హైదరాబాద్, ఆంధ్రప్రభ : పోలీసు ఉద్యోగార్థులకు పోలీసు నియామక మండలి కీలక సూచనలను చేసింది. నియామకాల ప్రక్రియను దరఖాస్తుల ప్రక్రియ పూర్తవడం, ఆగస్టులో రెండు దఫాల్లో ఎస్‌ఐ, కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించిన ప్రిలిమినరీ పరీక్షను నిర్వహించేందుకు అధికారులు సన్నద్దమవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అభ్యర్థులకు అధికారులు కీలక సూచన చేశారు. గతంలో జరిగిన పోలీసు ప్రిలిమ్స్ పరీక్షల్లో నెగిటివ్ మార్కులు లేవని, ఈసారి జరగబోయే పరీక్షలో తొలిసారిగా నెగిటివ్ మార్కింగ్‌ను పెట్టడం జరిగిందని పేర్కొన్నారు.
2018 నోటిఫికేషన్ సమయంలో పీడబ్ల్యూటీలో అర్హత పొందేందుకు కేటగిరీల వారిగా వేర్వేరు మార్కులు సాధించాల్సి వచ్చేదని, ఓసీలైతే 40 శాతం, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, మాజీ సైనికోద్యోగులకు 30 శాతం రావాల్సి ఉండేది, అప్పట్లో నెగిటివ్ మార్కులుండేవి కావు. ఈసారి అందుకు భిన్నంగా అన్ని కేటగిరీల అభ్యర్థులకు 30 శాతమే అర్హతగా పరిగణించనున్నారు. కాగా… 200 మార్కులున్న ప్రశ్నాపత్రంలో 60 సరైన సమాధానాలను గుర్తించ గలిగితే తర్వాత జరిగే శారీరక సామర్థ్య పరీక్షలకు అర్హత సాధించగలుగుతారు.
ఓఎంఆర్ షీట్‌లో ఎలాంటి బబ్లింగ్ లేకుండా ఉన్న సమాధానాలకు సున్నా మార్కులను పరిగణనలోకి తీసుకోనున్నారు. అలాకాకుండా బబ్లింగ్ చేసి జవాబు తప్పు అయితే నెగటివ్ మార్కులు వేయనున్న నేపథ్యంలో ఐదు తప్పుడు సమాధానాలకు ఒక్కో నెగిటివ్ మార్క్ పడనుంది. ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుని అభ్యర్థులు ఊహించి సమాధానాలు రాయకపోవడమే మంచిదని అధికారులు సూచిస్తున్నారు.
ఇదిలా ఉండగా, గతంలో కంటే ఈ సారి ఉద్యోగార్థుల నుంచి పోలీసు నియామక మండలి వెబ్‌సైట్‌కు వచ్చిన దరఖాస్తులలో చాలా వరకు తిరస్కరణకు గురయ్యాయి. మొత్తం 17,291 పోస్టుల భర్తీకి వేర్వేరు నోటిఫికేషన్లు వెలువడగా, వీటిలో 587 సబ్ ఇన్‌స్పెక్టర్ పోస్టులున్నాయి. ఈ పోస్టుల కోసం సుమారు 2.47 లక్షల దరఖాస్తులు వచ్చాయి. 16,704 కానిస్టేబుళ్ళ పోస్టుల కోసం దాదాపు 9.54 లక్షల దరఖాస్తులు అందాయి. పరిశీలన అనంతరం ఎస్సై పోస్టులకు సుమారు 2.45 దరఖాస్తులు, కానిస్టేబుల్ పోస్టులకు 6.5 లక్షల దరఖాస్తులే మిగిలాయని అధికారులు తెలిపారు. కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి వేర్వేరు విభాగాలకు వేర్వేరు సెల్ నంబర్లతో దరఖాస్తులు చేసుకోవడం ఇందుకు ప్రధాన కారణమని అదికారులు పేర్కొంటున్నారు.
లోకల్ టు గ్లోబల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్బుక్, ట్విటర్, టెలిగ్రామ్ పేజీలను ఫాలో అవ్వండి.