Friday, November 22, 2024

నాటు కోడికి భ‌లే క్రేజ్..

ప్రభ న్యూస్‌ : చికెన్‌ సెంటర్లలో నాటుకోళ్ల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. చికెన్‌ షాపు నిర్వాహకులు నాటు కోళ్లను డ్రెస్సింగ్‌ చేసి మరీ విక్రయిస్తున్నారు. నాటుకోడి మాంసంలో కొవ్వు తక్కువ ఉంటుంది. ఫైబర్‌ ఎక్కువగా ఉంటుంది. నాటుకోళ్లు ప్రకృతిలో సహజసిద్దంగా పెరుగుతాయి. వీటి పెంపకానికి స్టెరాయిడ్స్‌ అవసరం లేదు. మాంసం గట్టిగా, రుచిగా ఉంటుంది. త్వరగా జీర్ణమవుతుంది. మటన్‌తో పోలిస్తే దీని ధర తక్కువ కావడం, పోషకాలు ఎక్కువగా ఉండడం కారణంగా మాంస ప్రియులు ఎక్కువగా నాటుకోళ్లు తినడానికి ఇష్టపడుతున్నారు.

శుభకార్యాల్లోను ప్రత్యేకంగా..

శుభ కార్యాలయాల్లో ప్రత్యేకమైన వంటగా కొందరు నాటుకోడి కూర వండుతున్నారు. బంధువులు, స్నేహితులు, సన్నిహితులకు రుచికరమైన మాంసాహారం అందించేందుకు ఇష్టపడుతున్నారు. బాయిలర్‌ కోడి ధర ప్రస్తుతం మార్కెట్‌లో కిలో రూ.190 నుంచి రూ.210 వరకు ఉంది. నాటుకోడి కిలో తక్కువలో తక్కువ రూ.350 వరకు పలుకుతుంది. ఈ ధర కొన్ని సార్లు రూ.450, రూ.500 వరకు పలికిన సందర్భాలు ఉన్నాయి. అయినా మార్కెట్‌లో నాటుకోడికి ఏమాత్రం క్రేజ్‌ తగ్గడం లేదు.

పల్లెల నుంచి పట్టణాలకు తరలింపు..

పల్లెటూళ్లలో పెరుగుతున్న నాటుకోళ్లను కొందరు వ్యాపారులు ద్విచక్ర వాహనంపై వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఒక్కో కోడికి రూ.400 వరకు ధర నిర్ణయించి విక్రయదారులకు డబ్బులు అందజేస్తున్నారు. జిల్లాలో టేక్మాల్‌, వెల్దుర్తి, కౌడిపల్లి, రామాయంపేట, ఏడుపాయల నాటుకోళ్ల పెంపకం ఎక్కువగా ఉంది. పట్టణం, పెద్ద పెంచాయతీల్లోని చికెన్‌ దుకాణాల్లో ఒక్కో కోడిని కిలోకు రూ.350 నుంచి రూ.500 వరకు విక్రయిస్తున్నారు.

- Advertisement -

నాటు కోళ్లతోనే అమ్మవార్లకు మొక్కులు..

నేటికి చాలా మంది గ్రామీణ, పట్టణ వాసులు నాటుకోళ్లతోనే అమ్మవార్లకు తమ తమ మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఇంట్లో ఏలాంటి సమస్య, ఇబ్బందులు ఎదురైన అమ్మవారికి కోడిపూంజు కోస్తామని మొక్కుతారు. జాతర, ఉత్సవాలు జరిగినప్పుడు తప్పకుండా నాటుకోడిని కోసి వంటవార్పుతో సరదగా సందడిగా గడుపుతుంటారు. ఇప్పుడు జాతర్లు, ఉత్సవాలు, ఇంటికి బంధువులు వచ్చిన గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువ శాతం తమ ఇంట్లో పెంచుతున్న నాటుకోళ్లను కోసేసి మంచి రుచికరమైన భోజనం తింటున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement