ఢిల్లీ – కాంగ్రెస్సేతర నేత వరుసగా మూడోసారి ప్రధాని కావడాన్ని హస్తం పార్టీ జీర్ణించుకోలేకపోతోందని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రతిపక్ష నేత హోదాలో ఉండి రాహుల్ గాంధీ సభలో అవమానకర ప్రసంగం చేశారని మండిపడ్డారు. ఆయనలా ఎవరూ ప్రవర్తించొద్దని ఎన్డీయే ఎంపీలంతా పార్లమెంటరీ విధి విధానాలను తప్పనిసరిగా పాటించాలని సూచించారు.
మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారిగా ఎన్డీయే పార్లమెంటరీ పార్టీ సమావేశం ఇవాళ జరిగింది. ఈ సందర్భంగా అధికార పక్ష ఎంపీలకు ప్రధాని మోదీ దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కొత్తగా ఎన్నికైన సభ్యులు నిబంధనల విషయంలో సీనియర్లను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, రాహుల్ గాంధీపై పరోక్షంగా విమర్శలు గుప్పించారు.
పార్లమెంట్‌లో ప్రతిపక్ష నేత రాహుల్ ప్రవర్తించిన తీరు అమర్యాదకరం అని మోదీ అన్నారు. స్పీకర్ స్థానాన్ని ఆయన అవమానించారని మండిపడ్డారు. ఆయనలా ఎన్డీయే సభ్యులెవరూ ప్రవర్తించొద్దని సూచించారు. ‘”పార్టీలకు అతీతంగా దేశంలోని ప్రతీ ఎంపీ తమ కుటుంబసభ్యులతో కలిసి ప్రధానమంత్రి సంగ్రహాలయ్ (గతంలోని నెహ్రూ మ్యూజియం)ను సందర్శించాలి. అందులో మాజీ ప్రధాని నెహ్రూ నుంచి మోదీ వరకు ప్రధానుల ప్రయాణాన్ని అందంగా ప్రదర్శించారు. వారి జీవిత విశేషాలను మనమంతా తెలుసుకోవాలి’’ అని ప్రధాని ఎంపీలకు సూచించారు.