Tuesday, November 26, 2024

ప్రకృతి అందాల కోయిల్‌ సాగర్‌.. ప్రారంభమైన ప్రాజెక్టు విస్తరణ పనులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ : కొండల మధ్య ప్రకృతి అందాలను ద్విగుణీకృతం చేస్తూ నిర్మించిన కోయిల్‌ సాగర్‌ సామర్థ్యాన్ని మరింత పెంచేందుకు రాష్ట్ర ప్రభుత్వం పనులు ప్రారంభించింది. ఏడవ నిజాం మీర్‌ ఉస్మాన్‌ అలీఖాన్‌ 1945లో 12వేల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు ఇంజనీరింగ్‌ నైపుణ్యానికి ప్రసిద్ధి. రూ.85 లక్షల వ్యయంతో సిమెంట్‌ను ఉపయోగించకుండా డంగుసున్నంతో నిర్మించిన ఈ ప్రాజెక్టు కాలం విసిరిన సవాళ్లను అధిగమించి సగర్వంగా నిలిచింది. పర్యాటక ప్రాంతంగా ప్రజలను ఆకట్టుకుంది. అయితే క్రమేణ కాలువల పూడికలు కరువై 12వేల ఎకరాల సాగునీటి సామర్థ్యం క్రమేణ తగ్గిపోవడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై దృష్టి సారించి ఆధునీకరించేందుకు నిధులు సమకూర్చి పనులు ప్రారంభించింది.
మహబూబ్‌నగర్‌ జిల్లా దేవరకద్ర మండల కేంద్రానికి 12కిలోమీటర్ల దూరంలో నిజాం రాజు ఈ ప్రాజెక్టును నిర్మించారు. ఈ జిల్లాలో ప్రవహించే పెద్దవాగుపై దేవరకద్ర మండలం బొల్లారం గ్రామం దగ్గర ప్రాజెక్టును నిర్మించారు.

ఈ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 2.276 టీఎంలు, నిర్మాణ సమయంలో ఈ ప్రాజెక్టు సాగునీటి లక్ష్యం 12వేల ఎకరాలు. కాగా ప్రస్తుతం 50,250 వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందించింది. మహబూబ్‌ నగర్‌ జిల్లాలో పెద్ద ప్రాజెక్టు జూరాల నుంచి ఎత్తిపోతల ద్వారా ఈ ప్రాజెక్టుకు మరింత నీటిని చేరవేసేందుకు ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే 1981లో తొలిసారిగా ఆధునీకరణ పనులు ప్రారంభించేందుకు ఆనాటి ప్రభుత్వం పనులు ప్రారంభించినప్పటికీ పూర్తి స్థాయిలో నిర్వహించకపోవడంతో పనులు లక్ష్యం చేరనుంది. అయితే మరోసారి 2006లో నాటి ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి కోయిల్‌ సాగర్‌ విస్తరణ పనులకు శంకుస్థాపన చేశారు. రూ.359 కోట్ల అంచనాను రూపొందించారు. అయితే పనులు పూర్తి స్థాయిలో జరగపోవడంతో క్రస్టు గేట్ల నిర్మాణాలతోనే పనులు పెండింగ్‌లో పడ్డాయి.

- Advertisement -

తెలంగాణ ఉద్యమ సమయంలో నాటి ఉద్యమ నాయకుడు కేసీఆర్‌ కోయిల్‌ సాగర్‌ విస్తరించి 50,250 ఎకరాలకు సాగునీరు అందించనున్నట్లు ప్రజలకు ఇచ్చిన హామీమేరకు ముఖ్యమంత్రి పదవి చేపట్టగానే ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశలో నీటి పారుదల ప్రాజెక్టులకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చారు. ఇందులో భాగంగా రెండువిడతలుగా సవరించిన నిధులను ప్రభుత్వం అనుమతించింది. మెదటి దశలో రూ.567.22 కోట్లు, అదనపు పనులకోసం రూ.157 కోట్ల కేటాయింపులు చేశారు.
కోయిల్‌ సాగర్‌ 12వేల ఎకరాలకు సాగునీరు అందించే సామర్థ్యం ఉండగా అదనంగా 38,250 ఎకరాల కొత్త ఆయకట్టు ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం ప్రతిపాదించి పనులు ప్రారంభించింది. ఈ పనుల్లో భాగంగా కోయిల్‌ సాగర్‌ కుడి, ఎడమ కాలువలను ఆధునీకరించి జూరాల నుంచి 3.90 టీఎంసీల నీటిని ఎత్తిపోసేందుకు పనులు జరుగుతున్నాయి. కుడి కాల్వ 12.7 కిలోమీటర్ల పొడవునా పనులు జరుగుతున్నాయి.

2021లో ఎడమ కాలువ పనులు ప్రారంభమైన పూర్తి కాలేదు. ఈ రెండు కాలువలపై 18 అవుట్‌ లెట్లు, 8 కాజ్‌ వేలు, 18 తూములు, 8వంతెనలతో పాటుగా 52 పనులు జరుగుతున్నాయి. జూరాల నుంచి రెండుదశల్లో 118మీటర్ల ఎత్తు నుంచి 3.90 టీఎంసీలు కోయిల్‌ సాగర్‌కు ఎత్తిపోసేందుకు కృష్ణా ట్రిబ్యునల్‌కు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు పంపించింది. అలాగే పర్యావరణ అనుమతులు ఈ ప్రాజెక్టుకు అవసరం లేదని జలనిపుణులు చెప్పారు. పాతప్రాజెక్టును పునరుద్ధరించేటప్పుడు ప్రత్యేకంగా తిరిగి పర్యావరణ అనుమతుల అవశ్యకత ఉండదని తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement