న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ: రాష్ట్రాల్లో వెనుకబడిన తరగతి (బీసీ) జాబితాలో ఉన్న 40 కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చాలన్న డిమాండ్‌పై నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ (ఎన్సీబీసీ) స్పష్టమైన హామీ ఇచ్చింది. సాంకేతిక, న్యాయపరమైన చిక్కులున్న కొన్ని కులాలు మినహా మిగతా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయనున్న జాతీయ బీసీ కమిషన్ చైర్మన్ హన్స్‌రాజ్ గంగారాం ఆహిర్ తెలిపారు.
మంగళవారం ఢిల్లీలోని మహారాష్ట్ర సదన్‌లో ఈ 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చే అంశంపై ఫైనల్ పబ్లిక్ హియరింగ్‌ను ఆయన నిర్వహించారు. ఇందులో బీసీ సంఘాల నేత, రాజ్యసభ సభ్యులు ఆర్. కృష్ణయ్య (వైఎస్సార్సీపీ), బీబీ పాటిల్ (బీఆర్ఎస్ ఎంపీ), డా. కే. లక్ష్మణ్ (బీజేపీ ఎంపీ), తెలంగాణ బీసీ కమిషన్ సభ్యులు శుభప్రద్ పటేల్, బీసీ సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలు వెల్లడించారు.
అనంతరం కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని, వాటిని మినహాయించి మిగతా కులాలను ఓబీసీ జాబితాలో చేర్చేందుకు కమిషన్ నిర్ణయం తీసుకుందని ఎన్సీబీసీ చైర్మన్ గంగారాం ఆహిర్ తెలిపారు. 15 రోజుల్లో తమ సిఫార్సులను కేంద్ర ప్రభుత్వానికి అందజేస్తామని ఆయన తెలిపారు. న్యాయపరమైన చిక్కులు పరిష్కారమైన వెంటనే మిగతా కులాలను కూడా జాబితాలో చేర్చుతామని తెలిపారు.
ప్రధానికి కృతజ్ఞతలు: ఆర్. కృష్ణయ్య
బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు, ఎంపీ ఆర్. కృష్ణయ్య కృతజ్ఞతలు తెలిపారు. అత్యంత వెనుకబడి 40 బీసీ కులాలను జాతీయ ఓబీసీ జాబితాలో చేర్చనున్నారని, అందుకు అవసరమైన బిల్లును పార్లమెంటులో తీసుకొస్తారని ఆర్. కృష్ణయ్య ఆశాభావం వ్యక్తం చేశారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వం బీసీలకు ఆర్థిక రాయితీలు అమలు చేయడం లేదని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశమంతటా అమలు చేయాలని సూచించారు.
ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్, స్పెషల్ గ్రాంట్స్ మాదిరిగా బీసీలకు కూడా ప్రత్యేక గ్రాంట్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ దిశగా బీసీ కమిషన్ కృషి చేయాలని కోరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో బీసీలుగా కొనసాగిన 26 కులాలను తెలంగాణ ఏర్పడ్డాక తొలగించారని, ఆ కులాలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని కృష్ణయ్య తెలిపారు. ఆ కులాలను రాష్ట్ర ప్రభుత్వం బీసీ జాబితాలో చేర్చాలని డిమాండ్ చేశారు.
బీజేపీతోనే బీసీల అభ్యున్నతి: డా. కే. లక్ష్మణ్
దేశంలో వెనుకబడిన వర్గాల అభ్యున్నతి కోసం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎన్నో పథకాలు, కార్యక్రమాలు చేపట్టారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఓబీసీ మోర్చా జాతీయాధ్యక్షులు, ఎంపీ డా. కే. లక్ష్మణ్ అన్నారు. జాతీయ బీసీ కమిషన్ నిర్వహించిన ఫైనల్ హియరింగ్‌లో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కమిషన్‌కు రాజ్యాంగబద్ధత కల్పించడం వల్లనే బీసీ వర్గాలకు న్యాయం జరుగుతుందని అన్నారు.
రిజర్వేషన్లు అమలు చేయకపోతే చర్యలు తీసుకునే పరిస్థితి గతంలో ఉండేది కాదని, కానీ ఇప్పుడు కమిషన్‌కు ఉన్న రాజ్యాంగబద్ధత కారణంగా ఆ సమస్య లేకుండా పోయిందని తెలిపారు. మోదీ హయాంలోనే కేంద్ర మంత్రివర్గంలో బీసీలకు పెద్దపీట వేశారని, ఏకంగా 26 మంది మంత్రులు బీసీ వర్గాల నుంచి ఉన్నారని గుర్తుచేశారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలనే డిమాండ్ దశాబ్దాలుగా ఉందని, కొన్ని కులాల విషయంలో న్యాయపరమైన చిక్కులున్నాయని తెలిపారు.