న్యూ ఢిల్లీ – రానున్న ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ధీమా వ్యక్తం చేశారు. రానున్న ఎన్నికల్లో మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, తెలంగాణలలో తాము గెలుస్తామన్నారు. తెలంగాణలో బిఆర్ ఎస్ కు, మా పార్టీకి మధ్యే పోటీ అని అన్నారు. ఢిల్లీలో అస్సాంకు చెందిన ప్రతిదిన్ మీడియా నెట్ వర్క్ నిర్వహించిన కాన్‌క్లేవ్‌లో ఆయన మాట్లాడుతూ, రాజస్థాన్‌లో పోటా పోటీ ఉండేలా కనిపిస్తోందన్నారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల నుంచి తాము పాఠాలు నేర్చుకున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్షాల వాదనలు వినబడనీయకుండా తప్పుదోవ పట్టిస్తోందన్నారు. కర్ణాటకలో తాము చెప్పాలనుకున్నది కచ్చితంగా జనాలకు చేరేలా చెప్పామన్నారు.
విపక్షాలన్నీ కలిసికట్టుగా పని చేస్తున్నాయని, 2024లో విపక్షాల కూటమి బీజేపీని ఆశ్చర్యానికి గురి చేస్తుందన్నారు. వన్ నేషన్, వన్ ఎలక్షన్ అనేది వాస్తవ సమస్యల నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకని ఆరోపించారు. తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి బీజేపీ తరచూ ఇలాంటివి చేస్తుందన్నారు. భారత్‌లో సంపదలో అసమానతలు, నిరుద్యోగం, ధరల పెరుగుదల వంటి ఎన్నో సమస్యలు ఉన్నాయన్నారు. ఇండియా నుంచి భారత్ పేరు మార్పు ఇవన్నీ సమస్యల నుంచి దృష్టి మరల్చేందుకే అన్నారు.
తెలంగాణ ఎన్నికలపై కూడా రాహుల్ మాట్లాడుతూ, తెలంగాణలో జరగనున్న ఎన్నికల గురించి చూస్తే తాము క్రమంగా బలపడుతున్నామని, అక్కడ బీజేపీ ఉనికిలో లేదన్నారు. ఇక్కడ కమలం పార్టీ ప్రభావం పడిపోయిందన్నారు. మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌లలో కాంగ్రెస్ గెలుస్తుందన్నారు. రాజస్థాన్‌లో ప్రభుత్వ వ్యతిరేకత పెద్దగా లేదన్నారు.