హైదరాబాద్, ఆంధ్రప్రభ : తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికాయుతంగా అమలు చేస్తున్న మౌళిక వసతుల అభివృద్ధి, విస్తరణ పనులతో ప్రస్తుతం రాష్ట్రంలోని నగరాలు, పట్టణాలు ప్రగతిశీల కేంద్రాలుగా మారాయి. ప్రజల భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని మునిసిపాలిటీల సంఖ్యను 69 నుండి నేడు 142కి ప్రభుత్వం పెంచిన విషయం తెలిసిందే. 142 పట్టణాల కింద ఉన్న మొత్తం వైశాల్యం రాష్ట్ర భూభాగంలో 3 శాతం కంటే తక్కువగా ఉంది. అయితే అవి రాష్ట్ర జిడిపిలో మూడింట రెండు వంతుల వాటాను కలిగి ఉన్నాయి. పౌరుల జీవన నాణ్యత, సౌలభ్యాన్ని మెరుగుపరచడంలో రాష్ట్ర ప్రభుత్వము చేస్తున్న కృషికి గుర్తింపుగా వరుసగా 6 సంవత్సరాలుగా ”జీవన నాణ్యత సూచిక”లో దేశంలో అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ నిలిచింది. అలాగే కొనుగోలు శక్తి, భద్రత, ఆరోగ్య సంరక్షణ, జీవన వ్యయ, ఆస్తి ధర నుంచి ఆదాయ నిష్పత్తి, వాతావరణ సూచికలో హైదరాబాద్ నంబర్ వన్‌గా కొనసాగుతోంది. జీవన నాణ్యత, ఆర్థిక పోటీతత్వానికి సంబంధించి ప్రపంచంలోని మొదటి 30 ఉత్తమ నగరాల్లో హైదరాబాద్‌ను చేర్చుటకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తోంది. 2021లో 24312 యూనిట్ల అమ్మకాలలో 142 వృద్ధితో హైదరాబాద్ అత్యుత్తమ పనితీరు కనబరుస్తున్న రెసిడెన్షియల్ మార్కెట్‌గా నిలిచింది.
ఈ అంశంలో 2014 నుంచి ఒక్క సంవత్సరం కూడా ధర తగ్గని నగరం దేశంలోని 8 మెట్రోలలో హైదరాబాద్ మాత్రమే. ఒక స్క్వేర్ ఫీట్‌కు రూ.4,450 సగటు రేటుతో మొదటి ఏడు మెట్రోలలో సరసమైన నివాస నగరంగా హైదరాబాద్ కొనసాగుతోంది. గత సంవత్సరం స్థూల ఆఫీస్ స్పేస్ పరంగా భారతదేశపు టాప్ కమర్షియల్ రియల్ ఎస్టేట్ డెస్టినేషన్‌గా హైదరాబాద్ నిలిచింది. అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్‌లో భాగంగా రూ.671.19 కోట్లు, రూ.293.93 కోట్లు రూ.114.97 కోట్లు ఖర్చుతో మౌళిక వసతుల పనులు ప్రభుత్వం పూర్తి చేసింది. అలాగే రూ.735 కోట్లతో పరిధిలో 37 పనులు, రూ 231 కోట్లతో శివారు మున్సిపాలిటీలలో 21 పనులు చేపట్టారు. పట్టణాలలో పారిశుధ్యం మరియు మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే లక్ష్యంతో పట్టణ ప్రగతి కార్యక్రమం కింద రూ.3,434 కోట్లు మంజూరు ప్రభుత్వం మంజూరు చేసింది. ప్రభుత్వం ప్రతినెల ఇస్తున్న నిధులతో మౌళిక సదుపాయాలు, పారిశుధ్య పరిస్థితి గణనీయంగా మెరుగుపడింది. కొత్తగా 2254 అదనపు పారిశుద్ధ్య వాహనాల కొనుగోలుతో మొత్తం శానిటేషన్ వా#హనాల సంఖ్య 4882 లకు చేరింది. రోజుకు 4,295 గార్బెజ్ సేకరిస్తున్నారు.
మునిసిపాలిటీల్లో చేపట్టిన 139 ఇంటిగ్రేటెడ్ వెజ్ అండ్ నాన్ వెజ్ మార్కెట్లలో 103 చోట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు. 139 మునిసిపాలిటీల్లో 734 కొత్త వైకుంఠధామముల అభివృద్ధి పనులు చేపట్టారు. రూ.100.22 కోట్లతో మొత్తం కూడళ్లు, ముఖ్యమైన సర్వీస్ రోడ్ల నిర్మాణం, స్ట్రీట్ లైటింగ్‌ను పూర్తి చేశారు. వేగవంతమైన అభివృద్ధి, భవిష్యత్తు అవసరాలను దృష్టిలో ఉంచుకుని, నానక్ రామ్‌గూడ నుంచి ఆరాంఘర్ వరకు నార్సింగి నుంచి కొల్లూరు వరకు ఉన్న సర్వీస్ రోడ్డును ప్రస్తుతం ఉన్న రెండులేన్ల రహదారి నుండి 4 లేన్‌లుగా విస్తరిస్తున్నారు. రూ.312 కోట్లుతో అదే మార్గంలో, సోలార్ ప్యానెల్ పైకప్పులతో 21కిలోమీటర్లు పొడవైన సైక్లింగ్ ట్రాక్ కూడా నిర్మాణంలో ఉంది. దీనిని 42 కిమీ సర్క్యూట్‌గా అభివృద్ధి చేస్తున్నారు. జవహర్‌నగర్‌లో ప్రస్తుతం ఉన్న 19.8 మెగావాట్ల వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్ సామర్థ్యాన్ని 48 మెగావాట్లకు పెంచుతున్నారు. దీనికి అవసరమైన అనుమతులు మంజూరు చేశారు. ఇది కాకుండా, దుండిగల్‌లో 14.5 మెగావాట్ల కొత్త డబ్ల్యుటిఇ ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఫతుల్లాగూడలో 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం గల రీసైక్లింగ్ ప్లాంట్ ప్రారంభించారు. దీంతో హైదరాబాద్‌లో ఇప్పుడు రెండు 500 మెట్రిక్ టన్నుల రీసైక్లింగ్ ప్లాంట్లు ఉన్నాయి.
క్యాపిటల్ ఇంటెన్సివ్ పనులను చేపట్టేందుకు రూ.5983 కోట్ల విలువైన రుణాలను పొందగలిగింది. ఖాతా బ్యాలెన్స్‌ని తనిఖీ చేసిన తర్వాత బ్యాంకులు నుంచి రూ.2000 కోట్లను రాష్ట్ర గ్యారెంటీ లేకుండానే పొందడం జరిగింది . జీ##హచ్‌ఎంసీ తన సొంత వనరులతో రూ. 8,965.కోట్ల విలువైన పనులను చేపడుతోంది. హైదరాబాద్‌లో క్లిష్టమైన మిస్సింగ్ లింక్ రోడ్‌లను విజయవంతంగా పూర్తి చేసి అన్ని ప్రాంతాలను సులభ రవాణా మార్గాలుగా ప్రభుత్వం అభివద్ధి చేస్తున్నది. ప్రణాళికాయుతంగా ప్రభుత్వం చేపడుతున్న పనులతో తెలంగాణ నగరాలు, పట్టణాలు నేడు ఆర్ధికవద్ధికి,ఉత్పత్తికి, ఉపాధికి అనువైన నిలయాలుగా విస్తరిస్తున్నాయి.