Sunday, November 24, 2024

ఒకే ద‌ఫా నీట్…

జూన్‌ లేదా జులైలో అర్హత పరీక్ష …. పెన్ను, పేపర్‌ పద్దతిన నీట్‌ నిర్వహణ

ఈ ఏడాది 16 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని అంచనా

హైదరాబాద్‌, వైద్య విద్యలో ప్రవేశా లకు జాతీయ స్థాయిలో ఏటా నిర్వహించే అర్హత పరీక్ష (నీట్‌)ను ఈ ఏడాది జూన్‌ లేదా జులైలో జరిపేందుకు కేంద్ర విద్యాశాఖ ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఈ ప్రవేశ పరీక్షకు ఈ ఏడాది 15 నుంచి 16 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని కేంద్ర విద్యాశాఖ కార్యదర్శి అమిత్‌ ఖేర్‌ చెప్పారు. కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ ఏడాది నీట్‌లో ఎటువంటి మార్పులు చేయరాదని గత ఏడాది మాదిరిగానే ఈ ప్రవేశ పరీక్షను నిర్వ హించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించి నట్టు ఆయన చెప్పారు. ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, యునాని, హోమియోపతి కోర్సుల్లో ప్రవేశాలకు జాతీయ స్థాయిలో ఈ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.
వివిధ రాష్ట్రాల్లో ఆయా ప్రభుత్వాలు జరిపే ప్రవేశ పరీక్షల తేదీలను పరిగణలోకి తీసుకుని నీట్‌ జరిపే షెడ్యూల్‌ను ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించింది. వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహిస్తున్న నీట్‌ను ఈ ఏడాది రెండు దఫాలు జరపాలని ప్రతిపాదనలు వచ్చినప్పటికీ ఈ విషయంలో ఇప్పటి వరకు ఎటువంటి నిర్ణయం వెలువడలేదు. కరోనా నేపథ్యంలో విద్యార్థులు ఇళ్లకే పరిమితం కావడం, చాలా రాష్ట్రాల్లో ఇంకా ఆన్‌లైన్‌ పద్ధతిన ఇంటర్మీడియట్‌, ప్లస్‌-2 తరగతులు జరిపిస్తుండడంతో ఈ ఏడాది ఒకే దఫా నీట్‌ను నిర్వహించాలన్న నిర్ణయానికి కేంద్ర ప్రభుత్వం వచ్చినట్టు తెలుస్తోంది. ఆన్‌లైన్‌ ద్వారా రెండు దఫాలు నీట్‌ను నిర్వహించడం వల్ల సాంకేతికపరమైన సమస్యలు వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో నీట్‌ను ఈ ఏడాది ఒకే దఫా జరపాలని కేంద్రం ప్రతిపాదించినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఈ ఏడాది జేఈఈ మెయిన్‌ పరీక్షను పలు దఫాలు నిర్వహించాలని ప్రతిపాదించడంతో నీట్‌ను కూడా రెండుసార్లు జరిపితే బాగుంటుందన్న అభిప్రాయం విద్యార్థులు, వారి తల్లిదండ్రుల నుంచి వ్యక్తమవుతోంది. వీటిని పరిశీలించిన కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు ఆన్‌లైన్‌ ద్వారా కాకుండా పెన్ను, పేపర్‌ పద్ధతిన ఈ పరీక్ష జరిపితే మూల్యాంకనం, ఫలితాల ప్రకటనలో ఆలస్యం జరుగుతుందన్న అభిప్రాయాన్ని వ్యక్తంచేసింది. కరోనా కేసులు పెరుగుతుండడం, విద్యార్థులు కేవలం ఆన్‌లైన్‌ తరగతులకే పరిమితం కావడంవల్ల ఆశించిన స్థాయిలో నీట్‌కు సిద్ధం కాలేకపోతున్నారని దీనివల్ల అనుకున్న ఫలితాలు వచ్చే అవకాశాలు లేవని అధికారులు భావిస్తున్నారు. అందుకే రెండుసార్లు నీట్‌ను నిర్వహించాలన్న డిమాండ్‌ అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది.
ఒకే దఫా నీట్‌ను నిర్వహించడంవల్ల విద్యార్థి ఆశించిన స్థాయిలో రాణించలేరని, ఇలా చేయడంవల్ల విద్యా సంవత్సరం కోల్పోవలసి వస్తుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఆన్‌లైన్‌ ద్వారానే కంప్యూటర్‌ ఆధారిత పరీక్షను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించడం కుదురుతుందని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ చెబుతోంది. ఈ ఏడాది నీట్‌ను పేపర్‌, పెన్‌ పద్ధతిన నిర్వహించాలని నిర్ణయించడంతో ఈ పరీక్ష ఒకేసారి మాత్రమే జరపడం కుదురుతుందని ఈ శాఖ అధికారులు తేల్చి చెబుతున్నారు. ఇంజనీరింగ్‌ కోర్సుల్లో ముఖ్యంగా ఐఐటీ, ఎన్‌ఐటీలలో ప్రవేశానికి జేఈఈలో ఖచ్చితంగా ప్రతిభ కనబర్చాలన్న నిబంధన ఉందని కొన్ని విద్యాసంస్థల్లో జేఈఈలో అర్హత సాధించలేకపోయినా ప్రవేశం కల్పిస్తున్నారని వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిబంధనలు కఠినతరంగా ఉన్నాయని వారు గుర్తు చేస్తున్నారు.
ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఇంజనీరింగ్‌, ఇతర వృత్తి విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఇప్పటికే తేదీలను ఖరారు చేసినందున ఆ తేదీలను దృష్టిలో ఉంచుకుని నీట్‌ షెడ్యూల్‌ను ప్రకటించాలని కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ నిర్ణయించింది. జేఈఈ మెయిన్స్‌ను ఈ ఏడాది రెండు దఫాలు నిర్వహిస్తున్నందున భవిష్యత్తులో నీట్‌ను కూడా ఇదే పద్దతిన జరిపేందుకు విద్యాసంవత్సరం ఆరంభం నుంచే తగిన చర్యలు తీసుకోవాలని కేంద్రం భావిస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement