ఒకప్పుడు మేలుజాతి ఆవులు మన సొంతం
ఇప్పుడు బ్రెజిల్ పైచేయి
నెల్లూరు ఆవులపై ప్రయోగాలు
ఒక ఆవు ధర రూ.35.30 కోట్లు
అర మి.లీ. వీర్యం రూ.4 లక్షలు
బ్రెజిల్ ఆవుల సంతతిలో 80శాతం నెల్లూరు జాతివే
వాటి వీర్యంతో కోట్ల డాలర్ల వ్యాపారం
ఆర్థికంగా పుంజుకున్న బ్రెజిల్ శ్రీ మరిచిన మనం మేల్కొన్నాం!
ఇప్పుడిప్పుడే మేలుజాతి ఆవుల ఉత్పత్తిపై దృష్టి
న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ ప్రత్యేక ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్‌లోని ఉమ్మడి నెల్లూరు జిల్లా నుంచి కొన్ని దశాబ్దాల క్రితం కొన్ని ఆవుల్ని బ్రెజిల్‌కు తీసుకెళ్ళారు. వాటి జన్యు లక్షణాల్ని మరిం తగా అభివృద్ధి చేశారు. అలాంటి నెల్లూరు జాతికి చెందిన ఒక ఆవు విలువ ఇటీవల 35.30 కోట్లు పలికింది. వియాటినా 19ఎఫ్4 తరహా జన్యువులుగల ఈ నాలుగున్నరేళ్ళ ఆవును కొనుగోలు చేసేందుకు అంతర్జాతీయ స్థాయి పాల సంస్థలు పోటీలుపడ్డాయి.
ఇప్పుడు బ్రెజిల్‌లో క్షీర విప్లవం కొనసాగు తోంది. బ్రెజిల్‌లో 16 కోట్లకు పైగా ఆవులున్నాయి. వీటిలో 80 శాతం మన నెల్లూరు జాతికి చెందిన జన్యువులను అభివృద్ధి చేసి పుట్టించినవే. ఇప్పుడు పాలతోపాటు వీటి వీర్యం మార్కెట్ ద్వారా బ్రెజిల్ ఏటా బిలియన్ డాలర్లు సంపాదిస్తోంది.ఈ జాతికి చెందిన ఎద్దుల శ్రేష్టమైన వీర్యం అర మిల్లిdలీటర్ ధర అంతర్జాతీయ మార్కెట్‌లో 4 లక్షలు పలుకుతోంది. ఈ వీర్యంతో పుట్టించిన ఆవులకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండడం, అధిక ఉష్ణోగ్రతల్ని తట్టుకునే సామర్థ్యం కలిగుండడం, ఎలాంటి ఇబ్బందుల్లేకుండా సునాయాసంగా పునరు త్పత్తి చేయగలగడం ఆ జాతి ప్రత్యేకత. ఈ కారణంగానే ఈ వీర్యానికి ఇంతటి ధర పలుకుతోంది.
వాస్తవానికి ఇవి భారతీయ ఆవుల జన్యువుల ద్వారా అభి వృద్ధి పర్చినవే. కానీ మనకు ముందుచూపు కొరవడడంతో ఒకప్పుడు ప్రపంచంలోనే మేలు జాతి ఆవుల్ని ఎద్దుల్ని సరఫరా చేసిన భారత్ తిరిగి వాటి వీర్యాన్ని భారత్ దిగుమతిం చేసుకుంటోంది. గతేడాది బ్రెజిల్ నుంచి తొలిసారిగా 40 వేల డోసుల ఎద్దుల వీర్యాన్ని భారత్ ది గుమతి చేసుకుంది. 2034 నాటికి దేశీయ డైరీ అవసరాలు 330 మిలియన్ టన్నులకు పెరు గుతాయన్న అంచనాల నేపథ్యంలో ఈ వీర్యం దిగుమతి తప్పనిసరైంది. 2023లో భారత్ 230.60 మిలియన్ టన్నుల పాలను ఉత్పత్తి చేసింది. ఇది గతేడాదికంటే 3.8 శాతం అధికం. అలాగే 2019 నాటి ఉత్పత్తికంటే 22.80 శాతం ఎక్కువ.
పాల ఉత్పత్తిలో భారత్ టాప్
వాస్తవానికిప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద పాల ఉత్పత్తిదారుగా భారత్ రూపుదిద్దుకుంది. దేశంలో డైరీ పరిశ్రమ 8.9 శాతం వార్షిక వృద్ధిని నమోదు చేస్తోంది. 2023లో 124.93 బిలియన్ డాలర్లుగా ఉన్న పాడి పరిశ్రమ 2030 నాటికి 227.53 బిలియన్ డాలర్లకు పెరుగుతుందని అంచనాలేస్తున్నారు. ఇప్పటికే ప్రపంచ పాల ఉత్పత్తిలో భారత్ 24శాతం వాటా కలిగుంది. దేశంలో ఇది 8 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తోంది.
భారత్‌లో పాడి, పంటలను వేరుచేసి చూడలేం. ఈ దేశంలో రెండూ పరస్పర సంబంధం కలిగున్నాయి. ఒకప్పుడు వ్యవసాయంలో ఎద్దులు ప్రధాన పాత్ర పోషించేవి. రాన్రాను సాగులో యాంత్రీకరణ పెరిగి నప్పటికీ పాడి ప్రాధాన్యత మాత్రం తగ్గలేదు. ఈ దేశంలో ఇల్లు, భూముల్తో పాటు తమకున్న పశువుల్ని కూడా సంపదగా పరిగణిస్తారు. ఎన్ని ఎక్కువ పశువులుంటే అంత మోతుబరిగా ఇప్పటికీ గ్రామాల్లో రైతుల్ని చూస్తారు. భారతీయులకు పశువులతో ప్రత్యేక అనుబంధం, చనువుంటాయి. రాన్రాను పాడి కూడా కార్పొరేట్ పరిశ్రమగా రూపుదిద్దుకుంది. దేశీయంగా పెద్దసంఖ్యలో ఇది ఉపాధి అవకాశాల్ని కల్పిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా పాడిపరిశ్రమ వృద్ది రేటు 2 శాతమైతే భారత్‌లో మాత్రం ఇది ఆరుశాతానికి పైగా నమోదౌతోంది.
అయితే పాడిపరిశ్రమకు సంబంధించి దేశీయంగా ఎంత అభివృద్ధి సాధిస్తున్నా ఈ ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ వెనుకబడి ఉంది. 2022లో ప్రపంచ వ్యాప్తంగా పాల ఉత్పత్తుల ఎగుమతుల విలువ 63 బిలియన్ డా లర్లయితే ఇందులో భారత్ ఎగుమతి చేసింది 392 మిలియన్ డాలర్ల విలువైన ఉత్పత్తులు మాత్రమే. అంటే ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటా 0.62 శాతం మాత్రమే. రాబోయే 25 ఏళ్ళలో దేశాన్ని అతిపెద్ద పాడి ఎగుమతిదారుగా మార్చాలని కేంద్రం లక్ష్యాన్ని నిర్దేశించుకుంది.
ప్రపంచవ్యాప్తంగా అధికంగా ఎగుమతవుతున్న పాల ఉత్పత్తులు బ్రెజిల్, అమెరికా, ఇంగ్లాండ్‌ల నుంచే. ఈ మూడు చోట్లా నెల్లూరు జాతి పశువుల పెంపకాన్ని విప్లవాత్మకంగా చేపట్టారు. ప్రత్యేకంగా వీటి జన్యువుల్ని అభివృద్ధిపర్చి సరికొత్త జాతుల్ని సృష్టించారు. అయితే వీటి మూలాధారాలన్నీ భారత్‌లోనే ఉన్నాయి. మనం మన జాతుల్ని తగిన రీతిలో అభివృద్ధి చేసుకోలేకపోయాం. మన జాతి పాడిసంపదను బ్రెజిల్ సమర్థ వంతంగా వినియోగించుకుని వాటి వీర్యాన్ని అమ్మడం ద్వారా బిలియన్ డాలర్లు, పాడి ఉత్ప త్తుల ఎగుమ తుల ద్వారా మరికొన్ని బిలియన్ డాలర్లను ఆర్జిస్తోంది. కొన్నేళ్ళ క్రితమే మేల్కొన్న భారత ప్రభుత్వం ఇప్పు డు దేశీయంగా తిరిగి పాల ఉత్పత్తి పెంపునకు అవసరమైన జన్యువుల్తో కూడిన పశు సంతతిని అభివృద్ధి పరుస్తోంది. ఇందుకోసం ఒకప్పుడు భారత్ నుంచి సరఫరా చేసి న మేలు జాతి పశువుల వీర్యాన్ని కొని తెచ్చేందుక్కూడా వెనుకాడ్డం లేదు. ఇదే తరహాలో ముందుకెళ్తే లక్ష్యాల మేరకు రానున్న దశాబ్దం చివరినాటికి అంతర్జాతీయ పాల ఉత్పత్తుల ఎగుమతుల్లో భారత్ అగ్రగామిగా ఉంటుంది. ఈ దశ సంపద కొన్ని వందల బిలియన్ల డాలర్లకు చేరుకుంటుంది. వీటిపై కొన్ని కోట్లమందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తుందని మార్కెట్ నిపుణులు విశ్లేషిస్తున్నారు.