న్యూ ఢిల్లీ – కేంద్ర ఉద్యోగులకు మోడీ ప్రభుత్వం మరో సారి గుడ్ న్యూస్ చెప్పింది. దసరా, దీపావళికి ముందు ప్రభుత్వం నుంచి పెద్ద బహుమతి లభించింది. తాజాగా కేంద్ర కేబినెట్ సమావేశం నిర్ణయాన్ని ప్రకటించింది. దీపావళికి ముందే ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు మోడీప్రభుత్వం పెద్ద కానుకను అందించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్ల కరువు భత్యం పెంపునకు ఆమోదం తెలిపింది.
డియర్‌నెస్ అలవెన్స్‌లో 4 శాతం పెంపుతో 42 శాతం నుంచి 46 శాతానికి పెంచింది. కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో 47 లక్షల మంది ఉద్యోగులు, 68 లక్షల మంది పెన్షనర్లకు లబ్ధి చేకూరనుంది. కరువు భత్యం పెంపుతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు అక్టోబర్ నెల జీతం కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. జూలై నుంచి సెప్టెంబర్ వరకు ఉన్న బకాయిలను కూడా అక్టోబర్ నెల జీతంతో పాటు కేంద్ర ఉద్యోగులు, పెన్షనర్లకు ఇవ్వాలని నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 2022-23 సంవత్సరానికి బోనస్‌గా రూ.7,000ను అందిస్తున్నట్లుగా ఆర్థిక మంత్రిత్వ శాఖ మంగళవారం గరిష్ట పరిమితిని నిర్ణయించింది. కేంద్ర ప్రభుత్వ పరిధిలోని గ్రూప్ బీ, గ్రూప్ సీల్లోకి వచ్చే నాన్ గెజిటెడ్ ఉద్యోగులకు కూడా బోనస్ అందించింది. ఇది కాకుండా, కేంద్ర పారామిలిటరీ బలగాలు, సాయుధ దళాల ఉద్యోగులకు అడహాక్ బోనస్ ప్రయోజనం కూడా ఇవ్వనుంది. ఈ బోనస్‌లో భాగంగా 30 రోజుల జీతంతో సమానంగా డబ్బు అందిస్తోంది.