Friday, November 22, 2024

TS | మార్కెట్లో పోటీకి దీటుగా కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకొస్తున్నాం : మంత్రి పువ్వాడ

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : మార్కెట్‌లో పోటీకి దీటుగా కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకు రావడంతో పాటు ప్రయాణికుల సౌకర్యార్థం బస్‌ స్టేషన్లను అత్యాధునిక హంగులతో తీర్చిదిద్దుతున్నామని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ అన్నారు. గత ఏడాది 100 బస్టాండ్లను ఆధునీకరించగా, ఈ ఏడాదిలో 150 బస్టాండ్లను ఆధునీకరించేందుకు ప్రణాళిక రూపొందించినట్లు వివరించారు. మంగళవారం మంత్రి పువ్వాడ ఆర్టీసీ ఎండి సజ్జన్నార్‌తో కలసి తనిఖీ చేశారు. ఎంజీబీఎస్‌ను తనిఖీ చేయడంతో పాటు రంగారెడ్డి రీజియన్‌పై ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్వహించిన మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన రవాణా సేవలు అందించేందుకు టీఎస్‌ ఆర్టీసీ అన్ని చర్యలు తీసుకుంటోందని వెల్లడించారు.

గత ఏడాది సంస్థకు రూ.1900 కోట్ల నష్టాన్ని తగ్గించగలిగామనీ, ప్రయాణికుల సౌకర్యాల విషయంలో ఏమాత్రం రాజీపడటం లేదన్నారు. ఇందులో భాగంగా 760 కొత్త బస్సులను కొనుగోలు చేశామనీ, త్వరలోనే హైదరాబాద్‌లో నాన్‌ ఏసీ ఎలక్ట్ర్రిక్‌ బస్సులు ప్రయాణికులకు అందుబాటులోకి వస్తాయని తెలిపారు., విశ్వనగరంగా అభివృద్ధి చెందిన హైదరాబాద్‌లో మెట్రో, రైల్వే, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీతో అనుసంధానంగా పనిచేసి ప్రజలకు నాణ్యమైన సేవలను అందించాలని అధికారులకు సూచించారు. గత రెండేళ్లుగా సంస్థలోని 45 వేల మంది సిబ్బంది పట్టుదలతో పని చేస్తుండటం వల్లనే సత్ఫలితాలు వస్తున్నాయని చెప్పారు. సంస్థ సిబ్బందికి ఇప్పటికే 7 డిఎలను ప్రకటించామనీ, దాని వల్ల ఒక్కోక్కరిక వేతనం 35 శాతం పెరిగిందని తెలిపారు.

- Advertisement -

టీఎస్‌ ఆర్టీసీ ఎండి విసి సజ్జన్నార్‌ మాట్లాడుతూ రెండేళ్లుగా సంస్థను ప్రజలు మంచిగా ఆదరిస్తున్నారనీ, రాబోయే రోజుల్లో ఓఆర్‌ 75 శాతానికి పెంచడమే లక్ష్యంగా సంస్థ పనిచేస్తుందన్నారు. త్వరలోనే భక్తుల సౌకర్యార్థం మహారాష్ట్రలోని షిర్డీ, శ్రీశైలానికి టూర్‌ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకు రానున్నట్లు తెలిపారు. ఒకవైపు టికెట్‌ ద్వారా ఆదాయాన్ని పెంచుకుంటూనే మరోవైపు ఇతర మార్గాలపై దృష్టా సారించామన్నారు. కాగా, ఎంజీబీఎస్‌ ప్రాంగణంలో మంత్రి పువ్వాడ ఎండీ వీసీ సజ్జన్నార్‌తో కలసి మెగా రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 8 వేల మంది సిబ్బంది రక్తదానం చేసేందుకు ముందుకు వచ్చారనీ, వారిని అభినందించారు. ఈ కార్యక్రమాల్లో ఆర్టీసీ జాయింట్‌ డైరెక్టర్‌ డా.సంగ్రామ్‌ సింగ్‌, ఈడీలు పురుషోత్తం, మునిశేఖర్‌, కృష్ణకాంత్‌, రంగారెడ్డి ఆర్‌ఎం శ్రీధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement