అమరావతి, ఆంధ్రప్రభ బ్యూరో: కొత్త జిల్లాల ఏర్పాటు ముహూర్తం మారింది. మొదట ఉగాది రోజు కొత్త జిల్లాల నుంచి పాలన ప్రారంభించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ప్రకటించారు. అయితే వివిధ కారణాల వల్ల ఆ ముహూర్తాన్ని ఏప్రియల్ 4వ తేదీకి మార్పు చేశారు. సోమవారం దివ్యమైన ముహూర్తం కావడంతో ఆ రోజు నుంచి కొత్త జిల్లాల పాలన ప్రారంభించాలని నిర్ణయించారు. ఈ మేరకు సీఎం జగన్ కూడా అధికారికంగా కొత్త జిల్లాల పాలన ముహూర్తాన్ని ఖరారు చేశారు. ఆ రోజు ఉదయం 9.05 గంటల నుంచి 9.45 గంటల లోపు నరసరావుపేట నుంచి సీఎం జగన్ పాలనను ప్రారంభించబోతున్నారు. అందుకు సంబంధించి గెజిట్ కూడా సిద్ధమైంది. బుధవారం సాయంత్రానికే రాజభవన్‌కు కూడా చేరింది. అయితే గవర్నర్ ఒడిస్సా టూర్‌లో ఉండటంతో ఆయన వచ్చాక గెజిట్‌పై ఆమోదముద్ర వేయనున్నారు. ఆ తర్వాత నోటిఫికేషన్‌ను కూడా విడుదల చేయనున్నారు. అందుకు సంబంధించి దాదాపు కసరత్తు పూర్తి అయింది. అయితే ఇప్పటికే సిద్ఢమైన గెజిట్‌లో 100 వరకు మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరిలో ఇచ్చిన నోటిఫికేషన్‌లో అభ్యంతరాలకు సంబంధించి ఇచ్చిన గడువులోపు ఆయా జిల్లాల నుండి వేల సంఖ్యలో వచ్చిన వినతులను పరిశీలించారు.
ఈమేరకు ఆయా జిల్లాల నుండి వచ్చిన వినతుల్లో దాదాపుగా 70 అంశాలు పరిష్కరించేవిగా గుర్తించి దాదాపు 100 వరకూ మార్పులు చేసినట్లుగా తెలుస్తోంది. అందులో భాగంగానే ఇప్పటి వరకూ నెల్లూరు జిల్లాలో ఉన్న వెంకటగిరి నియోజకవర్గాన్ని కొత్త జిల్లాల్లో భాగంగా బాలాజీ జిల్లాలో కలిపారు. అయితే, స్థానిక శాసనసభ్యులు ఆనం రామనారాయణ రెడ్డి విజ్ఞప్తి మేరకు వెంకటగిరిలో ఉన్న కలువాయి. రాపూరు, సైదాపురం మండలాలను నెల్లూరు జిల్లాలోనే ఉండేలా మార్పులు చేసినట్లు తెలుస్తోంది. ఇదే విషయంపై సీఎం జగన్ కూడా ఇటీవల నెల్లూరు జిల్లా పర్యటనలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డికి హామీ ఇచ్చారు. దీంతో మార్పుల్లో భాగంగా వెంకటగిరిలో ఆమూడు మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది. అలాగే గోదావరి జిల్లాల్లో కూడా కొన్ని మండలాలను మార్పు చేసినట్లు చెబుతున్నారు. ఇలా ఉత్తరాంధ్ర, రాయలసీమలో కూడా స్పల్ప మార్పులు చేపట్టినట్లు తెలుస్తోంది.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి..