Tuesday, October 29, 2024

New Flight – మానవ రహిత విమానం వచ్చేసింది!

హైదరాబాద్​లో ల్యాండింగ్ స‌క్సెస్‌
ఆవిష్కరించిన బ్లూజే ఏరోస్పేస్​
వాణిజ్య అవసరాలకే వినియోగం
2026 నాటికి పూర్తిస్థాయిలో అందుబాటులోకి
100 కిలోల బరువు మోసుకెళ్లే కెపాసిటీ
30 నిమిషాల్లో హైదరాబాద్​ టు వరంగల్​
సరుకు రవాణాలో ఎంతో కీలకం
ఇస్రోతో ఒప్పందం చేసుకున్న సీఎం రేవంత్​

ఆంధ్రప్రభ స్మార్ట్​, హైదరాబాద్​:

నిట్ట నిలువుగా టేకాఫ్‌తో పాటు, భూమి మీదకు దిగే సామర్థ్యం (వీటీఓఎల్‌) ఉన్న మానవ రహిత సరుకు రవాణా విమానాన్ని బ్లూజే ఏరోస్పేస్‌ ఆవిష్కరించింది. దీని పనితీరును హైదరాబాద్‌ సమీపంలోని నాదర్‌గుల్‌ ఎయిర్‌ఫీల్డ్‌లో శ‌నివారం ప్రయోగాత్మకంగా పరీక్షించింది. వాణిజ్య స్థాయిలో పూర్తి విమానాన్ని 2026 నాటికి సిద్ధం చేయనున్నట్లు బ్లూజే ఏరో సహ వ్యవస్థాపకులు అమర్‌దీప్‌ శ్రీ వత్సవాయ, ఉత్తమ్‌ కుమార్‌ వివరించారు. 100 కిలోల బరువును 300 కిలోమీటర్ల దూరం మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉందని, సరుకుల‌ రవాణాలో ఇది ఎంతో కీలకంగా మారుతుందని చెప్పారు.

గ్రామీణ ప్రాంతాల‌కు సేవ‌లు అందించేలా..

హైదరాబాద్‌ నుంచి వరంగల్‌కు 30 నిమిషాల వ్యవధిలో చేరగలదని, గ్రామీణ ప్రాంతాలకూ సేవలు అందించేందుకు ఇది తోడ్పడుతుందని విశ్లేషించారు. 2026 నాటికి హైడ్రోజన్‌-విద్యుత్‌ ప్రొపెల్షన్‌తో అటానమస్‌ ఫ్లైట్‌ తీసుకొస్తున్నట్లు స్పష్టం చేశారు. అప్పుడే మనుషులను తీసుకెళ్లే వీటీఓఎల్‌ విమానాన్నీ ఆవిష్కరించబోతున్నట్లు వెల్లడించారు. దీనివల్ల విమానాశ్రయాలు లేని ప్రాంతాలకూ విమాన సేవలను అందించేందుకు వీలవుతుందని అన్నారు.

- Advertisement -

హైద‌రాబాద్ కేంద్రంగా స్టార్ట‌ప్ సంస్థ‌..

2022లో హైదరాబాద్‌ కేంద్రంగా ప్రారంభించిన ఈ అంకురం ఇప్పటి వరకు ₹18 కోట్ల పెట్టుబడులను సమీకరించింది. ఎండియా క్యాపిటల్‌, ఐడియాస్ప్రింగ్‌ క్యాపిటల్‌, రైన్‌మ్యాటర్ క్యాపిటల్, జెరోధా ఈ మొత్తాన్ని సమకూర్చేందుకు తోడ్పాటు అందించాయి. రెండు, మూడు సంవత్సరాల్లో సిరీస్‌ ఏ ఫండింగ్‌లో భాగంగా ₹250 కోట్ల పెట్టుబడులను సమకూర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు వారు తెలిపారు. రక్షణ అవసరాల కోసం ఎత్తుగా ఉన్న ప్రాంతాల్లోనూ బహుళ ఉపయోగాల కోసం బ్లూజే ఒక విమానాన్ని రూపొందిస్తున్నట్లు తెలిపారు. సమస్యాత్మక, మారుమూల ప్రాంతాల్లోని సైనికులకు నిత్యావసరాలను దీంతో అందిచవచ్చని వివరించారు.

ఇస్రోతో తెలంగాణ ఒప్పందం..

ఇదిలా ఉండగా డ్రోన్ పైలట్లకు అధునాతన శిక్షణ కోసం ఇస్రోతో తెలంగాణ ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. ఇస్రోకు చెందిన నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్‌తో తెలంగాణ రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ ఈ మేరకు ఒప్పందం చేసుకుంది. సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి, ఇస్రో చైర్మన్ సోమనాథ్ సమక్షంలో ఎన్ఆర్ఎస్సీ డైరెక్టర్ ప్రకాశ్‌ చౌహాన్, రాష్ట్ర ఏవియేషన్ అకాడమీ సీఈసీ ఎస్‌.ఎన్‌.రెడ్డి ఒప్పందాలపై సంతకాలు చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement