాలెం గ్రామ సమీపంలో జియో మోసూర్‌ సంస్థ కర్మాగారం ఏర్పాటు అవుతుండగా, ఇందుకోసం 30 ఎకరాల భూమిని కేటాయించారు. సంస్థ ప్రతినిధులు ఇటీవలేకర్మాగారం ఏర్పాటుకు సంబంధించిన భూమి పూజ కార్యక్రమాన్ని కూడా పూర్తిచేశారు. ఏడాదిలోగా ఈకర్మాగారాన్ని ప్రారంభిస్తామని వారు తెలిపారు. ఇప్పటికే 100 మందికి ఉపాధి కల్పిస్తోన్న ఈ సంస్థ ప్లాంట్‌ ప్రారంభమయ్యాక మరో 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది.

తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో నిక్షేపాలు

తుగ్గలి, మద్దికెర ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్న విషయాన్ని 1994లోనే జియోలాజికల్‌ సర్వే ఆఫ్‌ ఇండియా గుర్తించింది. అనంతపురం జిల్లా రామగిరిలోనూ బంగారు నిక్షేపాలను గుర్తించారు. గనుల తవ్వకాల్లోకి విదేశీ పెట్టు-బడులను భారత ప్రభుత్వం అనుమతించిన తర్వాత, 2005లోనే జియో మోసూర్‌ సంస్థ జొన్నగిరి సమీపంలో బంగారు గని నిర్వహణకు దరఖాస్తు చేసుకుంది. 2013లో ఈ సంస్థకు బంగారం వెలికితీతకు అనుమతులొచ్చాయి.

బంగారు నిక్షేపాలు ఉన్న 350 ఎకరాలను కొనుగోలు చేసిన ఆసంస్థ, మరో 1500 ఎకరాలను లీజుకు కూడా తీసుకుంది. భూమిని లీజుకు ఇచ్చిన రైతులకు ఏటా కౌలు చెల్లిస్తోంది. బంగారం తవ్వకాల కోసం ఈసంస్థ ఇప్పటికే రూ.100 కోట్లకుపైగా ఖర్చు చేసింది. పైలట్‌ ప్రాజెక్టులో భాగంగా 1500 ఎకరాల్లో ప్రతి 20 మీటర్లకు ఒకటి చొప్పున 30 వేల మీటర్ల వరకు డ్రిల్లింగ్‌ చేపట్టింది. పైలట్‌ ప్రాజెక్టులో ఫలితాలు అంచనాలకు అనుగుణంగా రావడంతో పూర్తి స్థాయిలో ఈ సంస్థ మైనింగ్‌ ప్లాంటును ఏర్పాటు చేస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement