Friday, November 22, 2024

పొలంబడుల్లో ప్రకృతి సాగు పాఠాలు, 5 లక్షల మంది రైతులకు శిక్షణ..

అమరావతి, ఆంధ్రప్రభ : వ్యవసాయ, ఉద్యాన, వాణిజ్య పంటల సాగులో రసాయనాల వాడకాన్ని కనిష్టస్థాయికి తగ్గించి ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు ఐక్యరాజ్య సమితి రూపొందించిన మార్గదర్శకాలను అమలు చేసేందుకు ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేసింది. ఈ మేరకు ఐక్యరాజ్య సమితి అనుబంధ విభాగమైన ఆహార వ్యవసాయ సం(ఎఫ్‌ఏఓ) ప్రోటోకాల్‌ కు అనుగుణంగా రాష్ట్రంలో వివిధ పంటలు పండించే 5 లక్షల మందికి పైగా రైతులకు ఈ ఖరీఫ్‌ నుంచే శిక్షణ ఇవ్వనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పొలంబడుల సహకారంతో రైతులకు ఎఫ్‌ఏఓ బృందమే శిక్షణ ఇవ్వనుంది. ప్రజా ఆరోగ్యం పర్యావరణ పరిరక్షణ మౌలిక లక్ష్యంగా ప్రపంచవ్యాప్తంగా నిర్వహిస్తున్న అగ్రీ హెల్త్‌ ప్రాజెక్టులో భాగంగా ఏపీలోనూ రైతులకు భారీ స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ మేరకు టెక్నికల్‌ కో ఆపరేషన్‌ ప్రొగ్రామ్‌ (టీ-సీపీ) కింద రాష్ట్ర ప్రభుత్వం-ఐక్యరాజ్యసమితి బృందం మధ్య ఒప్పందం కుదిరింది. దీనిలో భాగంగా వివిధ పంటలకు సంబంధించి ఒక్కొక్క గ్రామానికి 25 ఎకరాలను ఎంపిక చేయనున్నారు.

రైతు భరోసా కేంద్రాన్ని యూనిట్‌ గా చేసుకుని విత్తు నుంచి కోతల వరకు రైతులకు 14 వారాల పాటు- శిక్షణ ఇవ్వనున్నారు. దీని కోసం రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎంపిక చేసిన పంటలను సాగు చేసే రైతులను శిక్షణకు సిద్ధం చేస్తున్నారు. వరి పండించే 2,47,500 మందితో పాటు అపరాల రైతులు 1,12,560, వేరుశెనగ సాగు చేసే 75,540, మొక్కజొన్న సాగు చేసే 33,030, పత్తి పండించే 26,520, నువ్వులు సాగు చేసే 6,900, చిరుధాన్యాలు పండించే 7,200, పొద్దు తిరుగుడు సాగు చేసే 1050, ఆముదం పండించే 150 మంది రైతులను ఎంపిక చేశారు. ఉత్తమ యాజమాన్య పద్ధతులపై రైతులకు వివరించేందుకు ముందుగా వ్యవసాయ అనుబంధ రంగాల్లోని 30 మంది ఉన్నతాధికారులకు తొలివిడత శిక్షణ ఇచ్చారు. ఈ నెల 16 నుంచి కింది స్థాయి అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు. ఈ శిక్షణలో తక్కువ ఖర్చు-అధిక దిగుబడి లక్ష్యాన్ని కూడా పొందుపర్చారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement