Wednesday, September 18, 2024

TG | త్వరలో సరికొత్తగా విద్యుత్‌ నియంత్రణ మండలి

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : తెలంగాణ విద్యుత్‌ నియంత్రణ మండలి ఏర్పాటు దిశగా ప్రభుత్వం వేగం పెంచింది. రానున్న రెండు మాసాల్లో టీజీఈఆర్‌సీ పదవీ కాలం ముగిసి ఈ మండలి మొత్తం ఖాళీ కానుంది. ఈ నేపథ్యంలో తదుపరి పాలక మండలి దిశగా ప్రభుత్వం సన్నాహాలు అనివార్యమయ్యాయి.

డిస్కమ్‌ల వార్షిక ఆదాయ అవసరాలు (ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలతో పాటు విద్యుత్‌ సంస్థల ఏ పిటిషన్‌ విచారించడానికి ఈ కమిషన్‌ ఏర్పాటు తక్షణావసరం కానుంది. 2019 అక్టోబరులో నియమితమైన ప్రస్తుత ఛైర్మన్‌, సభ్యుల పదవీ కాలం అక్టోబరు 29వ తేదీతో ముగియనుంది. విద్యుత్తు చట్టం-2003లోని సెక్షన్‌-85 ప్రకారం చైర్మన్‌, సభ్యులు ఐదేళ్లు లేదా 65 ఏళ్లు నిండే వరకే పదవిలో ఉండాలి. దీంతో కొత్తగా మొత్తం పాలక మండలి నియామకం ఆనివార్యంగా మారింది.

కాగా, విభజన అనంతరం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్రకు రెండు కమిషన్లు ఏర్పడగా.. ఏపీలో హైకోర్టు రిటైర్డ్‌ ప్రధాన న్యాయమూర్తులనే చైర్మన్లుగా నియమించడం ఆనవాయితీగా కొనసాగుతూ వచ్చింది. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణలో ఒకసారి విద్యుత్‌ రంగ నిపుణుడిని, మరోసారి న్యాయవాదిని నియమించారు. ప్రస్తుతం సభ్యులుగా దక్షిణ డిస్కమ్‌ పూర్వ అధికారితో పాటు ఓ చార్టర్డ్‌ అకౌంటెంట్‌ ఉన్నారు. దీంతో ఈసారైనా హైకోర్టు మాజీ సీజేలకు చోటు కల్పిస్తారా? గత ప్రభుత్వం అనుసరించిన సంప్రదాయాన్ని కొనసాగిస్తారా? అనేది తేలాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement