‘యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలో కొత్త కోర్సులకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్లు జారీ చేసింది. రాష్ట్రంలో అభివృద్థి చెందుతున్న 17 ప్రాధాన్య రంగాలు, పరిశ్రమల భవిష్యత్తు అవసరాలకు సరిపడే మానవ వనరులను తయారు చేసేలా కొత్త కోర్సులను ఐటీ, పరిశ్రమల శాఖ రూపొందించింది. తాజాగా కిమ్స్, ఏఐజీ ఆసుపత్రులు, టీవర్క్స్ భాగస్వామ్యంతో 3 కోర్సులకు నోటిఫికేషన్లను జారీ చేసింది.
సంబంధిత రంగంలో పేరొందిన కంపెనీల భాగస్వామ్యంతో కోర్సులను రూపొందించి యువతకు శిక్షణ ఇవ్వనున్నట్టు ఐటి, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కార్యాలయం ఒక ప్రకటనలో వెల్లడించింది. విజయవంతంగా శిక్షణ పూర్తి చేసిన అభ్యర్థులకు.. అదే కంపెనీలో ఉద్యోగ అవకాశాలను కల్పిస్తారు. త్వరలో మరిన్ని కోర్సులను ప్రారంభించేందుకు యూనివర్సిటీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.
కొత్త కోర్సులు ఇవే…
◈ ఏఐజీ హాస్పిటల్స్ ఎండోస్కోపీ టెక్నీషియన్
టైనింగ్ ప్రోగ్రాం వ్యవధి 6 నెలలు, అర్హులు : ఇంటర్ (బైపీసీ)లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత, వయసు; 25 ఏళ్లలోపు, శిక్షణ; ఎండోస్కోపీ ఆపరేషన్స్‌పై క్లాస్ రూం, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఇవ్వనున్నారు.
ఉపాధి అవకాశాలు : ఏఐజీ, ఇతర ఆసుపత్రుల్లో ప్లేస్‌మెంట్ ఫీజు : రూ.10వేలుగా ఉండనుంది.
◈ టీ-వర్క్స్ ప్రోటో టైపింగ్ స్పెషలిస్ట్ ప్రోగ్రాం
వ్యవధి; 2 నెలలు ఉండగా, ఇందుకు అర్హత; పదో తరగతి ఉత్తీర్ణత, వయసు; 18- 25 ఏళ్లలోపు, శిక్షణ; డిజైన్ థింకింగ్, క్యాడ్, క్యామ్‌పై అవగాహన కల్పించడం, 3డీ ప్రింటింగ్, వెల్డింగ్, సీఎన్సీ మెషినింగ్, అడ్వాన్స్ డ్ ర్యాపిడ్ ప్రోటో టైపింగ్, ప్యాకేజింగ్, వుడ్, లేజర్ కటింగ్ తదితర అంశాలపై శిక్షణ ఇస్తారు.
ఉపాధి అవకాశాలు; జూనియర్ ప్రోటో టైపింగ్ టెక్నీషిన్ గా అవకాశం (జీతం రూ.15వేల నుంచి రూ.25వేల వరకు) ఫీజు; రూ.3వేలు ఉండనుంది.
◈ మెడికల్ కోడింగ్ అండ్ సాప్ట్ స్కిల్స్ ప్రోగ్రాం
ఇందుకు వ్యవధి; 55 రోజులు(45 రోజులు) మెడికల్ కోడింగ్, 10 రోజులు సాప్ట్ స్కిల్స్ పై శిక్షణ, అర్హులు; బీఎస్సీ(లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత, వయసు; 18-25 ఏళ్లలోపువారికి శిక్షణ; మాస్టర్ మెడికల్ టెర్మినాలజీ, కోడింగ్ సిస్టమ్స్‌పై శిక్షణ ఇస్తారు. ఉపాధి అవకాశాలు; మెడికల్ కోడింగ్ ఎగ్జిక్యూటివ్, -టైనీ మెడికల్ కోడర్ ఫీజు; రూ.18వేలుగా నిర్ణయించారు.