Thursday, November 21, 2024

నూతన విద్యావిధానం ఓ ‘నయీ తాలీమ్’.. మహాత్మా గాంధీ హిందీ విశ్వవిద్యాలయం రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి

మాతృభాషలో ప్రాథమిక విద్యాభ్యాసం ద్వారా సమాజంలో సానుకూల మార్పులు సాధ్యమంటూ మహాత్మాగాంధీ సూచించిన ‘నయీ తాలీమ్’ను నూతన జాతీయ విద్యావిధానం ప్రతిబింబిస్తోందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. మహారాష్ట్రలో వర్ధా పట్టణంలో ఉన్న మహాత్మాగాంధీ అంతర్రాష్ట్రీయ హిందీ విశ్వవిద్యాలయం రజతోత్సవ వేడుకల్లో ఉపరాష్ట్రపతి వీడియో కాన్ఫరెన్సు ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశ్వ విద్యాలయ ఆవరణలో నిర్మించిన రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు. మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్ పేయి పేరుతో నిర్మించిన భవనాన్ని, స్వాతంత్ర్య పోరాట యోధుడు చంద్రశేఖర్ ఆజాద్ పేరుతో నిర్మించిన విద్యార్థుల వసతిగృహ సముదాయాన్ని ఉపరాష్ట్రపతి ప్రారంభించారు.
అనంతరం ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ.. 1937లో వర్ధాలో జరిగిన కార్యక్రమంలోనే మహాత్మాగాంధీ ‘నయీ తాలీమ్’ను ప్రతిపాదించారని గుర్తుచేశారు. ప్రతి ఒక్కరికీ విద్యను ఉచితంగా, తప్పనిసరిగా అందించడం, ప్రాథమిక విద్య కచ్చితంగా మాతృభాషలోనే ఉండాలని చెప్పడంతోపాటు నైపుణ్య శిక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని నాడు మహాత్ముడు బోధించడం నేటి పరిస్థితులకు సరిగ్గా సరిపోతుందన్నారు. భారతదేశ స్వరాజ్య సంగ్రామం గ్రామ గ్రామాలకు వెళ్లడంలో ఆయా ప్రాంతాల్లోని మాతృభాషల ప్రభావం ఎంతగానో ఉందని గాంధీ పేర్కొన్నారన్నారు.

భారత రాజ్యాంగసభ కూడా తీవ్రంగా చర్చించిన తర్వాత హిందీ భాషకు దేశభాష హోదాను కట్టబెట్టడంతోపాటు ఇతర భారతీయ భాషలకు కూడా రాజ్యాంగ హోదాను కట్టబెడుతూ 8వ షెడ్యూల్ లో పొందుపరిచిన విషయాలను ఉపరాష్ట్రపతి గుర్తుచేశారు. ప్రతి భారతీయ భాషకూ ఉన్నతమైన, వైభవోపేతమైన సాహిత్యం ఉందని, ఇలాంటి సాహిత్యాన్ని ఆయా భాషల్లో ఉన్నవారు అధ్యయనం చేయడంతోపాటు ఇతర భాషల్లోకి వీటిని అనువాదం చేయడం ద్వారా భారతీయులందరికీ మన సాహిత్య సమృద్ధిని అందజేసినట్లుంటుందన్నారు. భాషావైవిధ్యతే భారతదేశానికి బలమని, ఇదే మన సాంస్కృతిక వైవిధ్యతకు ప్రతిరూపమని ఉపరాష్ట్రపతి అన్నారు.

సమసమాజ స్థాపనలో భాష కీలకమైన పాత్ర పోషిస్తుందని ఇందుకోసం మృదుమధురమై, విలువలు కలిగి, సృజనాత్మకమైన భాష అత్యంత అవసరమని ఉపరాష్ట్రపతి అన్నారు. ప్రతి ఒక్కరూ క్రమశిక్షణ, హుందాతనంతో పదాలను వాడుతూ తమ భావప్రకటన స్వేచ్ఛను సద్వినియోగ పరుచుకోవాలని సూచించారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ కూడా విద్య ద్వారానే సమాజంలో సానుకూల మార్పులు తీసుకురాగలమని బలంగా విశ్వసించారని, మాతృభాషే ఇందుకు మార్గమని ఆయన కూడా భావించారని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారు. విశ్వ విద్యాలయ ఆవరణలో ప్రతిష్టించిన అంబేడ్కర్ విగ్రహం, విద్యార్థులకు, అధ్యాపకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని ఆయన అభిలషించారు.

మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి భారతీయ భాషలకు గౌరవం దక్కాలన్న ఆకాంక్షతో ఐక్యరాజ్యసమితి సమావేశంలో తొలిసారి హిందీలో మాట్లాడారన్నారు. ఆ తర్వాత ఐరాస సమావేశాల్లో, ఇతర అంతర్జాతీయ వేడుకలపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హిందీలోనే మాట్లాడుతున్నారన్నారు. స్వాతంత్ర్య సమరయోధుడు, అమరవీరుడు చంద్రశేఖర్ ఆజాద్ స్ఫూర్తితో యువత దేశాభివృద్ధిలో తమవంతు భూమిక పోషించాలని ఉపరాష్ట్రపతి అభిలషించారు.

హిందీ భాషలోని సాహిత్యాన్ని ఆన్ లైన్లో అందుబాటులోకి తేవడం ద్వారా స్వదేశంలో, విదేశాల్లో ఉన్నవారికి సాహిత్యంలోని ప్రతి కోణాన్ని తెలుసుకునేందుకు సహాయం చేస్తున్న ఈ విశ్వవిద్యాలయ బాధ్యులను ఉపరాష్ట్రపతి అభినందించారు. ఈ ప్రయత్నం ఇతర భారతీయ భాషల్లోనూ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ఫ్రెంచ్, స్పానిష్, చైనీస్, జాపనీస్ తదితర అంతర్జాతీయ భాషలను హిందీ మాధ్యమం ద్వారా బోధిస్తున్న విశ్వవిద్యాలయ అధ్యాపకులను కూడా ఆయన అభినందించారు.

- Advertisement -

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

#AndhraPrabha #AndhraPrabhaDigital

Advertisement

తాజా వార్తలు

Advertisement