అంబేద్కర్ కార్యక్రమంలో మోదీ, ఖర్గే
ఇద్దరి మధ్య అప్యాయ పలకరింత
మనస్ఫూర్తిగా నవ్వులు చిందించిన నేతలు
న్యూ ఢిల్లీ – పార్లమెంట్ ఆవరణలో అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. పార్లమెంట్ వేదికగా, రాజకీయ సభల్లో ఎప్పుడూ పరస్పరం విమర్శలు చేసుకునే నేతలు ఒకేచోటకు చేరారు. ఈ క్రమంలో వారి మధ్య సరదా సంభాషణలతో నువ్వులు విరబూశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, మల్లికార్జున్ ఖర్గే ఇద్దరు ఒకరితో ఒకరు సరదాగా ముచ్చటించుకుంటున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా పార్లమెంటు ఆవరణలో మహాపరినిర్వాణ్ దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రధాని నరేంద్ర మోదీ, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, ఉప రాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్, మాజీ రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే తదితరులు పాల్గొని అంబేద్కర్ చిత్రపటానికి నివాళులర్పించారు.
అనంతరం అక్కడ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ప్రధాని నరేంద్ర మోదీ, కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పరస్పరం పలుకరించుకున్నారు. కాసేపు వారు ఆప్యాయంగా మాట్లాడుకోవడంతోపాటు నవ్వుతూ కనిపించారు. ప్రధాని మోదీ మల్లికార్జున ఖర్గే చేయి పట్టుకొని నవ్వుతూ కనిపించారు. వారిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నట్లు కనిపించింది. వీరివెంట పార్లమెంట్ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, మాజీ రాష్ట్రపతితోపాటు ఇతర నేతలు ఉన్నారు.