ముంబయి పేలుళ్ల తర్వాత రాటు దేలాం
ప్రజలను సురక్షితంగా ఉంచుతున్నాం
ఉగ్రదేశంలో ప్రజలు భయంతో బతుకుతున్నారు
ప్రజలు నమ్మారు.. వారి నమ్మకాన్ని వమ్ము చేయను
దేశాన్ని ప్రపంచంలోనే అగ్రస్థాయికి చేర్చడమే లక్ష్యం
ఓ మీడియా సంస్థ లీడర్షిప్ సమ్మిట్‌లో ప్రధాని మోదీ ఉద్ఘాటన
ఆంధ్రప్రభ స్మార్ట్, న్యూఢిల్లీ:
తమ ప్రభుత్వం ఎప్పుడూ అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తోందని, ఓటు బ్యాంకు రాజకీయాలకు దూరంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకు రాజకీయాల కోసమే పాలసీలు తీసుకొచ్చాయని విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చాకే ప్రభుత్వంపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించామని పేర్కొన్నారు. ఓ మీడియా సంస్థ లీడర్షిప్ సమ్మిట్ సందర్భంగా శనివారం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. లీడర్ షిప్ సమ్మిట్‌లో ప్రదర్శించిన 26/11 ముంబయి పేలుళ్ల కథనాలను మోదీ చూశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘ఈ రోజు నేను 26/11 దాడికి సంబంధించిన నివేదికలను ఎగ్జిబిషన్లో చూశాను. ఆ సమయంలో ఉగ్రవాదం భారతీయులకు పెద్ద ముప్పు. ప్రజలు సురక్షితంగా లేరని భావించారు. కానీ, కాలం మారింది. ఇప్పుడు ఉగ్రవాదులు వారి సొంతగడ్డపైనే అభద్రతాభావంతో ఉంటున్నారు. భయంభయంగా బతుకుతున్నారు. ఇక, వారు మనల్ని భయపెట్టలేరు అని మోదీ అన్నారు.
సుసంపన్నమైన దేశంగా చేస్తా..
ప్రజల కోసం, ప్రజల అభివృద్ధి కోసం తమ ప్రభుత్వ స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు వెళ్తోందని మోదీ అన్నారు. తాము ప్రజా ప్రయోజనాల దిశలో మాత్రమే పయణిస్తున్నామన్నారు. భారత్‌ను అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దడమే లక్ష్యమని, దేశాన్ని సుసంపన్నమైన, అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. భారతీయులు తమ నమ్మకాన్ని తమపై ఉంచారని, ఆ నమ్మకాన్ని పూర్తి చిత్తశుద్ధితో నెరవేరుస్తున్నామని అన్నారు. సోషల్ మీడియా ద్వారా వ్యాప్తి చెందుతున్న తప్పుడు సమాచారం, పుకార్లపై కూడా మోదీ ప్రస్తావించారు.
యువత రిస్క్ తీసుకోవడం లేదు..
స్వాతంత్య్రానంతరం దేశంలో యువతలో రిస్క్ తీసుకునే స్ఫూర్తి కొరవడిందని మోదీ ప్రస్తావించారు. అయితే.. 10 ఏళ్లలో ఇది పూర్తిగా మారిపోయిందన్నారు. ప్రస్తుతం దేశంలో 1.25 లక్షలకు పైగా నమోదైన స్టార్టప్‌లు ఉన్నాయని, దేశం గర్వించేలా చేయాలని యువత ఎదురు చూస్తున్నారని అన్నారు. తమ ప్రభుత్వం చేపట్టిన పారిశుధ్యం, ఉపాధి కల్పన పథకాలను ప్రస్తావించారు. దేశంలో మరుగుదొడ్లు నిర్మించాలనే ప్రచారం ప్రారంభించామని చెప్పారు. దీంతో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంలో మాత్రమే కాకుండా ఉపాధిని సృష్టించడం, ఆర్థిక వ్యవస్థను పెంపొందించడానికి సహాయపడిందని వివరించారు. ఈ పథకం గౌరవం, భద్రతను అందిస్తుందని మోదీ తెలిపారు.