యువతుల నిర్భంద కేసు నిలుపుదల
ఆ ఇద్దరు అక్కడ స్వచ్చందంగా ఉన్నారని వెల్లడి
ఈ కేసులో హేబియస్ కార్పస్ వర్తించదన్న సుప్రీం కోర్టు
దీంతో కేసును కొట్టివేస్తునట్లు ప్రకటించిన చీఫ్ జస్టీస్ చంద్రచూడ్
న్యూ ఢిల్లీ – సద్గురు జగ్గీ వాసుదేవ్ కు చెందిన ఇషా ఫౌండేషన్ పై దాఖలైన చట్టవిరుద్ధ నిర్బంధం కేసు విచారణను సుప్రీంకోర్టు నేడు నిలిపివేసింది. అంతకుముందు అక్టోబర్ 3న, ఫౌండేషన్‌పై పోలీసుల విచారణకు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై కోర్టు స్టే విధించింది.
వివరాలలోకి వెళితే , ఫౌండేషన్‌పై రిటైర్డ్ ప్రొఫెసర్ ఎస్ కామరాజ్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. తన కుమార్తెలు లత, గీతలను ఆశ్రమంలో బందీలుగా ఉంచారని ఆరోపించారు. దీనిపై సెప్టెంబర్ 30న ఇషా ఫౌండేషన్‌కు సంబంధించిన అన్ని క్రిమినల్ కేసుల వివరాలను సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. మరుసటి రోజు అంటే అక్టోబర్ 1న దాదాపు 150 మంది పోలీసులు ఫౌండేషన్ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. హైకోర్టు ఆదేశాన్ని సద్గురు సుప్రీంకోర్టులో సవాలు చేశారు. దీనిపై సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైకోర్టు ఆదేశాలపై స్టే విధించింది.. ఆ రోజునే విచారణను అక్టోబర్ 18 తేదీకి వేసింది.. నేడు విచారణ చేపట్టింది సుప్రీం కోర్టు .
ఈ కేసు విషయంలో “ఈషా ఫౌండేషన్లో ఉంటున్న ఇద్దరి మహిళలతో తాము మాట్లాడామని, వారు స్వచ్చందంగానే అక్కడ ఉంటున్నట్లు తెలిపారని ప్రధాన న్యాయమూర్తి చంద్రచూడ్ వెల్లడించారు.. దీంతో ఈ కేసులో హేబియస్ కార్పస్ వర్తించదని చెబుతూ, ఈ కేసును ఇంతటితో ముగిస్తునట్లు చెప్పారు..