ఇప్పటికే 22 మందిని మింగేసిన వింత వ్యాధి..
తాజాగా కేరళలో ఒకరి మృతి
నివారణ చర్యలకు సిఎం పినరయ్ విజయన్ ఆదేశం
మురికినీటి కుంటలలో స్నానాలు నిషేధం
సిమ్మింగ్ పూల్ లో క్లొరినేషన్ తప్పని సరి
రంగంలోకి దిగిన కేంద్రం ..ఆప్రమత్తంగా ఉండాలని ఆదేశం
న్యూ ఢిల్లీ – భారత్‌లో బ్రెయిన్ ఈటింగ్ డిసీజ్ కలకలం రేగింది. మెదడును తినే అమీబా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తాజాగా ఈ వ్యాధి సోకిన కేరళలోని కోజికోడ్‌కు చెందిన 14 ఏళ్ల మృదుల్ ప్రాణాలు కోల్పోయాడు. ఒక చిన్నపాటి చెరువులో స్నానానికి దిగిన అనంతరం అతనికి ఈ వ్యాధి సోకింది. ఈ వ్యాధిని అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ (పీఏఎం)అని పిలుస్తారు. ఈ వ్యాధి నేగ్లేరియా ఫౌలెరి అనే అమీబా వల్ల వస్తుంది. ఈ అమీబా నీటి ద్వారా శరీరంలోకి చేరినప్పుడు, నాలుగు రోజుల్లోనే అది మానవ నాడీ వ్యవస్థపై అంటే మెదడుపై దాడి చేస్తుంది. 14 రోజుల వ్యవధిలో ఇది మెదడులో వాపుకు కారణమవుతుంది. ఫలితంగా బాధితుడు మరణిస్తాడు. ఈ ఏడాది కేరళలో ఈ వ్యాధి కారణంగా ఇప్పటి వరకూ ముగ్గురు మరణించారు.
దీనికి ముందు కూడా మన దేశంలోని వివిధ ఆసుపత్రులలో అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ కేసులు నమోదయ్యాయి. కేంద్ర ప్రభుత్వ ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రామ్ (ఐడీఎస్పీ) తెలిపిన వివరాల ప్రకారం ఈ వ్యాధి బారినపడి కేరళ, హర్యానా, చండీగఢ్‌లలో ఇప్పటివరకు 22 మంది మృతి చెందారు.
అప్రమత్తమైన కేరళ ప్రభుత్వం
అమీబిక్ మెనింగోఎన్సెఫాలిటిస్ నివారణపై చర్చించేందుకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ నేతృత్వంలో ప్రత్యేక సమావేశం జరగింది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ఎవరూ కూడా మురికి నీటి ప్రదేశాల్లో ఈతకు వెళ్లకుండా చూడాలని సీఎం అధికారులను ఆదేశించారు. స్విమ్మింగ్ పూల్స్‌లో క్లోరినేషన్ తప్పని సరి చేయాలని, చిన్నారులు ఈ వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున వారు నీటి వనరులలోకి ప్రవేశించినప్పుడు అదనపు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. స్విమ్మింగ్ చేసే సమయంలో నోస్ క్లిప్‌లను ఉపయోగించడం వల్ల ఈ ఇన్ఫెక్షన్ను నివారించవచ్చన్నారు. ప్రతి ఒక్కరూ నీటి వనరులను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.