Tuesday, November 19, 2024

ఎన్సీపీ జాతీయ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ కి.. హ‌త్యా బెదిరింపులు.. కేసు న‌మోదు చేసిన పోలీసులు

గుర్తు తెలియ‌ని దుండ‌గుడు కాల్ చేసి ఎన్సీపీ జాతీయ అధ్య‌క్షుడు శ‌ర‌ద్ ప‌వార్ ని తుపాకీతో కాల్చేస్తాన‌ని బెదిరించాడు. దాంతో పోలీసులు కేసు నమోదు చేశారని వార్తా సంస్థ ‘ఏఎన్ఐ’ నివేదించింది. ఈ ఘటనలో గుర్తు తెలియని వ్యక్తిపై కేసు నమోదు చేశారు. పోలీసులు ఐపీసీ సెక్షన్ 294,506(2) కింద కేసు నమోదు చేసి తదుపరి దర్యాప్తు ప్రారంభించార‌ని ఏఎన్ఐ పేర్కొంది. శరద్ పవార్ కు ఫోన్ చేసిన వ్యక్తి హిందీలో మాట్లాడాడు. అసభ్య పదజాలాన్ని ఉపయోగిస్తూ చంపేస్తానని బెదిరించాడు. అదే నెంబర్ నుంచి దాదాపు 20 నుంచి 25 కాల్స్ వచ్చాయి. కాగా.. ఫోన్ చేసిన వ్యక్తిని గుర్తించామని, అతడు బీహార్ వాసి అని పోలీసులు తెలిపారు. గతంలో కూడా ఇదే వ్యక్తి శరద్ పవార్‌కు ఫోన్ చేసి చంపేస్తానని బెదిరించాడు. ఆ ఘటనలో అంతకు ముందే పోలీసులు కస్టడీకి తీసుకున్నారు. విచారణ అనంతరం విడుదల చేశారు.

కాగా.. తాజా కేసులోనూ నిందితుడిని పోలీసులు త్వరలో అదుపులోకి తీసుకోనున్నారు. ఇదిలా ఉండగా కొంత కాలం కిందట కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీకి కూడా ఇలాంటి బెదిరింపులే వచ్చాయి. భారత్ జోడో యాత్ర సందర్భంగా ఆయన నవంబర్ 28న మధ్యప్రదేశ్‌లోని ఖల్సా కాలేజీలో ప్రసంగించాల్సి ఉంది. అయితే ఆ ప్రదేశంలో బాంబు పెట్టామని లేఖ ద్వారా బెదిరింపు వచ్చింది. ఇండోర్‌లోని ఓ దుకాణంలో లేఖ దొరికింది. ఈ బెదిరింపు లేఖ కవర్‌పై రత్లాం బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్ పేరు రాశారు. ఈ లేఖలోనే కమల్‌నాథ్‌ను కూడా బెదిరించారు. దీనిపై బీజేపీ ఎమ్మెల్యే చేతన్ కశ్యప్ స్పందించారు. ఆ లేఖకు తనకు ఎలాంటి సంబంధమూ లేదని చెప్పారు. తన పరువు తీసేందుకే ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఓ ప్రకటన విడుదల చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement