న్యూఢిల్లీ: క్రిమినల్ చట్టాల్లో మార్పులు కోరుతూ ఇవాళ పార్లమెంట్‌లో మూడు బిల్లును ప్రవేశపెట్టారు. భారతీయ న్యాయ సంహిత బిల్లు, భారతీయ సాక్ష్యా బిల్లు, భారతీయ నాగరిక సురక్షా సంహిత బిల్లులను కేంద్ర మంత్రి అమిత్ షా లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 1860 నుంచి 2023 వరకు దేశంలో న్యాయ వ్యవస్థ.. బ్రిటీషర్లు రూపొందించిన విధంగానే అమలు అయ్యిందన్నారు. ఆ మూడు చట్టాలను మార్చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టమ్‌లో పెను మార్పులు తీసుకురానున్నట్లు ఆయన వెల్లడించారు. అమిత్ షా ఇవాళ ప్రవేశపెట్టిన మూడు బిల్లులను స్టాండింగ్ కమిటీకి రిఫర్ చేశారు.
కొత్త చట్టాలతో శిక్షను పెంచడం కాదు అని, న్యాయం దొరికేలా రూపొందించినట్లు ఆయన తెలిపారు. ఏడేళ్లు లేదా అంత కన్నా ఎక్కువ కాలం శిక్షపడే కేసుల్లో ఆ క్రైమ్ సీన్‌కు కచ్చితంగా ఫోరెన్సిక్ బృందాలు విజిట్ చేయాలన్న నిబంధన తీసుకువస్తున్నట్లు మంత్రి తెలిపారు. దేశద్రోహం లాంటి చట్టాలను రద్దు చేస్తున్నట్లు కూడా ఆయన చెప్పారు. కొత్త క్రిమినల్ చట్టాల ప్రకారం మైనర్‌ను రేప్ చేస్తే మరణశిక్ష విధించనున్నారు. ఇక గ్యాంగ్ రేప్‌కు పాల్పడితే 20 ఏళ్లు లేదా జీవితఖైదు శిక్ష విధించనున్నారు. సామూహిక దాడి కేసుల్లోనూ మరణశిక్ష విధించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. బిల్లులపై షా మాట్లాడిన తర్వాత సభను నిరవధికంగా వాయిదా వేశారు.