– ఇంటర్నెట్ డెస్క్, ఆంధ్రప్రభ
2022లో దాదాపు 31,000 ఫిర్యాదులను జాతీయ మహిళా కమిషన్ (NCW) స్వీకరించింది. ఇది 2014 తర్వాత అత్యధిక కేసులు నమోదైన సంవత్సరంగా తెలుస్తోంది. 2021లో NCWకి 30,864 ఫిర్యాదులు అందగా, 2022లో ఈ సంఖ్య 30,957కి పెరిగింది. ఎన్సిడబ్ల్యు డేటా ప్రకారం.. 30,957 ఫిర్యాదులలో గరిష్టంగా 9,710 మహిళల మానసిక వేధింపులకు సంబంధించినవే ఉన్నాయి. గౌరవంగా జీవించే హక్కుకు సంబంధించినవి ఉన్నట్టు తెలుస్తోంది. ఆ తర్వాత గృహ హింసకు సంబంధించినవి 6,970.. వరకట్న వేధింపులకు సంబంధించినవి మరో 4,600 ఉన్నాయి.
నేషనల్ విమెన్స్ కమిషన్ డేటా ప్రకారం.. గౌరవంగా జీవించే హక్కు, గృహ హింసకు సంబంధించిన ఫిర్యాదులలో అత్యధిక సంఖ్యలో ఉత్తరప్రదేశ్ నుండి వచ్చాయి. ప్యానెల్ 33,906 ఫిర్యాదులను స్వీకరించిన 2014 తర్వాత 2022లో NCWకి అందిన ఫిర్యాదుల సంఖ్య అత్యధికం. మహిళల పట్ల అసభ్యత లేదా వేధింపులకు సంబంధించిన నేరాలకు సంబంధించి 2,523 ఫిర్యాదులు అందగా.. 1,701 అత్యాచారం, అత్యాచార యత్నాలకు సంబంధించినవి ఉన్నాయి. ఇక.. 1,623 ఫిర్యాదులు మహిళలపై పోలీసుల ఉదాసీనత, 924 ఫిర్యాదులు సైబర్ నేరాలకు సంబంధించినవి ఉన్నట్టు సమాచారం.