Saturday, November 23, 2024

సెలైన్ పుక్కిలిస్తే 3 గంటల్లో ఫలితం

సులభమైన కరోనా పరీక్ష అందుబాటులోకి వచ్చింది. సెలైన్ నోటిలో వేసుకుని పుక్కిలించి ఓ ట్యూబులో ఉమ్మాలి. ఆ ట్యూబును పరీక్షకు పంపితే చాలు.. మూడు గంటల్లో ఫలితం వస్తుంది. ఈ కొత్త పరీక్ష వల్ల సమయం, సాధన సంపత్తి ఆదా అవుతాయి. శాస్త్రీయ, పారిశ్రామిక పరిశోధనా మండలి (సీఎస్ఐఆర్) ఈ చవకైన, సులభమైన కొత్త పరీక్షను రూపొందించింది. ఈ కిట్ లో ఉంటే సెలైన్‌ను గొంతులో పోసుకుని 15 సెకన్ల పాటు పుక్కిలించాలి. తర్వాత ఆ ద్రవాన్ని ట్యూబులోకి ఉమ్మాలి. ఆ ట్యూబును ప్రయోగశాలకు పంపితే ఫలితం వస్తుంది. కరోనా రక్షణ దుస్తులు, దూదిపుల్లలు ఇలాంటివేవీ ఈ పరీక్షలో అవసరం లేదు. ఇదొక గమనించదగ్గ నూతన ఆవిష్కరణ అని కేంద్ర ఆరోగ్యమంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ వ్యాఖ్యానించారు. దూదిపుల్ల అవసరం లేని, ఇబ్బంది కలిగించని ఈ విధానం కరోనా పరీక్షల తీరుతెన్నులనే మార్చేస్తుందని ఆయన పేర్కొన్నారు. ఎవరికి వారే శాంపిల్స్ సేకరించి పంపవచ్చునని, జనాల మధ్య క్యూలో నిలబడి అవస్థలు పడాల్సిన అగత్యం లేదని వైద్య నిపుణులు అంటున్నారు. ఈ పద్ధతిలో వ్యర్థాలు కూడా తగ్గుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. భారత వైద్య పరిశోధన జర్నల్‌లో ఈ కొత్త పరీక్ష గురించి ఇటీవలే ఒక అధ్యయన నివేదికను ప్రచురించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement