- రాత్రి ఘటన స్థలానికి చేరుకున్న భద్రాచలం టీం
- ఉదృతి అధికంగా ఉండటంతో ఉదయం రెస్క్యూ
- రాత్రంతా అప్రమత్తంగా అధికారులు, ప్రజాప్రతినిధులు
మరిపెడ : కూలి కోసం వెళ్లి పాలేరు వాగులో చిక్కుకున్న 23 మంది కూలిలను భద్రాచలం ఎన్‌డీఆర్ఎఫ్ టీం శనివారం ఉదయం సురక్షితంగా ఇవతలి ఒడ్డుకు చేర్చారు. శుక్రవారం ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి పాలేరు వాగు ఉదృతంగా ప్రవహించటంతో మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం కోట్య, తండా, చాంప్ల తండా లకు చెందిన కూలిలు అవతలి వైపు చిక్కుకున్నారు. విషయం తెలుసుకున్న రెండు జిల్లాల అధికార యంత్రాంగం కూలిలు ఉన్న ప్రాంతానికి చేరుకుని రెస్క్యూ ప్రారంభించారు. కాని వాగు ఉదృతి అధికంగా ఉండటంతో విషయాన్ని పై అధికారులకు తెలియజేశారు. దీంతో ఉన్నతాధికారులు భద్రాచలం ఎన్‌డీఆర్ఎఫ్ బృందాన్ని రాత్రి 2 గంటలకు రప్పించారు. వారు ఉదయం 7 గంటలకు 23 మందిని సురక్షితంగా మోటార్ బోట్ సహాయంతో రెస్క్యూ చేసి తీసుకొచ్చారు.
రాత్రంతా అప్రమత్తంగా..
కూలీలు వాగులో చిక్కుకున్నారన్న విషయం తెలుసుకున్న అధికారులు హుటాహుటిన అక్కడికి చేరుకున్నారు. ఎప్పటికప్పుడు అవతలి కూలిలతో ఫోన్లో సంప్రదిస్తూ జాగ్రత్తలు వివరించారు. వారికి కావల్సిన తాగు నీరు, ఆహారాన్ని డ్రోన్ సహాయంతో అవతలి ఒడ్డుకు పంపించారు. కూలీలు వరదల్లో చిక్కుకున్నారు విషయం తెలుసుకున్న మంత్రి సత్యవతి రాథోడ్ కూలిలతో రాత్రి ఫోన్లో మాట్లాడారు భద్రాచలం నుంచి ఎన్ డి ఆర్ ఎఫ్ బృందాలను వస్తున్నట్లు వారికి తెలిపి భరోసా ఇచ్చారు. అందరు సురక్షితంగా ఒడ్డుకు చేరుకోవటంతో కుటుంబసభ్యులు రెండు తండాల వాసులు హర్షం వ్యక్తం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందానికి, అధికార యంత్రాంగానికి, రాత్రి నుంచి అక్కడే ఉండి తండా వాసుల యోగ క్షేమాలు తెలుసుకుంటూ రెస్య్యూకు సహకరించిన తెరాసా నాయకులు తేజావత్ రవీందర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.