Wednesday, November 20, 2024

Delhi | ఎన్డీఆర్‌ఎఫ్‌‌కు రూ. 1,60,153 కోట్లు.. కేంద్ర హోంశాఖ వెల్లడి

న్యూఢిల్లీ, ఆంధ్రప్రభ : ప్రకృతి వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు 2021-26 కాలానికిగానూ ఎన్డీఆర్‌ఎఫ్‌కు రూ. 1,60,153 కోట్లు కేటాయించినట్లు కేంద్ర హోంశాఖ వెల్లడించింది. తరచూ తుపాన్ల బారిన పడుతున్న కోస్తా రాష్ట్రాలకు సాయపడే విధంగా ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసే ఆలోచన ఏదైనా ఉందా…? తుపాన్ల వలన సంభవించే విపత్తును ఎదుర్కొనే ప్రణాళికలను కాలానుగుణంగా సవరిస్తున్నారా…?

విపత్తు సహాయక ప్రణాళికలు ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించడంలో సహాయం పంపిణీలో సకాలంలో బాధితులకు వైద్య సాయం అందించడంలో వివిధ ఏజెన్సీల మధ్య సమన్వయం చేసుకుంటూ పనులను సమర్ధవంతంగా నిర్వహించే విధంగా రూపొందుతున్నాయా అంటూ బుధవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వైఎస్సార్సీపీ సభ్యులు విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నలకు హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద రాయ్ జవాబిచ్చారు.

- Advertisement -

ఇది కాకుండా మరో 68 వేల కోట్ల రూపాయల తక్షణ సహాయ నిధిని కూడా ఏర్పాటు చేసినట్లు మంత్రి చెప్పారు. అలాగే కోస్తా రాష్ట్రాలు ఆయా రాష్ట్రాలకు చెందిన ఎస్డీఆర్‌ఎఫ్‌ల ద్వారా సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపడుతున్నట్లు తెలిపారు. ఇందుకోసం ఎన్‌డిఆర్‌ఎఫ్ నుంచి ఎస్‌డిఆర్‌ఎఫ్‌కు కేటాయించే నిధులను రాష్ట్ర ప్రభుత్వాలు వినియోగించుకోవచ్చని చెప్పారు.

19,761 కోట్లతో రాయలసీమలో జాతీయ రహదారులు

ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ ప్రాంతంలో 19761.8 కోట్ల రూపాయలతో పలు జాతీయ రహదారులను అభివృద్ధి చేస్తున్నట్లు కేంద్ర జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ వెల్లడించారు. ఎంపీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ ప్రతిపాదించిన ఈ జాతీయ రహదారి ప్రాజెక్ట్‌లలో 9 ప్రాజెక్ట్‌లు నిర్మాణ దశలో ఉండగా 3 ప్రాజెక్ట్‌ కాంట్రాక్ట్‌లు అవార్డు అయినప్పటికీ ఇంకా ప్రారంభం కాలేదని మరో 11 ప్రాజెక్ట్‌లు మంజూరైనప్పటికీ కాంట్రాక్ట్‌ అవార్డు కాలేదని తెలిపారు.

జాతీయ రహదారి 71 పరిధిలో 2237.99 కోట్ల రూపాయలతో చేపట్టిన రేణిగుంట-నాయుడు పేట సెక్షన్ 6 లేన్లు అభివృద్ధి పనులు 2024 జనవరి 31 నాటికి పూర్తి కావలసి ఉండగా ప్రస్తుతం 48.40 శాతం పురోగతి సాధించినట్లు మంత్రి తెలిపారు. అలాగే జాతీయ రహదారి 716లో రేణిగుంట-కడప-ముద్దనూరు రోడ్డులో పాపాగ్ని నదిపై అప్రోచ్ రోడ్డుతో పాటు 82.18 కోట్లతో నిర్మిస్తున్న వంతెన, రహదారి పనులు 2025 జనవరి 31 నాటికి పూర్తవ్వాల్సి ఉండగా 24.79శాతం పురోగతిలో ఉన్నాయని వివరించారు.

మొత్తంగా 12951.68కోట్లతో చేపట్టిన వివిధ జాతీయ రహదారి అభివృద్ది పనులు గ్రౌండ్‌ అయి వివిధ దశల్లో పురోగతిలో ఉన్నట్లు మంత్రి చెప్పారు. 1989.4 కోట్లతో చేపట్టాల్సిన మూడు జాతీయ రహదారి పనులకు సంబంధించిన కాంట్రాక్ట్‌లు అవార్డు పూర్తయి పనులు ప్రారంభం కావాల్సి ఉందని, 4820.72 కోట్లతో చేపట్టాల్సిన మరో 11 ఎన్‌హెచ్‌ పనులు మంజూరై అవార్డు కోసం ఎదురుచూస్తున్నట్టు తెలిపారు.

జాతీయ రహదారుల అభివృద్ధి, నిర్వహణ నిరంతర ప్రక్రియని మంత్రి తెలిపారు. రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించాలని ఆంధ్రప్రదేశ్ సహా వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల తమ మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు అందాయని గడ్కరీ తెలిపారు. అంతర్రాష్ట్ర ప్రాముఖ్యత, వనరులు అందుబాటు, ట్రాఫిక్ స్థాయి, కనెక్టివిటీ అవసరాల దృష్ట్యా కొన్ని రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా ప్రకటించినట్లు పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఏ రహదారినీ జాతీయ రహదారిగా ప్రకటించే ప్రతిపాదనేదీ పరిగణలో లేదని మంత్రి తెలిపారు.

అడవుల పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్ ఆదర్శం

అటవీ ప్రాంతంలో నివసించే ప్రజలను కూడా సమాన భాగస్వాములను చేసినపుడే అడవుల పరిరక్షణ పటిష్టంగా జరుగుతుందని విజయసాయి రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజా సమూహాలు, ప్రభుత్వం ఉమ్మడి కృషే ఒక్కటే అడవుల పరిరక్షణకు ఏకైక పరిష్కారం అని ఆయన అన్నారు. రాజ్యాంగపరంగా అడవులు రాష్ట్ర జాబితా కింద గుర్తించినా దశాబ్దాల కాంగ్రెస్‌ పాలనలో క్రమేపీ అవి ఉమ్మడి జాబితా కిందకు చేరాయని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న అటవీ సంరక్షణ చట్టం ప్రకారం అడవులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే సౌలభ్యం ఉంది.

అయితే ఈ బిల్లులో పొందుపరచిన ఒక క్లాజ్‌ కింద అడవుల వినియోగం, అటవీ భూముల అసైన్‌మెంట్‌ వంటి అంశాలపై ఇకమీదట నిర్ణయాధికారం పూర్తిగా కేంద్ర ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఇక మీదట ఏ ప్రైవేట్ సంస్థకైనా భూములు కేటాయించదలిచినపుడు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధిగా కేంద్ర ప్రభుత్వ అనుమతి తీసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై అటవీ శాఖ మంత్రి వివరణ ఇవ్వాలని ఆయన కోరారు. అడవులకు సంబంధించిన చట్టాల రూపకల్పన లేదా సవరణలు చేసేటప్పుడు కేంద్ర ప్రభుత్వం విధిగా ఆయా రాష్ట్రాలను సంప్రదించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

అరుదైన ఖనిజాల వెలికితీతకు భారీ పెట్టుబడులు

అరుదైన పరమాణు ఖనిజాల వెలికితీత భారీ పెట్టుబడులతో కూడిన ప్రక్రియ అని విజయసాయి రెడ్డి చెప్పారు. గనులు, ఖనిజాల సవరణ బిల్లుపై బుధవారం రాజ్యసభలో జరిగిన చర్చ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అరుదైన పరమాణు ఖనిజాలు ఇతర ఖనిజాలలో అంతర్భాగమై ఉంటాయి. కేవలం ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్‌ మాత్రమే కాదన్న ఆయన, వెలికితీసిన ఖనిజాలను ఖనిజ మిశ్రమాలుగాను ఇతర ఉత్పాదనలుగా మార్చడం సవాళ్ళతో కూడిన పని అని చెప్పారు.

రక్షణ, వ్యవసాయం, ఇంధన, ఫార్మా, టెలికామ్‌ రంగాల అవసరాలను పరిగణలోకి తీసుకుని 30 రకాల అరుదైన ఖనిజాల అవసరం ఉన్నట్లుగా గనుల మంత్రిత్వ శాఖ ఇటీవల విడుదల చేసిన నివేదికను ఈ సందర్భంగా విజయసాయి ప్రస్తావించారు. అరుదైన ఖనిద నిక్షేపాల అన్వేషణ, తవ్వకాలతోపాటు వినియోగం అనంతరం వాటిని రీసైక్లింగ్‌ చేసే విధానంపై కూడా ప్రభుత్వం దృష్టి సారించాలని సూచించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement