ఆంధ్రప్రభ స్మార్ట్ – న్యూఢిల్లీ ప్రతినిధి – నీట్ యూజీ-2024 సవరించిన తుది ఫలితాలను జాతీయ పరీక్షల నిర్వహణ సంస్థ (ఎన్టీయే) నేడు విడుదల చేసింది. సుప్రీంకోర్టు ఇటీవల వెలువరించిన తీర్పు మేరకు సవరించిన ఫలితాలను నేడు ఎన్టీయే వెల్లడి చేసింది.
ఓ భౌతికశాస్త్ర ప్రశ్నకు సంబంధించి పలువురు విద్యార్థులకు కేటాయించిన గ్రేస్ మార్కును తొలగిస్తూ, తాజా ఫలితాలను విడుదల చేసింది. నీట్ యూజీ ప్రశ్నాపత్నంలో 29వ ప్రశ్నకు రెండు ఆప్షన్లు కరెక్ట్ అని నీట్ ఇటీవల పేర్కొంది. దీన్ని సవాల్ చేస్తూ ఓ విద్యార్థి సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఢిల్లీ ఐఐటీ నిపుణుల కమిటీ నుంచి సూచనలు తీసుకున్న సుప్రీంకోర్టు ఆప్షన్ 4ను టిక్ చేసిన వారికే మార్కులు ఇవ్వాలని తీర్పు వెలువరించింది.
ఈ ఏడాది నీట్ యూజీ ఎంట్రన్స్ పరీక్ష తీవ్ర వివాదాస్పదమైంది. పేపర్ లీక్, కాపీయింగ్ అంశాలు, ఒకరి బదులు మరొకరు పరీక్షలు రాయడం వంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇంతకుముందు, జూన్ 4నే నీట్ ఫలితాలు వెల్లడించడం తెలిసిందే. అందులో 67 మంది 720కి 720 మార్కులు సాధించి టాపర్లుగా నిలిచారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో, వారిలో 44 మంది తమ ఫస్ట్ ర్యాంక్ ను కోల్పోయారు. కాగా, విద్యార్థులు exams.nta.ac.in. వెబ్ సైట్ లో తాజా ఫలితాలను చూసుకోవచ్చు.