Saturday, June 29, 2024

NDA – టార్గెట్ 2047 – విక‌సిత భార‌త్ ల‌క్ష్యం – ప్ర‌ధాని మోదీ

18వ లోక్‌స‌భ తొలి సమావేశాలు సోమ‌వారం ప్రారంభం అయ్యాయి. కొత్తగా ఎన్నికైన సభ్యులంతా పార్లమెంట్‌ భవనానికి వ‌చ్చారు. వరుసగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేప‌ట్టిన‌ నరేంద్ర మోదీ పార్లమెంట్‌లోకి అడుగుపెట్టారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ప‌లు అంశాల‌ను వెల్ల‌డించారు. దేశానికి మూడోసారి సేవచేసే భాగ్యాన్ని కల్పించినందుకు ప్రజలకు ధన్యవాదాలు తెలిపారు. రాజ్యాంగాన్ని గౌరవిస్తూ నిర్ణయాలు తీసుకుంటామని అన్నారు. కొత్త పార్లమెంట్‌ భవనంలో 18వ లోక్‌సభ సమావేశం అవుతోంద‌ని, సంతోషంగా ఉంద‌న్నారు. కొత్తగా ఎన్నికైన సభ్యులకు స్వాగతం పలికారు.

కొత్త ఆశ‌లు, మ‌రింత ఉత్సాహంతో..

- Advertisement -

ప్రపంచంలో అతిపెద్ద ఎన్నికల ప్రక్రియ నిర్వహించాం. 65 కోట్ల మంది ఓటర్లు ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. మా విధానాలకు, అంకితభావానికి జనామోదం లభించింది. ప్రజలు మాకు వరుసగా మూడోసారి సేవచేసే అవకాశం కల్పించారు. ఇది చాలా పవిత్రమైన రోజు. కొత్త సభ్యులకు స్వాగతం. కొత్త ఆశలు, కొత్త ఉత్సాహంతో ముందుకు సాగాలి. అందరి సహకారంతో భరతమాత సేవలో పాల్గొంటాం. కొత్త లక్ష్యాలను చేరుకోవడానికి మనమంతా కృషి చేయాలి. 2047 వికసిత్‌ భారత్‌ సంకల్పం, లక్ష్యాన్ని నెరవేర్చే దిశగా సాగుతాం. రాజ్యాంగానికి గౌరవం ఇస్తూ నిర్ణయాలు తీసుకుంటాం. కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతాం. భారత ప్రజల ఆకాంక్షలను నెరవేర్చేలా కృషి చేస్తాం’ అని మోదీ స్ప‌ష్టం చేశారు.

జ‌న‌హితం కోసం మ‌రింత‌గా ప‌నిచేయాలి

ఎమర్జెన్సీ ద్వారా ప్రజాస్వామ్యంపై పడిన మచ్చకు రేపటితో 50 ఏళ్లు అని ప్రధాని మోదీ ఈ సందర్భంగా గుర్తు చేశారు. అప్పట్లో ప్రజలను జైళ్లలో వేసినట్లు చెప్పారు. 50 ఏళ్లకిందట జరిగిన తప్పు మరెవరూ చేయకూడదన్నారు. మూడో దఫాలో మూడు రెట్లు అధికంగా పనిచేస్తామని ఈ సందర్భంగా మోదీ పునరుద్ఘాటించారు. జనహితం కోసం సభ్యులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని సూచించారు. 18వ లోక్‌సభలో విపక్షం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని వ్యాఖ్యానించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement