Wednesday, November 20, 2024

భారత్ NCAPలో కొత్త మార్పులు.. ఈ ఫీచర్‌ ఉంటేనే స్టార్ రేటింగ్.!!

ప్రయాణికుల సేఫ్టీని దృష్టిలో ఉంచుకుని ‘కనెక్టెడ్‌ కార్’ వంటి ఫీచర్‌లకు కూడా ప్రత్యేక మార్కులను తీసుకురావాలని కేంద్రం ప్రతిపాదిస్తోంది. దీంతో భవిష్యత్తులో భారత్ NCAP క్రాష్ టెస్ట్‌లో కనెక్టివిటీ ఫీచర్లు ఉన్న కార్లు ఎక్కువ స్కోర్ చేసే అవకాశం ఉంటుంది. గ్లోబల్‌ NCAP మాదిరిగానే భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లోనూ విధివిధానాలు ఉంటాయి.

భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో కార్లకు క్రాష్ టెస్ట్ చేసిన అనంతరం డ్యామేజీని బట్టి మార్కులు ఉంటాయి. ఆ మార్కుల ఆధారంగా స్టార్ రేటింగ్‌ ఇస్తారు. ఈ నేపథ్యంలో యాక్సిడెంట్లను నివారించి ప్రయాణికులు మరింత సురక్షితంగా ప్రయాణించేలా కారులో కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ ఉండాలని.. దానికి మార్కులు వేయాలని కేంద్ర ప్రభుత్వ ప్యానెల్‌ ప్రతిపాదిస్తోంది. దీనికి సంబంధించి టెక్నికల్‌ బ్లూ ప్రింట్‌ను విడుదల చేయాలని భావిస్తోంది.

గ్లోబల్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీ (Connected Car Technology) ఉన్న కార్లకు అదనపు మార్కులు ఇస్తున్నారు. దీంతో భారత్‌ NCAP లోనూ ఇలాంటి విధివిధానాన్ని ప్రవేశపెట్టాలని కేంద్రం భావిస్తోంది. ఈ టెక్నాలజీని V2X గా పిలుస్తారు. ఈ టెక్నాలజీ ద్వారా.. ప్రయాణిస్తున్న కారు సమీపంలోని ఇంట‌ర్నెట్ స‌ర్వీస్, ఇత‌ర వాహనాలు, ట్రాఫిక్ మౌలిక స‌ద‌రుపాయాల‌ను సులువుగా గుర్తించవచ్చు. అందుకే V2X ఫీచర్‌ను ముఖ్యమైన టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్‌గా పరిగణించి మార్కులు వేయాలని ప్యానెల్‌ సభ్యులు ప్రతిపాదిస్తున్నారు.

కనెక్ట్ చేయబడిన కార్ల యొక్క కొన్ని ప్రయోజనాలు:

  • GPS నావిగేషన్
  • ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్
  • డయాగ్నస్టిక్ సెన్సార్లు
  • కమ్యూనికేషన్ సాధనాలు

V2X టెక్నాలజీ ద్వారా రోడ్డుపై ఉన్న ఇతర కార్ల డ్రైవర్లతో కమ్యూనికేట్ అవ్వడమే కాకుండా.. ట్రాఫిక్ లైట్ల సిస్టమ్‌కు కూడా కనెక్ట్‌ అవుతుంది. అంతే కాకుండా కారు డ్రైవర్‌కు పరిస్థితులను బట్టి హెచ్చరికలను జారీ చేస్తుంది. ఈ మేరకు భారత్‌ NCAP లో కనెక్టెడ్‌ కార్‌ టెక్నాలజీకి సంబంధించి ప్యానెల్‌ సభ్యులు 58 పేజీల డ్రాఫ్ట్ రూపొందించారు. ఈ డ్రాఫ్ట్‌కు అనుగుణంగా కార్ల తయారీదారులు V2X టెక్నాలజీ తమ కార్లలో ప్రవేశపెట్టాల్సి ఉంటుంది. అనంతరం భారత్‌ NCAP క్రాష్‌ టెస్ట్‌లో ఈ టెక్నాలజీకి అదనపు మార్కులు కేటాయిస్తారు. దీని ద్వారా ఆ కార్లకు ఆటోమేటిక్‌గా స్టార్ రేటింగ్‌ పెరుగుతుంది.

- Advertisement -

ప్రస్తుతం, దేశీయంగా తయారైన అనేక కార్లు ఫ్రంటల్ కొలీజన్‌ వార్నింగ్, ఎమర్జెన్సీ బ్రేకింగ్ టెక్నాలజీ వంటి ఫీచర్లను కలిగి ఉన్నాయి. ఏదైనా వస్తువు లేదా వాహనం కారుకు దగ్గరగా వస్తే ఆటోమేటిక్‌గా ఈ ఫీచర్‌ ఆన్‌ అయ్యేలా ఈ టెక్నాలజీని రూపొందించారు. అయితే V2X టెక్నాలజీ మరింత అడ్వాన్స్‌డ్‌గా ఉంటుంది. ఈ టెక్నాలజీ ఉన్న కార్లలో కిలోమీటర్‌ దూరంలో సైతం ఉన్న ఆబ్జెక్టివ్స్‌ పట్ల డ్రైవర్‌ను అప్రమత్తం చేస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement