నీట్ 2024 నిర్వహణపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పేపర్ లీక్ అయిందంటూ తీవ్ర ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో నీట్ 2024 రద్దును నిరసిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు నిరసనలు తెలుపుతున్నాయి. నీట్ పరీక్షపై కేంద్రం వైఖరికి వ్యతిరేకంగా జులై 4న దేశవ్యాప్త విద్యాసంస్థల బంద్‌కు విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చాయి.
విద్యాసంస్థల బంద్ నిర్వహించనున్నట్లు ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి సిహెచ్.వినోద్, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్.రాజశేఖర్ తెలిపారు. బంద్‌ను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. నీట్ పరీక్షను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రం నిర్వాకం వల్ల లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రమాదంలో పడుతుందన్నారు. దేశవ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల మూసివేతను ఆపాలని, ఐఐటీ అడ్మిషన్లలో రాజకీయ ప్రమేయం లేకుండా చూడాలని డిమాండ్ చేశారు. యూనివర్సిటీల్లో ప్రజాస్వామ్యాన్ని నెలకొల్పాలన్నారు.