Saturday, November 23, 2024

సీబీఐకి నెల్లూరు కోర్టు చోరీ కేసు.. హైకోర్టు ఆదేశాలు

అమరావతి, ఆంధ్రప్రభ: నెల్లూరు జిల్లా కోర్టులో జరిగిన రికార్డుల చోరీ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగించాలని హైకోర్టు నిర్ణయించింది. ఇందుకు తమకెలాంటి అభ్యంతరంలేదని ప్రభుత్వం, ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యవసాయశాఖ మంత్రి కాకాణి గోవర్థనరెడ్డి స్పష్టం చేశారు. కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సీబీఐ కూడా సంసిద్ధత వ్యక్తం చేసింది. మంత్రి కోవర్థనరెడ్డిపై అభియోగాలు మోపుతూ కొన్ని సాక్ష్యాధారాలతో కూడిన సీడీలు, ఇతర వస్తువులను మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి నెల్లూరు జిల్లా కోర్టు ముందుంచారు. ఫోర్జరీ కేసుకు సంబంధించి ఇతర డాక్యుమెంట్లను అందజేశారు. అయితే ఈ రికార్డులు, డాక్యుమెంట్లు గత కొద్ది నెలల క్రితం చోరీకి గురయ్యాయి. జిల్లా కోర్టులో జరిగిన దొంగతనానికి సంబంధించి జిల్లా ప్రిన్సిపల్‌ జడ్జి (పీడీజే) సీ యామిని హైకోర్టుకు నివేదిక సమర్పిం చారు. నివేదికను పరిశీలించిన ఉన్నత న్యాయస్థానం ఈ కేసును సుమోటోగా విచారించాలని నిర్ణయించింది. దీన్ని సుమోటో పిల్‌గా మలచి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్‌ డీవీఎస్‌ఎస్‌ సోమయాజులుతో కూడిన ధర్మాసనం విచారణ జరుపుతోంది. మంగళవారం మరోసారి సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది.

ఈ కేసును స్వతంత్ర సంస్థతో దర్యాప్తు జరిపించాల్సిందిగా పీడీజే నివేదికలో అభిప్రాయం వ్యక్తం చేసిన అంశాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. స్థానిక పోలీసులు సరైన రీతిలో విచారించలేదని, కాలి, వేలి ముద్రల సేకరణ జరపలేదని నివేదికలో వివరించారని గుర్తుచేసింది. దొంగతనానికి ముందు రోజు భద్రతా సిబ్బంది నిర్లక్ష్యంపై కూడా పీడీజే యామిని జిల్లా ఎస్పీకి లేఖ రాసినట్లు నివేదిక స్పష్టం చేస్తోందని ధర్మాసనం తేల్చి చెప్పింది. మంత్రి కాకాణి తరుపున న్యాయవాది కె రథాంగపాణి జోక్యం చేసుకుంటూ సీబీఐ దర్యాప్తునకు కోర్టు ఆదేశాలిస్తే తమకెలాంటి అభ్యంతరంలేదని స్పష్టం చేశారు. ఇందుకు తగిన అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశించినా సమర్పిస్తామన్నారు. అడ్వొకేట్‌ జనరల్‌ ఎస్‌ శ్రీరాం స్పందిస్తూ ఈ వ్యవహారంలో అంతిమ నిర్ణయం కోర్టుదే అన్నారు. ఏ విచారణకైనా ప్రభుత్వం సిద్ధమే అని ప్రకటించారు. ఇప్పటికే దీనిపై కౌంటర్‌ దాఖలు చేశామని తెలిపారు. ఇంతకీ సీబీఐ తరుపు న్యాయవాది ఎవరని ధర్మాసనం ప్రశ్నించింది.

కోర్టు ఆదేశిస్తే దర్యాప్తు నిర్వహించేందుకు సీబీఐ సిద్ధంగా ఉందని న్యాయవాది అలేఖ్య బదులిచ్చారు. ఈ విషయంలో తమకు కూడా ఎలాంటి అభ్యంతరాలులేవని హైకోర్టు న్యాయవాది ఎన్‌ అశ్వనీకుమార్‌ చెప్పటాన్ని ధర్మాసనం ఆక్షేపిస్తూ ఈ విషయాన్ని మీరెలా చెప్తారని ప్రశ్నించింది. ఎవరైనా మీతో చెప్పిస్తున్నారా అని నిలదీసింది. కోర్టు ముందున్న రికార్డుల మేరకు నిర్ణయం తీసుకునేందుకు మాత్రమే తమకెలాంటి అభ్యంతరంలేదని చెప్పామని న్యాయవాది అశ్వనీకుమార్‌ బదులిచ్చారు. దీన్ని ధర్మాసనం రికార్డు చేసింది. పీడీజే నివేదిక ఆధారంగా ఈ కేసును దర్యాప్తు చేయాల్సిందిగా సీబీఐని ఆదేశిస్తూ ఉత్తర్వులు జారీ చేస్తామని ధర్మాసనం ప్రకటించింది. అయితే పాలనాపరమైన నిర్ణయంలో భాగంగా ఫైల్‌ తన వద్దకు రాలేదని సీజే జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రా తెలిపారు. ఈ వ్యవహారంపై త్వరలో పూర్తి స్థాయి ఉత్తర్వులు జారీ చేస్తామని ప్రకటించారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement