ఢిల్లీలోని ఎయిమ్స్ తరలింపు
వైరల్ ఫీవర్,గైనిక్ సమస్యలున్నయన్న వైద్యులు
నిలకడగా ఆరోగ్యం ఉన్నట్లు వెల్లడి
న్యూ ఢిల్లీ – మద్యం పాలసీ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అస్వస్థతకు గురయ్యారు. జైలు డాక్టర్ల సూచనల మేరకు అధికారులు ఆమెను రాజధానిలోని ఎయిమ్స్‌కు తరలించారు. ఆసుపత్రిలో ఆమెకు పరీక్షలు నిర్వహించారు. కవిత వైరల్ ఫీవర్, గైనిక్ సమస్యలతో బాధపడుతున్నట్లు డాక్టర్లు తెలిపారు.
అంతకుముందు, జులై 16న కవిత జైల్లోనే అస్వస్థతకు గురయ్యారు. అప్పుడు ఆమెకు జ్వరం రావడంతో పశ్చిమ ఢిల్లీలోని హరి నగర్‌లో గల దీనదయాళ్ ఆసుపత్రికి తరలించారు. వైద్య పరీక్షల అనంతరం ఆమెను తిరిగి జైలుకు తీసుకువెళ్లారు. ఇప్పుడు ఆమెకు ఎయిమ్స్‌లో చికిత్స అందిస్తున్నారు. కవిత గత ఐదు నెలలకు పైగా తీహార్ జైల్లో ఉంటున్నారు. ఇటీవల ఆమె దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది. ఆలోగా ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదే సమయంలో 23వ తేదీలోగా రిజాయిండర్ దాఖలు చేయాలని కవిత తరఫు న్యాయవాదులను ఆదేశించింది.