హైదరాబాద్ : ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం నిరంతర ప్రక్రియ అని, అర్హులైన ప్రతి ఒక్కరికీ ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇవ్వాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని దేవాదాయ, గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి స్పష్టం చేశారు. మొదటి దశలో ఇంటి స్థలం ఉన్న వారికి… రెండో దశలో స్థలం లేని వారికి ఇంటి స్థలంతో పాటు ఇందిరమ్మ ఇంటిని నిర్మించి ఇస్తామని తెలిపారు.
ఇందిరమ్మ ఇళ్లు, గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్థ, సర్వేయర్ల నియామకంపై.. సచివాలయంలోని తన కార్యాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారితో కలిసి సమీక్షించారు. ఈ సమావేశంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి అవసరమైన ఇంజినీరింగ్ విభాగాన్ని సమీకరించడం, ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారి నియామకం, సర్వేయర్ల నియామకంపై సుదీర్ఘ చర్చ జరిగింది.
ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ… ఇందిరమ్మ ఇళ్లకు అర్హులైన లబ్దిదారులకు సంబంధించిన నివాస స్ధలం ఉన్నవారి జాబితా, ఇళ్ల స్థలాలు లేని వారి జాబితాను రెండు జాబితాలను గ్రామసభల్లో పెట్టాలని అధికారులకు సూచించారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాన్ని దశలవారీగా చేపడుతున్నామని తెలిపారు.
ప్రస్తుతం హౌసింగ్ కార్పొరేషన్‌లో 274 మంది ఇంజినీర్లు మాత్రమే ఉన్నారని, రాష్ట్రంలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం, పర్యవేక్షణకు మరో 400 మంది ఇంజినీర్లు అవసరమని ఈ సందర్భంగా అధికారులు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు.
ఈ సందర్భంగా ఇతర ప్రభుత్వ శాఖల్లో ఇంజినీరింగ్ సిబ్బంది సేవలను ఏ విధంగా వినియోగించుకోవాలో పరిశీలించాలని సీఎస్‌కు మంత్రి సూచించారు. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇళ్ల నిర్మాణానికి ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలని అధికారులకు సూచించారు.
గ్రామ రెవెన్యూ వ్యవస్థకు సంబంధించి.. ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక రెవెన్యూ అధికారిని నియమిస్తామన్నారు. ఇందుకోసం వీఆర్వో, వీఆర్ఏల నుంచి అర్హులను ఎంపిక చేసి వేర్వేరుగా పరీక్ష నిర్వహించాలని, పరీక్ష నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లు వెంటనే చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రస్తుతం 450 మంది సర్వేయర్లు ఉన్నారని, మరో వెయ్యి మంది సర్వేయర్ల అవసరం ఉన్న నేపథ్యంలో ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరగాలని అధికారులకు సూచించారు.
ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ నవీన్ మిట్టల్, హౌసింగ్ సెక్రటరీ జ్యోతి బుద్ధ ప్రకాష్, హౌసింగ్ కార్పొరేషన్ ఎండీ వి.పి.గౌతం, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఇలంబర్తి, సీఎంఆర్‌వో డైరెక్టర్ మకరంద్ తదితరులు పాల్గొన్నారు.