ఏక కాలంలో మూడు యుద్ద నౌకలు జాతికి అంకితం
ముంబైలో భారత నావికాదళ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని
దేశ చరిత్రలో ఇదే ప్రప్రథమమని వెల్లడి..
నేవీ సిబ్బందికి అభినందనలు
ముంబై – సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యంతో భారత దేశ చరిత్రలో మూడు యుద్ధ నౌకలను ఒకేసారి ప్రారంభించడం ఇదే ప్రప్రథమమని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. 77వ సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ముంబయిలోని నావల్ డాక్ యార్డులో రెండు యుద్ధనౌకలను, జలాంతర్గామిని ప్రధాని నేడు జాతికి అంకితం చేశారు. ఈ కార్యక్రమంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీస్ పాల్గొన్నారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్షీర్లను ఇక నుంచి నావికాదళంలో సేవలందించనున్నాయి.
ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారీ, అత్యాధునిక విధ్వంసక నౌకలలో ఒకటిగా ఐఎన్ఎస్ సూరత్ నిలవనుందని పేర్కొన్నారు. ఈ మూడు రాకతో భారత నావికాదళం మరింత బలపడిందని చెప్పారు. యుద్ధ నౌకల అభివృద్ధిలో 75 శాతం స్వదేశీ పరిజ్ఞానం ఉందని చెప్పారు. జలాంతర్గామిని ఫ్రాన్స్ కు చెందిన నేవల్ గ్రూప్ సహకారంతో అభివృద్ధి చేశామని ప్రధాని వివరించారు. ఈ మూడింటినీ భారత దేశంలోనే తయారుచేశామన్నారు. ప్రపంచంలో బలమైన శక్తిగా భారత్ మారబోతోందని, సబ్ కా సాథ్ సబ్ కా వికాస్ లక్ష్యంగా పనిచేస్తున్నామని మోదీ చెప్పారు. ఈ సందర్భంగా నేవీ సిబ్బందికి ప్రధాని మోదీ అభినందనలు తెలిపారు.
దేశ రక్షణ వ్యవస్థ మరింత బలోపేతం..
ఈసందర్భంగా ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ ఒక పోస్ట్ చేశారు. ఈ యుద్ధ నౌకలు అందుబాటులోకి రావడం వల్ల దేశ రక్షణ వ్యవస్థ, నౌకాదళం మరింత బలోపేతం అవుతాయని విశ్వాసం వ్యక్తం చేశారు. రక్షణ రంగంలో భారతదేశ స్వయం సమృద్ధి దిశగా దీన్ని కీలక ముందడుగుగా మోదీ అభివర్ణించారు. యుద్ధ నౌకల నిర్మాణంలో భారత్ మంచి పట్టు సాధిస్తోందని ఆయన కొనియాడారు. ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీల్గిరి, ఐఎన్ఎస్ వాఘ్షీర్ డిజైనింగ్, నిర్మాణం పూర్తిగా భారత్లోనే జరిగిందని గుర్తుచేశారు.