Thursday, November 21, 2024

జులై 17న నీట్‌.. ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తుల స్వీకరణ.. లక్షకుపైగా ఎంబీబీఎస్‌ సీట్లు..

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : ఎంబీబీఎస్‌, బీడీఎస్‌తో పాటు యునాని, ఆయుర్వేద, హోమియోపతి కోర్సుల్లో చేరేందుకు ఏటా జాతీయ స్థాయిలో నిర్వహించే నేషనల్‌ ఎలిజిబిలిటీ అండ్‌ ఎంట్రన్స్‌ టెస్ట్‌ (నీట్‌)ను జులై 17న నిర్వహించాలని నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) నిర్ణయించింది. ఏప్రిల్ 2వ తేదీనుంచి నీట్‌కు హాజరయ్యే విద్యార్థులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని మే 7వ తేదీ గడువు తేదీగా నిర్ణయించినట్టు ఎన్‌టీఏ డీజీహెచ్‌ఎస్‌ పేర్కొంది. తెలుగుతో సహా మొత్తం 13 భాషల్లో నీట్‌ను నిర్వహిస్తామని పెన్ను, పేపర్‌ పరీక్ష జులై 17న జరుగుతుందని తెలిపారు. దరఖాస్తు చేసుకునేందుకు మే 7న చివరి తేదీగా నిర్ణయించామని ఆ తర్వాత ఐదు రోజులపాటు విద్యార్థులు తాము చేసిన దరఖాస్తుల్లో అక్షర దోషాలున్నా, మార్పులు చేర్పులు చేసుకునే అవకాశం కల్పిస్తామని తెలిపారు. జాతీయ వైద్య కమిషన్‌తో చర్చించి నీట్‌ పరీక్ష తేదీని ఖరారు చేశామని ఈ పరీక్ష పూర్తి షెడ్యూల్‌ను ఒకటి, రెండు రోజుల్లో ప్రకటిస్తామని తెలిపింది.

గత ఏడాది నీట్‌కు రికార్డు స్థాయిలో 16 లక్షల 14వేల 777 మంది దరఖాస్తు చేసుకున్నారని ఇందులో 95.6 శాతం మంది పరీక్షకు హాజరయ్యారని తెలిపింది. పరీక్ష రాసిన విద్యార్థుల్లో 8 లక్షల 70వేల 074 మంది విద్యార్థులు (56.4 శాతం) అర్హత సాధించారని చెప్పారు. బాలికల విభాగంలో అబ్బాయిలకన్నా 1.19 లక్షలు మంది అమ్మాయిలు నీట్‌లో అర్హత పొందిన వారిలో ఉన్నారని చెప్పారు. జాతీయ స్థాయిలో నీట్‌ టాప్‌ ర్యాంకులు సాధించిన విద్యార్థుల్లో ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని చెప్పారు. నాలుగు లక్షల మంది ఓబీసీ విద్యార్థులు నీట్‌లో అర్హత పొందారని 2.4 లక్షల మంది విద్యార్థులు అన్‌రిజర్వ్‌డ్‌ కోటాలో అర్హత సాధించారని చెప్పారు. డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ 15 శాతం జాతీయ స్థాయి కోటా వైద్య సీట్ల భర్తీకి కౌన్సెలింగ్‌ నిర్వహిస్తుందని తెలిపింది. డీవ్డ్‌ు విశ్వవిద్యాలయాలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, ఈఎస్‌ఐ వైద్య కళాశాలలు, బనారస్‌ హిందు యూనివర్సిటీ వంటి జాతీయ స్థాయి విద్యాసంస్థల్లో వైద్య సీట్ల భర్తీకి హెల్త్‌ సర్వీసెస్‌ సీట్లను భర్తీ చేస్తుందని పేర్కొన్నారు. ఈ ఏడాది నీట్‌కు 17 నుంచి 18 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. జాతీయ స్థాయిలో లక్షకుపైగా ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా మరో 30వేలకు పైగా బీడీఎస్‌, యునాని, ఆయుర్వేద, హోమియోపతి కోర్సుల సీట్లు లభ్యమయ్యే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement