మహిళల టీ20 ప్రపంచకప్‌లో భాగంగా ఇవాళ జరిగిన కీలక మ్యాచ్‌లో భారత మహిళల జట్టు ఓటమి పాలైంది. చావోరేవో పోరులో షార్జా వేదికగా డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో భారత్ తలపడింది. కాగా, ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు చివరి బంతి వరకు పోరాడి 9 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. ఈ ఓటమితో భారత్ సెమీఫైనల్ చేరుతుందా లేదా అనే సందేహం నెలకొంది.
కాగా, ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా భారత బౌలర్లను దెబ్బతీస్తూ… 151/8 పరుగులు చేసింది. గ్రేస్ హారిస్ (40), తహ్లియా మెక్‌గ్రాత్ (32), ఎలిసా పెర్రీ (32) దూకుడుగా ఆడారు. భారత బౌలర్లలో రేణుకా సింగ్, దీప్తి శర్మ రెండేసి వికెట్లు తీయగా… శ్రేయాంక పాటిల్, పూజా వస్త్రాకర్, రాధా యాదవ్ తలో వికెట్ తీశారు.
ఇక, 152 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు శుభారంభం లభించలేదు. కొద్దిసేపటికే టాపార్డ్ కూలిపోయింది. అయితే కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ (54 నాటౌట్) అర్ధ సెంచరీతో పోరాడింది. కానీ మిగతా ఆటగాళ్లు విఫలమవడంతో భారత జట్టు విజయతీరలకు చేరలేకపోయింది. భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 142/9 పరుగులకే పరిమితమైంది.
భారత్ సెమీస్ కు చేరాలంటే!
అయితే, ప్రస్తుతం గ్రూప్-ఎలో ఉన్న అస్ట్రేలియా ఇప్పటికే సెమీస్ బెర్త్ ఖాయం చేసుకుంది. మరోవైపు, భారత జట్టు నాలుగు పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ కూడా నాలుగు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. అయితే, న్యూజిలాండ్‌కి మరో మ్యాచ్ మిగిలి ఉంది. రేపు పాకిస్థాన్‌తో జరిగే మ్యాచ్‌లో న్యూజిలాండ్ గెలిస్తే భారత్ టోర్నీ నుంచి నిష్క్రమించినట్టే. అదే పాక్ గెలిస్తే నెట్ రన్ రేట్ ప్రకారం సెమీస్ చేరే జట్టును నిర్ణయిస్తారు.