దేశమంతా దుమారం
అక్రమాలను పసిగట్టిన ఎన్సీసీటీఏయూ
కళ్లు తెరచిన కేంద్ర సర్కారు
తక్షణ స్పందన.. పరీక్ష రద్దు చేస్తూ నిర్ణయం
సీబీఐకి విచారణ బాధ్యతల అప్పగింత
ఆరోపణలతో రెచ్చిపోతున్న ప్రతిపక్షాలు
నెట్ సరే, నీట్ సంగతేంటి.. కాంగ్రెస్ నేత ఖర్గే ఆగ్రహం
అబ్ కీ బార్ పేపర్ లీకేజీ.. అఖిలేష్ మండిపాటు
ఆంధ్రప్రభ స్మార్ట్, ఢిల్లీ ప్రతినిధి: దేశ వ్యాప్తంగా నిర్యుద్యోగులు ఒక్క సారి ఉలిక్కి పడ్డారు. విశ్వవిద్యాలయాల్లో, కాలేజీల్లో అధ్యాపకులుగా ఉద్యోగాల వేటలోని ఉద్యోగార్థులు కంగుతిన్నారు. ఆరు మాసాలుగా అహోరాత్రులు శ్రమించి తాము రాసిన పరీక్షను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయటం.. మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారో అనే అంశం ఓ మిస్టరీగా మారటంతో.. 9 లక్షల మంది ప్చ్..! ఇదేం ఖర్మమని ఆందోళన చెందుతున్నారు. రెండు రోజుల కిందట యూజీసీ-నెట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రద్దు చేసిన నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ప్రకటించింది. ఎప్పుడు నిర్వహించేదీ తర్వాత చెబుతామని పేర్కొంది.పరీక్షల పవిత్రతను, విద్యార్థుల నమ్మకాన్ని నిలిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని, జరిగిన అవకతవకల్లో వ్యక్తులు గానీ, సంస్థలుగానీ దోషులుగా తేలితే కఠిన చర్యలు తప్పవని ప్రభుత్వం హెచ్చరించింది.
ఇంతకీ నెట్ అంటే ఏమిటీ?
నెట్ అంటే నేషనల్ ఎలిజిబిలిటీ టెస్ట్. ఈ పరీక్షను యూజీసీ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది. జూనియర్ రీసెర్చ్ ఫెలోషిప్, పీహెచ్‌డీల్లో ప్రవేశాలు, యూనివర్సిటీ, కాలేజీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకాల్లో అర్హత కోసం .. ఉద్యోగార్థులు యూజీసీ – నెట్ పరీక్ష రాస్తారు. నెట్ ను 1989- ..90 విద్యాసంవత్సరంలో యూజీసీ ప్రారంభించింది. ప్రతి ఏటా రెండు సార్లు ఈ పరీక్షను నిర్వహిస్తుంది. ఈ ఏడాది దేశ వ్యాప్తంగా 317 నగరాల్లో 1205 సెంటర్లలోఈనెల 18న పరీక్ష నిర్వహించింది. దాదాపు 11,21,225 మంది ఉద్యోగార్థులు పరీక్షకు దరఖాస్తు చేశారు. కానీ 81 శాతం మందే పరీక్ష రాశారు. అంటే .. సుమారు 9 లక్షల మంది అభ్యర్థులు ఈ పరీక్షకు హాజరయ్యారు. పరీక్ష ముగిసిన 24 గంటల్లోనే ఈ పరీక్ష చెల్లదు.. రద్దు చేస్తున్నాం. అంటూ కేంద్ర విద్యాశాఖ ఒక ప్రకటన జారీ చేసింది. షిట్ ఏం జరిగింది? అంటూ అభ్యర్థులు తెల్లముఖం వేశారు.
ఏం జరిగింది? ఎందుకు రద్దు?
నెట్ పరీక్ష ముగిసిన మరుసటిరోజే అంటే జూన్ 19న నేషనల్ సైబర్ క్రైమ్ థ్రెట్ ఎనలిటిక్స్ యూనిట్ నుంచి యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్‌కు కీలక హెచ్చరిక అందింది. యూజీసీ-నెట్ పరీక్షల నిర్వహణలో అవకతవకలు జరిగినట్టు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని ఈ సమాచార సారాంశం. అంతే నెట్ పరీక్షను రద్దు చేసినట్టు కేంద్రం తెలిపింది.సమగ్ర దర్యాప్తు కోసం ఈ కేసును సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు అప్పగిస్తున్నట్టు ప్రభుత్వం తెలిపింది.
రాజకీయ అలజడి
సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేసి.. మిత్ర పక్షాలను ప్రసన్నం చేసుకోవటంలో మోదీ త్రయం నానా తంటాలు పడుతున్న తరుణంలో… నెట్లీకేజీ వ్యవహారంతో బీజేపీలో కలవరం రేగింది. మరో వైపు అక్రమాలు..లీకేజీలపై ప్రతిపక్షాలు స్వరం పెంచాయి. కాంగ్రెస్పూర్తిస్థాయిలో అస్ర్త శస్ర్తాలు సంధిస్తోది. ‘మోదీజీ.. నీట్, నెట్ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు?’యువత భవితతో మోదీ ప్రభుత్వం ఆడుకుంటోందని కాంగ్రెస్ విమర్శించింది.‘‘దేశంలోని పలు ప్రాంతాలలో యూజీసీ -నెట్ పరీక్ష జరిగింది. పేపర్ లీక్ అయిందనే అనుమానంతో ఈరోజు పరీక్షను రద్దు చేశారు. అంతకుముందు నీట్ పేపర్ లీక్ అయింది. ఇప్పుడు యూజీసీ-నెట్. మోదీ ప్రభుత్వం ‘పేపర్ లీక్ ప్రభుత్వం’గా మారిపోయింది’’ అని సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’లో కాంగ్రెస్ విమర్శించింది.‘‘నరేంద్ర మోదీజీ.., మీరు పరీక్షల గురించి చాలా చర్చించారు. మరి నీట్, నెట్ పరీక్షల గురించి ఎప్పుడు మాట్లాడతారు?’’ అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.‘‘యూజీసీ-నెట్ పరీక్ష రద్దు లక్షలాది మంది విద్యార్థుల విజయం. యువత భవితను తుంగలో తొక్కాలని చూసిన మోదీ ప్రభుత్వ అహంకారానికి ఇది ఓటమి’’ అని ఖర్గే అన్నారు.
అబ్ కి బార్ పేపర్ లీక్ : అఖిలేష్ యాదవ్ ట్వీట్
‘‘ముందు కేంద్ర విద్యాశాఖా మంత్రి యూజీ నీట్ పరీక్ష పేపర్ లీక్ కాలేదని చెప్పారు. కానీ బీహార్, గుజరాత్, హరియాణాలోఅరెస్ట్‌లు జరగగానే ఏదో కుంభకోణం జరిగిందనే విషయాన్ని విద్యాశాఖామంత్రి అంగీకరించారు’’ అని చెప్పారు.యూజీసీ-నెట్‌లాగే, నీట్ పరీక్షను ఎప్పుడు రద్దు చేస్తున్నారని మల్లికార్జున్ ఖర్గే ప్రశ్నించారు.”మీ ప్రభుత్వాల రిగ్గింగ్‌ను, నీట్ పరీక్షల్లో పేపర్ లీకులను అరికట్టే బాధ్యత తీసుకోండి’’ అని ఆయన మోదీని కోరారు. ఇక సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ కూడా పరీక్షల రద్దుపై ప్రభుత్వాన్ని విమర్శించారు.‘‘అబ్‌కీ బార్, పేపర్ లీక్ గవర్న్‌మెంట్’’ అని అఖిలేష్ యాదవ్ ‘ఎక్స్’లో పోస్టు చేశారు.
నీట్ గురించి ఏమంది?
= గడిచిన కొన్ని రోజులుగా నీట్ పరీక్షపై దుమారం రేగుతోంది. కొందరు అభ్యర్థులకు గ్రేస్ మార్కులు కలిపిన వ్యవహారంపై విమర్శలు వస్తున్నాయి. ప్రభుత్వం తన ప్రకటనలో ఆ విషయాన్ని కూడా ప్రస్తావించింది
= ప్రభుత్వం తన ప్రకటనలో నీట్ (యూజీ) పరీక్ష -2024 గురించి ప్రస్తావిస్తూ గ్రేస్ మార్కుల అంశాన్ని పూర్తిగా పరిష్కరించామని తెలిపింది.
= పాట్నాలో పరీక్ష నిర్వహణలో జరిగిన కొన్ని అక్రమాలపై బిహార్ పోలీసుల ఎకనమిక్ అఫెన్సెస్ యూనిట్ నుంచి సమగ్ర నివేదిక కోరామని, నివేదిక రాగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని తెలిపింది. దోషులుగా తేలినవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఎన్‌టీఏ ఏం చేస్తుంది?
= నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ – ఎన్‌టీఏ అనేది కేంద్ర విద్యా శాఖా ద్వారా జాతీయ స్థాయిలో అర్హత పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాటుచేసిన స్వయంప్రతిపత్తి కలిగిన సంస్థ.
= పరీక్షల సన్నాహాలు, నిర్వహణకు సంబంధించిన మొత్తం ప్రక్రియను ఈ ఏజెన్సీనే చూస్తుంది. అందులో ఎదురయ్యే సమస్యల పరిష్కారం కూడా దాని బాధ్యతే.
= అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలు, సమర్థత, పారదర్శక ప్రవేశాల ప్రక్రియ, నియామకాల కోసం అభ్యర్థుల మూల్యాంకనం ఈ సంస్థ ద్వారానే జరుగుతుంది.
= ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం, ఫెలోషిప్ కోసం ప్రవేశ పరీక్షలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) ద్వారానే నిర్వహిస్తారు. ఇందులో నీట్, నెట్ తదితర పరీక్షలు ఉన్నాయి.